శ్రీకృష్ణప్రేమావేశంలో శ్రీచైతన్యులు

వంగదేశంలో పుట్టిన చైతన్యమహాప్రభుకు గౌరాంగుడని మరోపేరు. ఒక పున్నమి రాత్రి ఆయన సముద్రతీరంలో కూర్చున్నారు.

Updated : 14 Mar 2023 13:10 IST

వంగదేశంలో పుట్టిన చైతన్యమహాప్రభుకు గౌరాంగుడని మరోపేరు. ఒక పున్నమి రాత్రి ఆయన సముద్రతీరంలో కూర్చున్నారు. మురళీ కృష్ణుడి ప్రేమావేశం వల్ల వెన్నెల కాంతుల్లో మెరుస్తున్న సముద్ర కెరటాలను యమునా తరంగాలుగా భావించారు. అంతే సముద్రంలోకి పరుగుతీశారు. వలలో చిక్కుకున్న ఆ భక్తాగ్రేసరుణ్ణి బెస్తలు రక్షించారు. మరోసారి సముద్రాన్ని నీలవర్ణుడైన నవనీతచోరుడుగా తలచి సముద్రంలోకి నడిచారు. అది గమనించిన శిష్యులు వేగంగా వెళ్లి బయటకు తీసుకొచ్చారు. ఇంకోసారి విష్ణుగయ ఆలయంలో స్వామి పాదాలను స్పృశించగానే దివ్యానుభూతి కలిగింది. ఆ భావపారవశ్యంలో తానీ లోకంలోకి ఎందుకొచ్చిందీ స్ఫురించింది. వెంటనే కేశవభారతి అనే గురువు వద్దకు వెళ్లి సన్యాసం స్వీకరించి శ్రీకృష్ణనామవైభవ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

కృష్ణుడి భావావేశంలో రాధ వలెనే చైతన్యులు కూడా కృష్ణభావపరవశంలో తిరిగేవారు. ఘోర అరణ్యాల్లోనూ కృష్ణనామాన్ని గానం చేస్తుంటే క్రూరమృగాలు కూడా ఆనందపారవశ్యంలో నృత్యం చేసేవట! భగవంతుడి వద్దకు భక్తులు వెళ్లే సంప్రదాయాన్ని భక్తుల వద్దకే దేవుడు వచ్చే సంప్రదాయంగా మార్చి నామసంకీర్తనతో వీధుల్లో తిరిగేవారు. ‘ఈ లోకంలో నామసంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేసి, దాన్ని జనరంజకం చేయడమే నా జీవితాశయం’ అని నినదించారు. విషయభోగాలపై ఆసక్తి గల జీవుడు భవరోగగ్రస్థుడు అవుతాడని హెచ్చరించారు. సంసారభోగాల నుంచి ఉపశమనం కలగాలంటే కృష్ణ నామ ప్రవాహంలో మునకలేయాలన్నారు. శరీరంపై తక్కువ శ్రద్ధ వహించేవారాయన. స్వల్పకాలం నిద్రించేవారు. ‘తనను తాను తెలుసుకోవటానికి దేహంపై శ్రద్ధ వహించటమంటే నదిని దాటడానికి మొసలిని నమ్ముకున్నట్లే!’ అనేవారు.          

 చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని