ఆ శుభముహూర్తమే విజయదశమి

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో దశమీ తిథినాడు సాయం సంధ్యాకాలంలో ‘విజయం’ అనే పేరు గల ముహూర్తం సంభవిస్తుందని, అది

Updated : 14 Mar 2023 16:45 IST

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో దశమీ తిథినాడు సాయం సంధ్యాకాలంలో ‘విజయం’ అనే పేరు గల ముహూర్తం సంభవిస్తుందని, అది సకలార్థసాధకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. మంగళకరమైన ఆ సమయంలో శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజిస్తే జీవితంలో అన్నీ విజయాలే కలుగుతాయని సంప్రదాయం చెబుతోంది. శమీవృక్షాన్నే ఎందుకు పూజించాలనే సందేహానికి శాస్త్రగ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మిచెట్టు పాపాలను దూరం చేస్తుంది. శత్రువులను తరిమికొడుతుంది. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుణ్ని సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించింది. ద్వాపరయుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలను ప్రసాదించి, యుద్ధంలో విజయుణ్ని చేసింది. ఇలా శమీవృక్షం విజయాలకు కారణం కావడం వల్ల ‘విజయదశమి’ గొప్ప పండుగగా రూపొందింది. ప్రాచీనకాలం నుంచి ప్రజాపాలకులైన రాజులకు విజయయాత్రా ముహూర్తంగా ఈ పవిత్రదినం పూజలను అందుకొంటున్నది. పూర్వం రాజులు వర్షకాలం ముగిసిన తరవాత శరత్కాలం ప్రారంభంలో విజయయాత్రలు చేసేవారు. ఆ శుభముహూర్తమే విజయదశమి.

ఆశ్వీయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది దినాలు శక్తిపూజకు ఎంతో ముఖ్యమైనవి. నవరాత్రదీక్షతో తొమ్మిది రోజులు శక్తిని పూజించిన దీక్షాపరులు, విజయదశమినాడు దీక్షను ముగిస్తారు. ముగింపు సూచనగా గ్రామం పొలిమేరలు దాటి వెళ్లి, విజయసంకేతం అయిన పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించడం పరిపాటి. పూజించిన జమ్మిఆకులను పవిత్రంగా భావించి, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి వారి శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకొంటారు.

విజయదశమినాడు ప్రకృతిలో ‘అపరాజిత’ అనే శక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తిని పూజించడం వల్ల పరాజయాలు లేని భావిజీవితం సంప్రాప్తిస్తుందని లోకుల విశ్వాసం. అపరాజితాశక్తి విజయాలను మాత్రమే కాకుండా మోక్షాన్నీ ప్రసాదిస్తుందని స్కాందపురాణం చెబుతోంది.

శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్లదశమినాడే ‘విజయ’ముహూర్తం సంభవిస్తుందని ఆర్షవాక్కు. ఈ పుణ్యదినం రోజునే పూర్వం దేవదానవులు పాలకడలిని చిలికి, అమృతాన్ని సాధించారని పురాణాల కథనం. అమృతాన్ని సాధించి పెట్టిన దినం కనుక ఇది విజయదశమిగా సార్థకమైంది. అమృతసాధక పుణ్యదినమైంది!

విజయదశమిని ‘దసరా’ అనీ పిలుస్తారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుక ‘దశహరా’ అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో ‘దసరా’ అని వాడుకలోకి వచ్చిందని పెద్దలు అంటారు. దసరా నాడు రావణకుంభకర్ణుల బొమ్మలను కాల్చివేస్తూ ‘రావణదహనం’ అని, ‘రామలీల’ అని పెద్దయెత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే ఈ ఉత్సవాల్లోని పరమార్థంగా కనిపిస్తుంది.

ప్రాకృతికంగా పరిశీలించినప్పుడు శరదృతువు ప్రసన్నతకు నిలయంగా కనిపిస్తుంది. అప్పటిదాకా వర్షాలతో చిత్తడి చిత్తడిగా మారిన నేలలన్నీ శరదృతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి.

శరత్కాలంలో చంద్రుడి కళలు ఉత్కృష్టంగా ఉంటాయి. పాడ్యమి నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరిగే ఈ దివ్యకళలను చూస్తే మనిషిలో కలిగే ఆనందోత్సాహాలు జీవితంపై ఆశాచంద్రికలను వెదజల్లుతాయి. ఈ కారణంతో విజయదశమి మానవాళికి ఆశాదీపమై కనిపిస్తుందనడంలో సందేహం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని