శివ ధర్మాలు అంటే ..

ఒక మాసానికి ‘కృష్ణ చతుర్దశి’ ఎలాంటిదో, సంవత్సరానికి మాఘం అటువంటిది. ప్రతి మాసమూ వచ్చే కృష్ణ చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటాం. సంవత్సరానికే చతుర్దశి వంటి మాఘంలోని శివరాత్రి ‘మహా శివరాత్రి’ అని శాస్త్రాలు...

Updated : 12 Mar 2023 13:32 IST

క మాసానికి ‘కృష్ణ చతుర్దశి’ ఎలాంటిదో, సంవత్సరానికి మాఘం అటువంటిది. ప్రతి మాసమూ వచ్చే కృష్ణ చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటాం. సంవత్సరానికే చతుర్దశి వంటి మాఘంలోని శివరాత్రి ‘మహా శివరాత్రి’ అని శాస్త్రాలు నిర్దేశించాయి. శివ పర్వాల్లో అత్యంత ప్రధానమైన ఈ మహాశివరాత్రిని ‘శివ ధర్మ వృద్ధికాలం’ అంటారు. ఈ వేళలో చేసే శివధర్మాలు అత్యధిక ఫలితాలిస్తాయని, పున్నమివేళ సముద్రం పొంగినట్లుగా నేటి శివధర్మాలు కొద్దిపాటి అయినా సమృద్ధిగా ఫలిస్తాయని ‘శివపురాణ’ వచనం.

శివ ధర్మాలు ప్రధానంగా అయిదు విధాలు. అవి.. క్రియ, తపస్సు, జపం, ధ్యానం, జ్ఞానం. వీటిని చక్కగా చేస్తే ‘శివయోగి’ అవుతారు. అతడి జన్మ చరితార్థమై, కైవల్యం పొందుతాడంటాయి శైవాగమాలు. క్రియను సత్కర్మగా చెబుతారు. శివలింగాన్ని పూజించడం ఇందులో ముఖ్యం. దానం, సేవా కార్యక్రమాలు ఈ విభాగంలోనివే. శాస్త్ర పద్ధతిలో అర్చించి శివుడికి నివేదించిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. క్షేత్రాల్ని దర్శించడం, శివలీలల్ని శ్రవణాదులతో గ్రహించడం దీని భాగాలు. బిల్వార్చన, అభిషేకాలు శివకర్మల్లో కీలకమైనవి.

నియమాలతో శరీరాన్ని తగిన విధంగా శోషింపజేయడమే తపస్సు. శాస్త్రాల్లో నిర్దేశించిన వ్రతాల్ని ఆచరించాల్సి ఉంటుంది. వీటిలో మహా శివరాత్రి వ్రతం ఉపవాసానికి ప్రత్యేకం. కార్తిక, శ్రావణ మాసాల్లో శివ వ్రతాలకు ‘జాగరణ’ చెప్పలేదు. ‘నక్త’ వ్రతం (పగలు ఉపవసించి, రాత్రి ప్రారంభంలో భుజించడం) చెప్పారు. ఈ మహాశివరాత్రికి ఉపవాసమే ముఖ్యమైనది. అనంతరం- జాగరణం. ఈ రాత్రి మధ్యకాలానికి ‘తురీయ సంధ్య’ అని పేరు. శుద్ధమైన పరమాత్మతత్వానికి సంకేతమిది. ఇది యోగాల్లో ధ్యాన సమాధి స్థితిని తెలియజేస్తుంది. నిత్య సాధనల కంటే- సర్వకాల సాధనలకు సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది కాబట్టి, ఈ మహాపర్వంలో శివసాధనకు ప్రాముఖ్యముందని రుషి వాక్యం.

శాస్త్రాల్లోని చాంద్రాయణాది వ్రతాలు, ఏకాదశి వంటివాటిని శివప్రీతిగా ఆచరిస్తే అది ‘తపస్సు’ అనిపించుకుంటుంది. శివనామాలు లేదా గురువు ద్వారా పొందిన శివమంత్రాల్ని నిత్యమూ జపించడం జప సాధనలో వైశిష్ట్యం. శబ్ధరూప సాధన ప్రాణశక్తిలో దివ్యత్వాన్ని నింపుతుంది కనుక, భారతీయ యోగవిద్యలో మంత్ర యోగానికి ప్రాధాన్యమిచ్చారు. ‘యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞం శ్రేష్ఠం’ అని గీతావాక్యం. మానసిక యోగానికి, శారీరక కర్మకు బలమిచ్చే శక్తి జపానికి ఉంది. దాన్ని ‘వాచిక యజ్ఞం’ అంటారు.

జపంతో పాటు స్తోత్ర పఠన, పారాయణలు దీని పరిధిలోకి వస్తాయి. బుద్ధిని ఏకాగ్రం చేసి, ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొంది, హృదయ మధ్యంలోనో భ్రూమధ్యంలోనో శివుణ్ని ధ్యానించాలి. జ్యోతిఃస్వరూపుడిగా, అర్ధనారీశ్వరుడిగా, దక్షిణామూర్తిగా, నటరాజుగా- ఇలా అనేక స్వరూపాల్లో దేనినైనా ధ్యానించవచ్చు. ధ్యానం, స్మరణ- మానసిక యజ్ఞాలు. శ్రవణం, మననం, కీర్తనం- అనేవి జ్ఞానసాధనలో ముఖ్యమైనవి. ‘వినడం’ శారీరకం, ‘కీర్తనం’ వాచికం, ‘మననం’ మానసికం. ఈ త్రికరణాలతో శివుణ్ని గ్రహించడమే ‘మహాసాధన’... అని సనత్‌ కుమారుడు వ్యాసదేవుడికి ఉపదేశించాడంటారు.

మంగళం, శాంతి, శుద్ధం, క్షేమం, మోక్షం, భద్రం- ఇన్ని అర్థాలు ‘శివ’నామానికి ఉన్నాయి. ఈ శివమే స్వరూపంగా, స్వభావంగా కలిగిన పరమాత్మ- శివుడు. శాంతిని, శుద్ధతను, శుభాన్ని తెలియజేసే శబ్దం- ‘శమ్‌’. ఈ శాంతి శుద్ధ శుభాలకు మూలమైనవాడు ‘శంభుడు’. వాటిని కలిగించేవాడు ‘శంకరుడు’. దుఃఖాల్ని, రోగాల్ని పోగొట్టేవాడు ‘రుద్రుడు’. ఆయన దేవతలకే దేవుడైన ‘మహాదేవుడు’. శాశ్వత తత్వం కాబట్టి ‘మృత్యుంజయుడు’. లోకపాలకులకు పాలకుడు కనుక ‘మహేశ్వరుడు’.

నిరాకారంగా లింగరూపుడు. సాకారంగా బహు రూపుడు. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహంతో జీవితాన్ని శివమయం చేసుకొనే అవకాశమే మహాశివరాత్రి ఆచరణ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు