వసంత పంచమి

మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత, వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు ...

Updated : 12 Mar 2023 13:06 IST

మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీపంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత, వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది.

 

వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్‌లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో శ్రీ పంచమి పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు.

ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది.

 

రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు.

వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది. ‘కృత్యసార సముచ్చయం’ లో వసంత పంచమి గురించిన సమగ్ర విశ్లేషణ ఉంది.

 

చైత్ర-వైశాఖాల్లో వచ్చే వసంతుడికి మాఘ-ఫాల్గుణ మాసాల్లోనే స్వాగతోపచారాలు మొదలవుతుండటం బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం, వైశిష్ట్యం అందరికీ అవగతమవుతుంది. అంటే, శిశిర రుతువే వసంత రుతువుకు పరమానందంతో స్వాగతం చెబుతోందన్న మాట!

వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది.

 

సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజిస్తారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు.

వసంత శోభను మహనీయులెందరో హృదయంగమంగా వర్ణించారు. సకల కళామయిగా సరస్వతిని కావ్యాల్లో స్తుతించారు. మార్కండేయ, స్కంద పురాణాలు; ‘ధర్మసింధు’ శ్రీవాణీ స్తుతిని రసరమ్యంగా వెలయించాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని