కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు.........

Updated : 14 Mar 2023 18:20 IST

eeeకనుమ ప్రాశస్త్యం ఏమిటి?
పూర్వీకులు చెప్పిన మాట వెనుక అసలు ఉద్దేశమిదే..

 

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ. పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే..    

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే కదా రైతుకు ఉత్సాహం.. ఉత్తేజం. పంటలు పండటంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. అందుకే వాటిని పూజించి ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకొంటారు. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు. తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు. ఆ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదట పసుపు, కుంకుమ దిద్దుతారు. ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించుకొనే గొప్ప సంస్కృతి కనుమ రోజున కనబడుతుంది. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులూ చేయించకుండా పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడతూ వాటిపట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పశు వృద్ధి, ధనధాన్యాల వృద్ధి కలుగుతుందని పెద్దల విశ్వాసం. 

అయితే, కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వ కాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది. వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుమ రోజున ఎడ్లను పూజించి వాటికి పూజలు చేస్తారు గనక ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బళ్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు. ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక ఉంది. శ్రమైక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు. అందువల్ల పశు పక్ష్యాదులకు మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించే పండుగగా ఆ రోజును పరిగణిస్తారు.  
సంక్రాంతితో ఉత్తరాయణం  మొదలవుతుంది. దేవతలకు ఇది చాలా ఇష్టమైన సమయమని పూర్వీకులు చెబుతుంటారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తారు. చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారనీ.. వారిని తలచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్లు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు. కనుమ రోజున మినుములు తింటే మంచిదన్న ఉద్దేశంతో ఆ రోజు గారెలు చేసి మాంసాహారం వడ్డిస్తారు. మినుములు చలికాలంలో వేడిని పెంచేందుకూ ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు.. అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కా చెల్లెల్లు- అల్లుళ్లతో కలిసి కుటుంబమంతా  ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకొంటారు. కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది గనక ఆ రోజు ఆగి.. పెద్దలను తలచుకోవాలనీ.. బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించాలని కొందరు చెబుతుంటారు. అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదనీ.. ఒకవేళ కాదు, కూడదు అంటూ ప్రయాణిస్తే ఆటంకాలు తప్పవంటూ పూర్వీకుల చెప్పిన ఈ మాట కూడా వ్యాప్తిలో ఉంది.
-ఇంటర్నెట్‌ డెస్క్‌

 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని