యమ ద్వితీయ.. భగినీ హస్తాన్న భోజనం

‘భగిని’ అంటే... చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. ‘హస్త భోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లలు, అక్క  ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల రుణం ...

Updated : 14 Mar 2023 19:24 IST

‘భగిని’ అంటే... చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. ‘హస్త భోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క  ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ, ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సంప్రదాయం. కార్తిక శుద్ధ విదియనాడు మాత్రం  వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది.  దీనికి ఓ కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటంటే..

యమున- యమధర్మరాజుకు చెల్లెలు. ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష. తన ఇంటికి రమ్మని, తన చేతివంట భుజించి వెళ్ళమని, ఎన్నిసార్లో సోదరుణ్ని ఆమె అభ్యర్థించింది. కోరగా, పోరగా ఒకనాడు యముడు సోదరి ఇంటికి వచ్చాడు. ఆరోజు కార్తీక శుద్ధ విదియ. చిత్రగుప్తునితోసహా విచ్చేసిన యముణ్ని, అతని పరివారాన్ని- యమున ప్రీతిగా స్వాగతించి, స్వయంగా వంటచేసి, విందుభోజనాలతో అందరినీ చక్కగా సంతుష్టులను చేసింది.
చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు. ఏదైనా వరం కోరుకోమ్మన్నాడు. ఆరోజు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ని కోరింది. ప్రతిఏటా కార్తీక శుద్ధ విదియను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ, ప్రతిఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతివంట తిని, వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు. లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోకభయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో- ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు.
పురాణగాథలను అనుసరించి యముడికి, యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీకమాసం రెండోరోజు విదియనాడు జరిగింది కాబట్టి, దాన్ని 'యమద్వితీయ'గా పాటించటం ఆనవాయితీ అయింది. స్మృతికౌస్తుభం దీన్ని యమద్వితీయగానే ప్రకటించింది. సోదరుడిపట్ల సోదరి ప్రేమకు ప్రతీకగా- దీన్ని 'భ్రాతృవిదియ'గా పరిగణించడమూ పరిపాటి అయింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది. ఆమె చేతివంటకు ప్రత్యేకతను, పవిత్రతను ఆపాదిస్తూ 'భగినీ హస్తాన్న భోజనం' అని పిలవడం లోకంలో సంప్రదాయంగా స్థిరపడింది.
అక్కచెల్లెళ్ళ ఇళ్ళల్లో సంతోషానందాలు పంచిన కారణంగా- అన్నాతమ్ముళ్ల ఇళ్ళల్లో సుఖశాంతులు లంగరు ఎలా వేస్తాయన్నది- తర్కానికి అందే విషయం కాదు, అనుభవానికి చెందిన విషయమిది. భ్రాతృద్వితీయను శ్రద్ధగా పాటిస్తున్నవారి విషయం పరిశీలిస్తే- ఆ సౌభాగ్యపు ఛాయలు గోచరిస్తాయి తప్ప, వితర్కాలతో కాలక్షేపం చేస్తే- ఇవ్వడంలో ఉండే ఆనందం అనుభవానికి రాదు. పంచదారను చూస్తే తీపి తెలుస్తుందా... చప్పరిస్తే తెలుస్తుంది గాని!

- మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు.

- నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు.

- పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని