భజే వాయుపుత్రం భజే బ్రహ్మతేజం

నవవిధ భక్తిమార్గాల్లో దాస్య భక్తికి అసలైన ప్రతినిధి హనుమ. నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికి రుద్రస్వరూపుడైన హనుమ దాసునిగా ఎందుకు వచ్చాడు? దాని అర్థాలు, పరమార్థాలు ఎలా ఉన్నా మూల కారణం మాత్రం లోక కల్యాణమే.

Updated : 11 May 2023 08:19 IST

సంజీవనీ పర్వతాన్ని అలవోకగా పెళ్లగించిన శక్తిమంతుడు హనుమంతుడు. చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చిన పవనసుతుడు. శోకసంద్రానున్న సీతమ్మను ఓదార్చిన అంజనీపుత్రుడు. మహా బలశాలి అయ్యుండీ రామబంటుగా ఒదిగిన వీరాంజనేయుడు. భక్తుల భయాలన్నీ తొలగించి విజయాలను చేకూర్చే ప్రసన్నాంజనేయుడు. హనుమంతుడొక అద్భుతం.. ఆయన జన్మరహస్యాలు మరింత అబ్బురం..


అతులితబలాధామ్‌ స్వర్ణశైలాభదేహం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి


నవవిధ భక్తిమార్గాల్లో దాస్య భక్తికి అసలైన ప్రతినిధి హనుమ. నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికి రుద్రస్వరూపుడైన హనుమ దాసునిగా ఎందుకు వచ్చాడు? దాని అర్థాలు, పరమార్థాలు ఎలా ఉన్నా మూల కారణం మాత్రం లోక కల్యాణమే. పూర్వ గార్దభ నిస్వనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి తన మరణరహస్యం తనకూ పరమేశ్వరుడికీ తప్ప మరెవ్వరికీ తెలియకుండా శివుడి నుంచి వరం పొందాడు. కాలక్రమంలో ఆ రాక్షసుడు లోకకంటకుడిగా తయారవడంతో శివుడు విసుగుచెందాడు. కానీ మాటిచ్చినందున నారాయణునికి గార్దభ నిస్వనుడి మరణరహస్యం చెప్పలేదు. ఏదైనా యుక్తితో రాక్షసుణ్ణి సంహరిస్తే దాసుడినై సేవించుకుంటానని మాటిచ్చాడు మహాశివుడు. నారాయణుడు మోహినీ అవతారంతో రాక్షసుణ్ణి మోహితుని చేసి వృక నరావతారంతో (తోడేలు ముఖం మానవ శరీరం) సంహరించాడు. హరుడు హరికి ఇచ్చిన మాటను అనుసరించి రామావతారంలో హనుమంతుడిగా జన్మించి వెన్నంటే ఉండి సేవించుకున్నాడు.

సరస్వతీదేవి ఒకసారి ఏ లోపమూ లేని మహా సౌందర్యవతిని సృష్టించమని బ్రహ్మదేవుణ్ణి కోరింది. దాంతో అహల్యను సృష్టించాడు బ్రహ్మ. ఆ అందానికి ముగ్ధుడైన ఇంద్రుడు ఆమెతో వివాహం చేయమని కోరాడు. కానీ బ్రహ్మ నారదుడి సూచన మేరకు తన కూతురు అహల్యకు గౌతముడితో పెళ్లి చేశాడు. ఈ గౌతమ, అహల్యల కుమార్తే హనుమ తల్లి అంజనాదేవి. ఆమెకి కేసరితో పెళ్లయినా సంతానంలేక భర్త అనుమతితో తపస్సు చేసింది.
రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి తన తేజస్సును కాంతి రూపంలో బయటకు తీయగానే బ్రహ్మ, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, ఇతర దేవతలు కూడా తమ శక్తులను దానికి జోడించి శివుడికి సమర్పించారు. అనంతరకాలంలో మహాశివుడు తనలోని రుద్రాంశను పార్వతీగర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ శివశక్తి తాపాన్ని భరించలేని పార్వతి ఆ తేజస్సును అగ్నికి సమర్పించింది. అగ్ని కూడా భరించలేక వాయువుకు అర్పించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో ఆ శక్తిని స్వీకరించిన వాయుదేవుడు ‘దేవప్రసాదాత్‌ తే గర్భే మహావ్యక్తిర్భవిష్యతి’ అంటూ బిడ్డల కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు.
వైశాఖేమాసి కృష్ణాయాం
దశమి మందసంభూత
పూర్వప్రోష్ణ పదాయుక్త తథా
వైధృతి సంయుత

తస్యాం మధ్యాహ్న వేళాయాం జనాయామాస వైసుతం
వైశాఖమాస కృష్ణపక్ష దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగం మధ్యాహ్నం వేళ అభిజిత్‌ లగ్నంలో హనుమ అవతరించినట్లు పరాశర సంహిత చెబుతుంది. పరాక్రమవంతుడు కేసరి, అందాలరాశి అంజనలకు వాయు దేవుడి అనుగ్రహంతో పరిపూర్ణ రుద్రాంశతో జన్మించినవాడే శక్తి సౌందర్యాలు కలబోసిన వీరాంజనేయుడు.

పుట్టిన పది రోజుల్లోనే ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భ్రమించి మింగబోయిన అహల్యా మనవడైన అంజనీసుతుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమల (దవడల) మీద కొట్టడంతో హనుమ పేరు స్థిరపడింది. వజ్రాయుధం దెబ్బకు సొమ్మసిల్లిన హనుమ స్థితికి కోపగించాడు వాయు దేవుడు. అతణ్ణి ప్రసన్నం చేసుకునే పరంపరలో త్రిమూర్తులతో సహా దేవతలంతా హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించి దీవించారు. సకలదేవతలూ, రుషుల వరప్రభావంతో మరింత శక్తిమంతుడయ్యాడు. బాల్య చాపల్యంతో ఆశ్రమ వాతావరణా నికి భంగం కలిగిస్తున్నాడని.. పరులు గుర్తుచేస్తే తప్ప తన శక్తి తాను గ్రహించలేడని హనుమను శపించారు మునులు. అందుకే సుగ్రీవుడికి మంత్రి అయ్యుండి కూడా వాలిని ఎదిరించ లేకపోయాడు హనుమ.


వైశాఖం హనుమకు ప్రత్యేకం

ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు విశిష్టత ఉంటుంది. శివుడికి కార్తికం, విష్ణువుకి మార్గశిరం, అమ్మవారికి ఆశ్వయుజంలా హనుమంతుడికి వైశాఖం విశిష్టమైంది. వైశాఖ శుక్ల ఏకాదశి హనుమ తల్లిదండ్రులైన కేసరి అంజనల వివాహం, వైశాఖ కృష్ణదశమి స్వయంగా హనుమ జన్మదినం. వైశాఖ బహుళ షష్ఠి సూర్యుని మింగబోయిన రోజు. వైశాఖ శుద్ధ షష్ఠి తన శక్తిని తాను గ్రహించలేడంటూ మునులు శపించిన రోజు. వైశాఖ శుద్ధ పంచమి సూర్యుడి వద్ద హనుమ విద్యాభ్యాసం ఆరంభించిన రోజు. వైశాఖ బహుళ పంచమి సుగ్రీవుడి వద్ద మంత్రిత్వ స్వీకారం. హనుమద్వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించింది వైశాఖమాసంలోనే. హనుమదవతారానికి మూలమైన గార్దభనిస్వనుని వృకనరావతారంలో విష్ణువు సంహరించిందీ వైశాఖ పూర్ణిమ నాడే. విశాఖకు సంబంధించింది వైశాఖం. శాఖ అంటే కొమ్మ. కొమ్మలపై విశిష్టంగా సంచరించేది వానరం. ఆ రకంగా వైశాఖ మాసానికీ వానరావతారానికీ అన్వయం కూడా చెప్పవచ్చు.


శక్తి సౌందర్యాల సమ్మేళనం

ఒక్క పూటలో 88 వేల మంది రాక్షసుల్ని సంహరించిన అతులిత బలధాముడు, రావణుడు బాణాల్ని వర్షధారలా కురిపిస్తున్నా లెక్కచేయక రామచంద్రుని తన భుజాలపై ఎత్తుకుని యుద్ధానికి సహకరించిన స్వర్ణశైలాభ దేహుడైన హనుమ సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘ఆంజనేయం అతిపాటలాననం’, ‘సుందరీ సుందరో కపిః’ అన్నారు మహర్షి.
అందమే ఆనందం. ఆనందమే అందం. సీతమ్మ జాడ రామయ్యకు, రామయ్య క్షేమం సీతమ్మకు తెలియజేసి సీతారామ లక్ష్మణ సుగ్రీవ జాంబవంతుడు తదితరుల విషాదభరిత జీవితాల్లో ఆనందాన్ని నింపిన సన్నివేశాల్ని సుందరకాండగా మలిచిన బహు సుందరుడు హనుమ. అలా శక్తి సౌందర్యాల సమ్మేళనమే హనుమ.
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం పూర్ణావతారంగానో శేషావతారం గానో భగవంతుడు అవతరించడం సహజం. కానీ మరే అవతారంలో లేని సంక్లిష్టత, ఎందరో రుషులూ, దేవతల జోక్యం ఆంజనేయుడి అవతారంలో ఉంది. రుద్రస్వరూపుడిగా అవతరించిన హనుమకు పార్వతి తోకరూపంలో తనశక్తిని ప్రసాదించినట్లుగా పురాణ కథనాలున్నాయి. అందువల్లనే హనుమంతుడి వాల(తోక) పూజకెంతో శక్తి ఉందంటారు. దాస్యభక్తికి పరిపూర్ణ ఉదాహరణగా నిలిచిన హనుమంతుడు తనకోసం ఏమీ చేసుకోని మహావీరుడు.

డాక్టర్‌ ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని