పంచభూతాల మైత్రి ప్రశాంత ధరిత్రి

‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దేన్నయినా మనం కాపాడితే అది మనల్ని అక్కున చేర్చుకుంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

Updated : 01 Jun 2023 06:13 IST

జూన్‌ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దేన్నయినా మనం కాపాడితే అది మనల్ని అక్కున చేర్చుకుంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే అతివృష్టి, అనావృష్టి, భూకంపాల రూపంలో ప్రకృతి ప్రళయతాండవం చేస్తుంది.

ర్రిగింజను తనలో పొదువుకుని మహావృక్షాన్ని అందించ గల శక్తిశాలి పుడమితల్లి. ఏకకణజీవి మొదలు బుద్ధి జీవులమని విర్రవీగే మనుషుల వరకూ కోట్లాది విభిన్న జీవజాతులను కడుపున పెట్టుకుని సంరక్షించే కరుణామయి, కల్పవల్లి ధరణి.

వాయుమతీ జలశయనీ శ్రియందా రాజా సత్యంధో పరిమేదినీ శ్వో పరిధాత్తం పరిగాయ

అంటోంది రుగ్వేదం. ‘నేలతల్లి గాలిని తనలో ఇముడ్చుకుంది. జలాశయాలకు ఆశ్రయమిస్తుంది. అనంత సంపదను కలిగుంది. మొత్తంగా సమస్త సృష్టిలో సమృద్ధ సారసంపదతో చరాచర ప్రాణికోటినీ ఆదరించగలిగేది భూతలమొక్కటే. అందుకే హిరణ్యాక్షుని చేతిలో చిక్కిన భూరక్షణకు సాక్షాత్తూ విష్ణువే వరాహావతారమెత్తాడు. ‘పృథ్వి మా తల్లి, విశాల గగనమే మా తండ్రి, సకల చరాచరాలు మాసహోదరులే’ అనేవారు ఋగ్వేద కాలంలో. ఈ భావనే పర్యావరణాన్ని వసుధైక కుటుంబంగా విలసిల్లచేస్తుందనేది వారి ఉద్దేశం. సృష్టికర్త సమపాళ్లలో నిర్దేశించిన పంచభూతాలను ప్రకృతి శక్తులుగా, దేవతలుగా ఆరాధించడం వారి సంస్కారం. అందుకే...

ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యాం ఓషధియః ఓషధీభ్యో అన్నం అన్నాత్‌ పురుషః

అన్నారు. బ్రహ్మ తపోఫలమంతా ఈ ధరణిపై ఓషధులకు ధారపోశాడు గనుకనే సృష్టిలోని జీవజాలమంతా స్థైర్యగా బతకగలుగుతోంది. గుడ్డిగా రాయీరప్పా, చెట్టూపుట్టాను దేవుడనటం మూఢత్వమని కొట్టిపారేస్తారు కొందరు. కానీ ‘ఈశావాస్యమిదం సర్వం’ అన్నట్లు రేణురేణువునా నిండి ఉన్న భగవత్‌ స్వరూపాన్ని గౌరవించటం అందులో దాగి ఉన్న రహస్యం. ‘ఆత్మవత్‌ సర్వభూతాని’ అంటూ.. సర్వ జీవులూ తన లాంటివే, ప్రతి జీవి అవసరమూ తన అవసరం వంటిదే- అన్న గొప్ప జీవనసత్యాన్ని నిత్యం అనుభవింపచేయటాన్నే రుషులు కాంక్షించారు. ‘తత్‌ సృష్ట్వాతదేవానుప్రవిశత్‌ సర్వం ఖల్విదం బ్రహ్మ’ అంటూ ఉద్ఘాటించిన రుగ్వేదం ప్రకారం మేధావులైనంత మాత్రాన మనుషులు సృష్టిలోని ఏ ఇతర జీవుల కన్నా ఉన్నతమూ కాదు, ఇతర జాతులపై ఆధిపత్యం చెలాయించడం తగిన పనీ కాదు. అలా భావించి విశ్వక్రమాన్ని ఎదిరించిన మహాబలవంతులు సైతం మట్టికరిచారన్నది నిజం. అందుకే మనం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా, ఇతర ఏ జీవి ప్రాథమిక అవసరాలకూ భంగం కలగనీయకుండా తగిన ఆచారవ్యవహారాలు ఏర్పాటయ్యాయి. వేదరుషులు ప్రకటించిన భూసూక్తం, ఓషధీ సూక్తం, అరణ్యాని సూక్తం మొదలైనవి సృష్టిస్థితికారిణి, ఓషదీ నిలయంగా  భూమిని కీర్తించాయి. పంచభూతాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడినవే. వాటి నిష్పత్తిలో ఏ చిన్న మార్పు వచ్చినా పర్యావరణం విపరీత ప్రభావానికి లోనుకాక తప్పదు. అందుకే ‘ఓం ద్యో శాంతి రంతరిక్షం శాంతి పృథ్వీ..’ అంటోంది శాంతి సూక్తం. పంచభూతాలతో పాటు ప్రాణికోటి మొత్తం శాంతిసౌఖ్యాలను పొందాలన్నదే ఆశ. పచ్చటి ఆకులతో భూమంతా అల్లుకున్న అరణ్యాలు ఓషధీనిలయాలు. తన కంటూ ఏమీ దాచుకోకుండా నిస్వార్థ సేవనందిస్తాయి చెట్లు. ఒక చెట్టు పదిమంది కొడుకులతో సమానమన్నది పురాణోక్తి. పరోపకారంలో, త్యాగనిరతిలో తరువులు గురు సమానం అంటుంది మన సంస్కృతి. తులసి, వేప, నిమ్మ, ఉసిరి వంటి వందల రకాల వృక్ష జాతులు దీనికి సాక్ష్యం.

పాశంతో కట్టివేయడాన్ని పశువు అంటారు. గోవును సిరిసంపదలిచ్చే కామధేనువు అన్నారు. అందరి దాహం తీర్చటానికి పరుగులు తీసే నదీమతల్లులూ పూజనీయ స్థానాన్ని పొందాయి. భగవత్‌సృష్టిలో చీమలు మొదలు ప్రతి జీవీ ప్రత్యేకమైందే. దేని స్థానం దానిదే. మృగరాజైన సింహం సైతం ఆకలి తీర్చుకోవటానికే వేటాడుతుంది తప్ప సరదాకు కాదు. విషపుపురుగని పేరుపడిన పాము ఆత్మరక్షణకే పడగ విప్పుతుంది. అలా ప్రతి జీవీ తన తిండి, నిద్ర, మనుగడ కోసమే వెంపర్లాడుతుంది. రాగబంధాలనే పాశాలతో చిక్కుపడిన మనమూ పశువులమే కదా! కానీ సమస్త జంతుజాతికీ భిన్నంగా మనిషి మాత్రం తన కోసం, తనవారి కోసం, చూడనైనా చూడని భావితరాల కోసం.. ప్రకృతిపై, చుట్టూ ఉన్న జీవజాలంపై పెత్తనం చెలాయిస్తున్నాడు. కృతజ్ఞత చూపాల్సిన చోట విచక్షణ లేకుండా కాలుష్యాన్ని నింపుతున్నాడు. నిజానికి మన అవసరాలన్నిటికీ తగినంతగా ప్రకృతిలో వనరులున్నాయి. కానీ వృథా చేసేంతగా కాదు’ అన్న మహాత్ముని మాట ఆదర్శం, అనుసరణీయం.

విజ్ఞానశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతూ సృష్టి రహస్యాలను ఛేదిస్తున్న నేటి కాలంలో పర్యావరణాన్ని కాలుష్యంపాలు చేయకూడదనే విన్నపాలు వినిపించటం ఒకింత శోచనీయం. ‘పర్యావరణ పరిరక్షణకు మన సంకల్ప దౌర్బల్యం మినహా మరే ఇతర అడ్డంకీ లేదు’ అన్నారు రమణమహర్షి. వారి మాటకు తలొగ్గుతూ మేధావులం అనుకునే మనమంతా ఒకటై మనదైన పర్యావరణాన్ని కాపాడుకుందాం. సహజ వనరుల సద్వినియోగానికి, జీవ వైవిధ్య సంరక్షణకు ప్రతిన పూనుదాం. ‘ప్రకృతికి చెందిన ఏ కార్యకలాపాలైనా నియమానుసారం సాగుతాయి. వాటిని అతిక్రమించలేం. అలా చేస్తే సృష్టి అంతరిస్తుంది. ఇక తర్వాతేమీ మిగలదు’ అన్న వివేకానందుడి ఆశీస్సులతో పర్యావరణ పరిరక్షణ దిశగా పరుగులు తీద్దాం.

ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్‌ దుఃఖభాగ్భవేత్‌

పార్నంది అపర్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని