అంతిమ లక్ష్యం

ఒక ధనికుడు ఎన్నో మంచి పనులు చేసి కీర్తి గడించాడు. కులగురువు దయ వల్ల అతడికి అన్ని ప్రాణుల భాష అర్థం అవుతుంది.

Published : 04 Jul 2024 00:09 IST

ఒక ధనికుడు ఎన్నో మంచి పనులు చేసి కీర్తి గడించాడు. కులగురువు దయ వల్ల అతడికి అన్ని ప్రాణుల భాష అర్థం అవుతుంది. ఒకరోజు ఉదయాన ఆయన పచార్లు చేస్తుండగా, గగనాన వెళ్తున్న రెండు హంసల సంభాషణ వినిపించింది. అందులో మగపక్షి- ‘గొప్పవాడైన ఇతడి తలమీది నుంచి కాకుండా కాస్త పక్కాగా పద! లేదంటే అతని తేజస్సుకి నువ్వు బలి కావాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించింది. అది విన్న ఆడపక్షి- ‘మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఆత్మవిద్య నేర్చిన రైక్వుడి కంటే ఇతడు గొప్పవాడేం కాదు’ అంది. అలా పక్షులు దూరంగా వెళ్లిపోయాయి. ధనికుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే సేవకులను వెంటబెట్టుకుని ఆరొందల మేలిమి గోవులు మొదలైనవాటితో రథసారథి అయిన రైక్వుడి వద్దకు వెళ్లి.. ఆత్మవిద్యను బోధించమని అడిగాడు. దానికతను ‘అది కానుకలతో కొనే విద్య కాదు’ అన్నాడతడు. ధనికుడికి బాధ కలిగినా, నిగ్రహించుకుని వెనుతిరిగాడు. కానీ ఇంకోసారి రైక్వుణ్ణి కలిసి- ‘మన అంతిమ లక్ష్యం ఏమిటి?’ అనడిగాడు. ఈసారి ధనికుడిలో ఎలాంటి భేషజం లేదు. అహంకారాలూ, ఆడంబరాలూ లేవు. సాదా దుస్తులతో, వినయంగా కనిపించగా.. రైక్వుడు ఇలా చెప్పాడు, ‘నువ్వొక ఆత్మ. నీ పై ఆధారపడిన వారు మిగిలిన ఆత్మలు. నీ ఆత్మను 
ఉద్ధరించుకోవాలంటే.. ముందు నీ పైన ఆధారపడిన ఆత్మల ఉద్ధరణకు పూనుకోవాలి. ఆత్మ అనేది సర్వశక్తుల సమ్మేళనం. అటువంటి ఆత్మ పైనే అన్ని పదార్థాలు, దేవతలు, ఆధారపడి ఉంటారు. ఈ విషయాలను స్వాభిమానం, దర్పం, గర్వం కలిగిన ఆత్మ గుర్తించలేదు. నువ్వు నేడు వాటన్నిటినీ విడిచిపెట్టి అంతిమ లక్ష్యం గురించి అడిగావు. ఆత్మను భౌతికమైన షట్‌ శత్రువుల నుంచి విముక్తి చేయడమే అసలు సిసలైన అంతిమ లక్ష్యం’ అంటూ వివరించాడు. ధనికుడు తృప్తిగా వెనుదిరిగాడు. ఈ కథ ‘చాందోగ్యోపనిషత్తు’ లోనిది. 

పద్మజ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని