శరణం- శ్రీ గణేశం

‘గణం’ అంటే సమూహం. ఈ విశ్వమంతా గణమయం. గణాలన్నీ సమ్మిళితమై మహాగణంగా సాకారమవుతుంది. ఆ మహాగణమే ఈ విశ్వం. మనుష్య, వృక్ష, జంతు, చరాచర గణాల సమన్వితంగా ఈ సృష్టి ప్రతిఫలిస్తోంది. ఆ గణాలన్నింటిలో

Updated : 14 Mar 2023 13:02 IST

‘గణం’ అంటే సమూహం. ఈ విశ్వమంతా గణమయం. గణాలన్నీ సమ్మిళితమై మహాగణంగా సాకారమవుతుంది. ఆ మహాగణమే ఈ విశ్వం. మనుష్య, వృక్ష, జంతు, చరాచర గణాల సమన్వితంగా ఈ సృష్టి ప్రతిఫలిస్తోంది. ఆ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే భగవత్‌ చైతన్యాన్ని మన సంప్రదాయం ‘గణపతి’గా దర్శిస్తోంది. సమస్త ప్రపంచానికీ ఆధారశక్తి ‘గణపతి’ అని గణేశ గీత ప్రస్తావించింది. ప్రణవనాద స్వరూపుడిగా, మహాగణపతిని శబ్దబ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం అభివర్ణించింది. గజాననుడు అంటే జగదాననుడు. జగత్తునే ముఖంగా ధరించి సృష్టి మనుగడను పర్యవేక్షిస్తూ, ‘గణేశుడు’ లోక సంరక్షకుడిగా తేజరిల్లుతున్నాడని గణేశపురాణం పేర్కొంది.

గణేశుడు ఏకదంతుడు. అంతా ఒక్కటే, రెండోది లేదనే అద్వైత స్థితిని ‘ఏకదంతం’ సూచిస్తుంది. పరిపరి విధాలుగా సంచరించే మనసును నేర్పుగా ఒడిసిపట్టి ఏకత్వ బుద్ధితో దైవాన్ని ఆరాధించాలని సందేశమిస్తుంది. విఘ్నేశ్వరుడు వక్రతుండుడు. ప్రణవస్వరూప వక్రతుండాన్ని జ్ఞాన, ధ్యానాలకు సమన్వయంగా చెబుతారు. ప్రకృతీపురుషుల అభేదానికి గణేశావతారం సూచిక. పార్వతీదేవి శరీరం నుంచి ఉత్పన్నమైన మట్టిద్వారా గణపతి ఆవిర్భవించినట్లు శివమహాపురాణం వివరించింది. అందుకే వినాయకుడు పృథ్వీతత్త్వానికి ప్రతిబింబం. పాంచభౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వీతత్త్వంతో మేళవిస్తారు. ఆ మూలాధారానికి అధినాయకుడు- వినాయకుడు. అందుకే మట్టి వినాయకుణ్ని పూజించడం వల్ల సత్వర ఫలం చేకూరుతుందనేది పురాణ ప్రశస్తి.

సమస్త జీవజాతికి ఈశుడు- గణేశుడు. సమస్త ప్రాణులకు హితాన్ని ప్రబోధించే నాయకుడు వినాయకుడు. ఒకే పరబ్రహ్మను వివిధ రీతుల్లో ఉపాసించి, ఆరాధించే విధానాలన్నీ వేదాల్లో వ్యక్తమవుతాయి. ఆ సంవిధానంలో విఘ్ననివారక రీతికి ‘గణపతి’ని అధినాయకుడిగా వేదం విశదీకరించింది. మానవులను బాధించే విఘ్నాలనే ప్రతికూల శక్తుల్ని నిలువరించి, వారు చేపట్టిన కార్యాల్ని విజయవంతంగా పూర్తిచేయడానికి గణేశకృప ఉపకరిస్తుందనేది వేదవాక్కు.

‘పరమేశ్వరుడు, పరాశక్తి ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్న భావమే గణపతి స్వరూపం’- అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. సంకల్పసిద్ధికి ఆద్యశక్తి రూపమే గణేశుడు. ‘సిద్ధితత్త్వం, బుద్ధిమత్వం’ గణపతి అందించే అనుగ్రహ ఫలితాలు. సాధకులు ఆధ్యాత్మిక సిద్ధిని పొంది, కుశాగ్రబుద్ధితో దైవత్వాన్ని దర్శించడమే గణపతి అందించే అభీష్టవరంగా బ్రహ్మవైవర్తపురాణం పేర్కొంది. యజ్ఞతత్త్వమే గణపతి రూపంగా యజుర్వేదం వర్ణించింది. మట్టిపై సర్వత్రా మనిషి మమకారాన్ని కనబరిస్తేనే అతడికీ మనుగడ ఉంటుందని భూసూక్తం చెబుతోంది. ఆ మట్టికి సంకేతమే మహాగణపతి. వినాయకుడు సాకారమైంది వర్ష రుతువులోనే! ప్రకృతి అంతా హరితమయంగా పువ్వులు, ఆకులతో విస్తరిల్లే కాలంలో వినాయకుణ్ని మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఓషధీయుక్తమైన ఇరవైఒక్క రకాల పత్రాలతో శివనందనుణ్ని పూజిస్తున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస అనే నాలుగు గుణాల మేలుకలయికగా గణేశుణ్ని అధర్వణవేదం అభివర్ణించింది. ఈ లక్షణాలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయి. ‘నా రూపమైన ప్రకృతిని ప్రేమించండి, ఆరాధించండి. ఆ ప్రకృతే మిమ్మల్ని సదా రక్షిస్తుంది’ అనే హితకరమైన గణేశ సందేశాన్ని ఆచరించడమే పరిపూర్ణమైన గణపతి అర్చన.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని