కొత్త సంవత్సరాది... ఉగాది

ఉగాది... తెలుగువారి కొత్తసంవత్సరాది. ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమినాడు ఈ పండగను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

Published : 03 Apr 2016 03:23 IST

కొత్త సంవత్సరాది... ఉగాది

ఉగాది... తెలుగువారి కొత్తసంవత్సరాది. ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమినాడు ఈ పండగను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు ప్రజలు సౌరమానం పాటిస్తారు. అందుకనే చైత్రం మొదటి నెల అవుతుంది. ఈ నెలలో చైత్ర శుద్ధ పాడ్యమినాడు శక నామ సంవత్సరం ప్రకారం కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఇంగ్లీషు క్యాలండర్‌ ప్రకారం చూసుకుంటే ఏటా మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో తెలుగువారి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చడి, పంచాంగశ్రవణం... కార్యక్రమాలను ఘనంగా జరుపుకొంటారు.

యుగాది..
కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. చైత్ర మాసంలో వచ్చే తొలి తిధి పాడ్యమి రోజున ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. పొద్దునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడి ఆరగించి పంచాంగ శ్రవణం చేయడమనేది సంప్రదాయం.

షడ్రుచుల సమ్మేళనం ... ఉగాది పచ్చడి...
మానవ జీవితమంటే అనేక రకాల సమ్మేళనం. కొన్ని రోజులు సుఖంగా వుంటే మరి కొన్ని రోజులు దుఃఖం వుంటుంది. శాశ్వతమైనది ఏమి వుండదు. దీన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. తీపి, కారం, వగరు, చేదు, పులుపు, ఉప్పు... తదితర గుణాల సమ్మేళనమే ఉగాది పచ్చడి. అన్ని పండ్లలో రారాజు మామిడిపండు. వసంతరుతువు ఆగమనవేళ మామిడిపూత, మామిడికాయ ముక్కలను ఈ పచ్చడిలో కలిపి ఇవ్వడం కొత్తరుచులను అందిస్తుంది. అలాగే వడపప్పును ఇస్తారు. పెసర పప్పుతో చేసిన ఈ ప్రసాదం సేవించడం ద్వారా వేసవి బాధను తప్పించుకోవచ్చని ఆరోగ్యసూత్రం వుంది.

పంచాంగ శ్రవణం
వారం, తిధి, నక్షత్రం, యోగం, కరణం అనేవి పంచాంగంలోని ఐదు అంగాలు. కొత్త సంవత్సరాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో తిధులు వాటి ప్రాశస్త్యం, ఆయా రాశుల వారికి ఆదాయం... తదితర అంశాల గురించి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు జరుగుతాయి. ఈ ఏడాది దుర్ముఖి నామ సంవత్సరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు