ధనుర్మాస విశిష్టత ఏంటి?

మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్‌ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే! భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి

Updated : 14 Mar 2023 16:22 IST

మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది. ఆ భగవత్‌ ప్రాప్తి ఎక్కడో కాదు, ఈ భూమిపైనే! భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో ఆండాళ్‌ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్పై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను (కీర్తనలను) గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల గీత మాలిక తిరుప్పావై నిరూపిస్తుంది.

తిరుప్పావై అంటే శ్రీవ్రతం. ఈ వ్రతాన్నే సిరినోము అంటారు. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశిర మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గ శీర్షమని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చేయాలి. ఎందుకంటే.. మార్గం అంటే దారి లేక ఉపాయం. శీర్షం అంటే శిరం లాగా ప్రధానమైంది. మార్గశీర్షం అంటే భగవత్‌ ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గం. ఉపనిషత్‌ సిద్ధాంతాన్ని అనుసరించి- ప్రాప్తి భగవంతుడే, ప్రాప్తించేది భగవంతమే. ఈ నమ్మకాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతం. ఉపనిషద్‌ భాషలో ధనస్సు అంటే ప్రణవం. అది పరమాత్ముని ఉనికిని తెలియజేసే నాదం. నాదం సామవేద సారం. నాదంతో (సంగీతంతో) ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరింది.

ఆమె కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో అక్కడి ఆలయ అర్చామూర్తి వటపత్ర శాయిని శ్రీకృష్ణుడిగా భావించి పూజించింది. ఆ ఆలయాన్ని నందగోప వనంగా తోటి చెలులను గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది. ద్వాపర యుగంలో రేపల్లెలో గోప కన్యలు శ్రీకృష్ణుని పొందడానికి ఈ వ్రతం చేశారని విష్ణు చిత్తుడు చెప్పగా విని ఆండాళ్‌ ఈ వ్రతాన్ని చేస్తుంది. ఆమెను శూడికొడుత్తనాచ్చియార్‌ అని సైతం భక్తితో సంబోధిస్తారు. ఆమె ముడిచి విడిచిన మాలలనే వటపత్రశాయి ఇష్టంగా స్వీకరించాడు. కనుక అలా ఆమెను పిలుచుకొంటారు. శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన గోదా చరిత్రకు అందుకే ‘ఆముక్తమాల్యద’ అని పేరు పెట్టుకొన్నారు. ఆండాళ్‌ అంటే రక్షకురాలని అర్థం. ఆమె ప్రసన్నురాలు. ప్రసన్నులు భగవంతుని ప్రేమ పొందుతారు. అలాంటి వారిని అనుసరించేవారే పరమ భక్తులు. అజ్ఞానమనే చీకటి తెరలను తొలగించేందుకు నిద్రిస్తున్న వారిని మేల్కొలిపి దైవాన్ని పొందడానికి వారికి యోగ్యతను, భోగ్యతను కలిగించే ప్రేమమూర్తి గోదాదేవి. ధనుర్మాసం ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అందునా అది హేమంతరుతువు. బాహ్య తటాకాలతో సహా ‘మానస’ సరోవరం వేకువ జామున నిర్మలంగా అచెంచలంగా ఉంటుంది. ఈ ఆనంద సమయంలో భక్తితో దేవదేవుని గానం చేస్తూ జ్ఞాన తటాకంలో స్నానం చేయడం వల్ల భక్తి సంపూర్ణత కలుగుతుంది. ధనుర్మాసం ప్రాశస్త్యత ఇదే!

గోదాదేవి పాశురాలు ఆత్మార్పణకు ప్రేరణలు. ప్రారంభ పాశురం (మార్గళిత్తింగళ్‌) లో ఆమె చెలులను నిద్రలేపుతూ- ‘చెబుతారా! మంచి వెన్నెల రోజు. వేకువ జామున స్నానానికి తగిన సమయమిదే. రమణులారా... సిరులు పొంగే రేపల్లె పడుచులారా... మేల్కొనండి. నందనందనుడైన యశోదా కిశోర సింహం మనకు వరమిస్తాడు’ అని శ్రీ వ్రతాన్ని ప్రారంభిస్తుంది. గోదాతల్లి గానం చేసిన ముప్పై పాశురాలు మూలమంత్రాలే! తిరుప్పావైలో వేకువ జాము స్నానానికి గోదమ్మ అధిక ప్రాముఖ్యమిచ్చింది. మనం రోజూ చేసే బాహ్యస్నానం కాక అంతర స్నానం చేయాలని తిరుప్పావైలో సూచించింది. అంతర స్నానం వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకొంటే భగవదనుభవం కలుగుతుంది. భగవత్‌ గుణానుభవ స్నానానికి జ్ఞానం భక్తి వైరాగ్యం అవసరం. అందుకే ఈ పాశురంలో తన చెలులను ఆమె ‘సేరిళైఈర్‌’ అని సంబోధిస్తుంది. ‘జ్ఞానభక్తి వైరాగ్యాలనే ఆభరణాలను ధరించిన చెలులారా’ అని దీని అర్థం. మరో పాశురం భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ‘ కీశు కీశున్రు ఎంగుం ఆనైచ్ఛాత్తన్‌ కలన్దు’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాశురంలో- ‘భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి కీశుకీశు ( కేశవా.. కేశవా) అంటున్నాయి. ఆ కేశవనామాలు వినరండి. గోపెమ్మా! లేచి తలుపు తెరువు. భరద్వాజ పక్షులు సైతం దైవనామస్మరణ చేస్తున్నాయి. భగవత్‌ ప్రాప్తి కోసం మనమూ శ్రీవ్రతం చేద్దాం రండి.!’ అని ఈ కీర్తనార్థం. ‘తూమని మాడత్తు శుట్రుం విళ్లక్కేరియ’ అంటూ ఒక చెలిని నిద్రలేపుతూ - ‘ఓయమ్మా మూగదానవా... చెవుడా? అలసి నిద్రిస్తున్నావా... మంత్రం వేశారా? వైకుంఠవాసుని తిరునామాలు అనుసంధానించాల్సిన సమయం ఆసన్నమైంది. జగతికే మంగళం చేకూర్చే శ్రీవ్రతం చేయాలి లే!’ అంటుంది. గోదాదేవి పాశురాలన్నీ స్వాతిముత్యపు రాశులు. ఇందులో పదహారో పాశురం ‘సాయగనాయ్‌’ ఇరవై ఏడో పాశురం ‘కుడారై’ రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాస కాలంలో శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథుని కోవెల దర్శించడం మంగళకరమని అంటారు. ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. వాసుదేవుని చరణారవిందాల వద్ద స్థానం కలిగిస్తుందని ఎందరో ప్రగాఢంగా నమ్ముతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని