మృగశిర పలకరింపు పుడమి పులకరింపు

మృగశిర కార్తెలో ముల్లోకాలూ చల్లబడతాయి.. మృగశిరలో ముసలెద్దు కూడా రంకె వేస్తుంది.. లాంటి సామెతలెన్నో వింటుంటాం. ఈ కాలంలో రుతుపవనాలతో చల్లదనాలు విచ్చుకుంటాయి. తొలకరి వర్షాలు పడగానే కర్షకులు హలం పట్టి పొలం దున్ని పంటలు పండించేందుకు సిద్ధమౌతారు.

Updated : 08 Jun 2023 04:13 IST

(జూన్‌ 9 మృగశిర కార్తె ప్రారంభం)

మృగశిర కార్తెలో ముల్లోకాలూ చల్లబడతాయి.. మృగశిరలో ముసలెద్దు కూడా రంకె వేస్తుంది.. లాంటి సామెతలెన్నో వింటుంటాం. ఈ కాలంలో రుతుపవనాలతో చల్లదనాలు విచ్చుకుంటాయి. తొలకరి వర్షాలు పడగానే కర్షకులు హలం పట్టి పొలం దున్ని పంటలు పండించేందుకు సిద్ధమౌతారు. వృద్ధీ, సమృద్ధీ కలిగించే మృగశిర మహా విశిష్టమైంది.

పున్నమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటే ఆ నెలను ఆ పేరుతో పిలుస్తారు. చిత్తా నక్షత్రంతో ఉంటే చైత్రమాసం, విశాఖతో ఉంటే వైశాఖం. అలా నక్షత్ర ప్రభావం నెలరోజులుంటుంది. అలాగే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ‘కార్తె’ అంటారు. అశ్విని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలు. ఉగాది మొదలుకొని ప్రతి పదమూడున్నర రోజులకొకసారి సూర్యుడు ఒక్కో నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఆ కార్తెను ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. ఆ ప్రకారం సంవత్సరానికి 27 కార్తెలు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించడమే మృగశిర కార్తె. మృగం అంటే లేడి, శిరం అంటే తల. ఈ రెండింటి సమాహారమే మృగశిర. రెండు కొమ్ములతో లేడితలలా ఉండే ఈ నక్షత్రం దేవగణానికి చెందింది. అధిపతి కుజుడు.

నానుడులూ సామెతలూ

ఈ నక్షత్రానికి మృగశీర్ష, ఇల్వలా అంటూ నామాంతరాలు కూడా ఉన్నాయి. కార్తెల్లో నక్షత్రాలను బట్టి ప్రకృతిలో మార్పులుంటాయి. ఎండలతో తపించిన ప్రాణికోటికి ఉపశమనంగా మృగశిర కార్తెతో వానలు ఆరంభమవుతాయి. గ్రీష్మతాపానికి ముగింపు, తొలకరి చినుకులతో పుడమి పులకరింపు, అదే మృగశిర కార్తె పలకరింపు. అందుకే ‘మృగశిరతో ముగుస్తుంది తాపం’, ‘మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడతాయి’ లాంటి నానుడులు, సామెతలూ అనేకం పుట్టుకొచ్చాయి.

మూడు కాలాలూ శూన్యం

వాతావరణపరంగా సంవత్సరంలో గ్రీష్మ, వర్ష, శీతా కాలాలు ముఖ్యమైనవి. రథసప్తమి నుంచి వేసవి మొదలౌతుంది. మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రవేశిస్తుంది. ఇక ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నాడు శీతాకాలం ఆరంభమౌతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః అంటోంది భగవద్గీత. అంటే అన్నం వల్ల జీవజాలం పుడుతోంది. ఆ అన్నం వర్షంతోనే సమకూరుతుందని భావం. సకల జీవుల అవసరాన్నీ తీర్చే ఆహారం సమకూరడానికి వర్షమే ఆధారం. ఆ 4 నెలలు వానలు కురవకపోతే, ఏడాదంతా శూన్యమే. అందుకే వర్షానికి గౌరవ సూచకంగా సంవత్సరాన్ని ‘వర్షం’ అన్నారు. ప్రాణాధార వర్షం కురిసే మృగశిర కార్తె హర్షదాయకం, సంపత్కారకం కూడా.

వేదాల్లోనూ కార్తెలు

వర్షం ప్రాణాధారం. ముఖ్యంగా వ్యవసాయానికి ఆయా కాలాల్లో వాన అవసరం. వర్షరుతు ప్రాధాన్యాన్ని.. సంవత్సరం శశయానా బ్రాహ్మణావ్రతచారిణః
వాచం పర్జన్య జన్వితం ప్రమండూక అహంషుః ఈ రుగ్వేద సూక్తం తెలియజేస్తుంది. మౌనవ్రతం పట్టిన ద్విజుల్లా అందాకా విశ్రాంతి తీసుకున్న కప్పలు మృగశిర కార్తెకు గళం విప్పాయన్నది భావం. వర్షాగమనాన్ని సూచిస్తూ తూనీగల్లాంటి కీటకాలూ కలకలం చేస్తాయి. వేదభూమిలో భూత భవిష్యత్‌ వర్తమానాలను తిలకించడం మునులకే కాదు జంతు కీటకాలకూ సాధ్యమని నిరూపిస్తుందిది.

వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే శిష్యుడైన యాజ్ఞవల్క్యుడికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడు. ఈ ఉపనిషత్తు వర్షానికి అధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతో ప్రారంభమౌతుంది. నారదస్మృతి, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర తదితర గ్రంథాల్లో మృగశిరకార్తె ప్రాముఖ్యత లిఖితమైంది. వ్యవసాయానికి సంబంధించి ‘కృషి పరాశరం’ అత్యంత ముఖ్యమైన సమాచార గ్రంథం. అందులో ఏయే కాలాల్లో వర్షపాతం ఎలా ఉంటుంది, మృగశిర కార్తెలో నిర్వహించాల్సిన వ్యవసాయ కార్యక్రమాలేంటి, దున్నేటప్పుడు ఎద్దుల పట్ల చూపవలసిన కరుణ, దయ- లాంటి అనేక అంశాలను ఈ గ్రంథంలో వివరించారు. ‘సస్యానంద’ గ్రంథంలోనూ అనంతామాత్యుడు వ్యవసాయ సమాచారం, మృగశిరకార్తె విశేషాలు అందించాడు. అంతవరకూ బీజంలో నిద్రాణమై ఉన్న జీవం మృగశిర కార్తెలో మేఘ గర్జనతో చైతన్య వంతమై, పుడమిస్పర్శతో మొలకగా మారుతుందంటూ వర్ణించాడు. బృహత్సంహితలో వరాహమిహిరుడు రుతుపవనాల రాకను లెక్కకట్టే విధానాన్ని తెలియజేశాడు. వీటి ఆధారంగానే కార్తెలూ, వాటి లక్షణాలూ స్పష్టమవుతున్నాయి.

ఆయా కార్తెలు.. లోక ప్రసిద్ధాలు..

భరణి కార్తె భరించలేం (ఉక్కపోత వాతావరణం), రోహిణి కార్తె రోళ్లను బద్దలుకొడుతుంది (భయానక ఉష్ణోగ్రత), ఆరుద్రలో అడ్డెడు జల్లితే పుబ్బలో పుట్టెడు పండుతాయి, ఉత్తర చూసి ఎత్తర గంప (అప్పటికీ వర్షం కురవకపోతే వలస వెళ్లిపోమన్న ఉపదేశం) ఇలా ఆయా కార్తెలకు సంబంధించిన అనేక సామెతలు లోకప్రసిద్ధం అయ్యాయి.

చేపలు తినాలట

మాంసాహారుల కుటుంబాల్లో మృగశిర కార్తెలో తప్పకుండా చేపలను తినాలనే ఆచారముంది. ఎండలు తగ్గి వాతావరణం చల్లబడటంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేడి సమతుల్యంగా ఉండేందుకు చేపలను తినాలన్నదే ఇందులో ఆంతర్యం. ఈ వాతావరణంలో చేపలు తినడం అనుకూలమని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. అందుకే చేప ఆధారిత ఔషధాలను మృగశిర కార్తెలోనే సేవింపజేస్తారు. ఈ కార్తెలో చిత్తడి నేల వల్ల జలుబు, జ్వరం, దగ్గు లాంటి అనారోగ్యాలకు అవకాశముంది. జీర్ణశక్తి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గడం కద్దు. వాటిని నిరోధించేందుకు చేపలు, చింతచిగురు, ఇంగువ లాంటివి తింటారు. కొందరు ఇంగువను బెల్లంలో కలిపి ఉండలుగా చేసి తింటారు.

మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, అందాకా ఉన్న ఉష్ణ తీవ్రత నుంచి ఉపశమనం కలుగుతుంది. రైతులు ఏరువాక సాగే కాలం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్సాహానికీ, వృద్ధికీ సూచన ఈ కార్తె.

కె.వి.యస్‌.యస్‌.శారద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని