ఫాల్గుణ మాసం విశిష్టత ఏమిటి?

మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 12వరకు ఫాల్గుణ మాసం. ఈ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీమహా విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. పురాణాల్లో దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో ఈ పయో వ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

Updated : 14 Mar 2023 16:02 IST

మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 12వరకు ఫాల్గుణ మాసం. ఈ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీమహా విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. పురాణాల్లో దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో ఈ పయో వ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ మాసంలో ఏం చేయాలి?
శ్రీమహా విష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, పేదలకు అన్నదానం లాంటివి చేయడం మంచిది. దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం. ఫాల్గుణ బహుళ పాఢ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయల్దేరాడని రామాయణం చెబుతోంది. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైనట్టు పేర్కొంది. హరిహర సుతుడైన అయ్యప్పస్వామి, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండటం ఫాల్గుణ మాసం విశేషాన్ని వెల్లడిస్తోంది. మహాభారతంలో ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణు పూజకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
ఫాల్గుణ మాసంలో శుద్ధ తదియ, చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారంలో వెలిసిన దుండీ గణపతికి సంబంధించిన పూజ ఇది. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నాడు పయో వ్రతాన్ని చేసి వామనుడిని పూజిస్తారు. ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజును ఫాల్గొణోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఫాల్గుణ ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది ఫాల్గుణ పౌర్ణమి. దీన్ని హోళీ పౌర్ణమి, మదన పౌర్ణమి, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర, దక్షిణ భారతాల్లో దీన్ని చాలా విశేషంగా జరుపుకొంటారు. దీన్ని వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు.
హోళీ పౌర్ణమి రోజున శివుడితో పాటు మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో హోళీ పండగ, దుండీ వినాయకుడి పూజ, వామన, లక్ష్మీనరసింహస్వామి పూజ, లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, అన్నవరం దేవస్థానం పంచాంగకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు