మహావీర జయంతి

క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో దేశ ప్రజల్లో ఆధ్యాత్మిక, నైతిక అశాంతి చోటుచేసుకున్న తరుణాన ధార్మిక ప్రవక్తలు నూతన ధర్మాలు ప్రవచించి, మార్గదర్శనం చేశారు. ఆనాటి ధార్మిక ఉద్యమాల్లో నేటికీ నిలిచి ఉన్నది జైనం. జైన సంప్రదాయంలో తీర్థంకరులు అనే గురువులకు విశిష్ట స్థానం ఉంది.

Published : 19 Apr 2016 11:20 IST

మహావీర జయంతి

 మార్చి 29

క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో దేశ ప్రజల్లో ఆధ్యాత్మిక, నైతిక అశాంతి చోటుచేసుకున్న తరుణాన ధార్మిక ప్రవక్తలు నూతన ధర్మాలు ప్రవచించి, మార్గదర్శనం చేశారు. ఆనాటి ధార్మిక ఉద్యమాల్లో నేటికీ నిలిచి ఉన్నది జైనం. జైన సంప్రదాయంలో తీర్థంకరులు అనే గురువులకు విశిష్ట స్థానం ఉంది. భవబంధ సాగరాన్ని దాటడానికి సహాయపడేవారిని తీర్థంకరులు అంటారు. ఇరవై నాలుగో తీర్థంకరుడైన వర్ధమానుడి కాలంనుంచి జైనధర్మం ప్రత్యేక మతంగా విలక్షణత సాధించింది.వర్ధమానుడు నేటి బీహారులోని వైశాలి ప్రాంతంలోని కుంద గ్రామంలో జన్మించాడు. ముప్ఫయ్యో ఏట సంసారాన్ని త్యజించి పన్నెండు సంవత్సరాలు ధ్యానంచేసి రుజుపాలికా నదీతీరాన జృంభిక గ్రామంలో జ్ఞానోదయం పొందాడు. ఇంద్రియాలను జయించడంవల్ల జినుడని, భవబంధాలు తెంచుకోవడంవల్ల నిగ్రంథుడని ప్రసిద్ధి వహించాడు. కైవల్య స్థితి పొందిన తరవాత మహావీరుడయ్యాడు.

మహావీరుడు సమ్యక్‌జ్ఞానం, సమ్యక్ క్రియ, సమ్యక్ విశ్వాసం అనే త్రిరత్నాలు బోధించాడు. తనకు ముందు పార్శ్వనాథుడు బోధించిన అహింస, అస్తేయం, అపరిగ్రహం, సత్యం అనే ధర్మాలకు అదనంగా బ్రహ్మచర్యాన్ని బోధించగా- ఈ అయిదింటినీ జైనులు పంచమహావ్రతాలుగా భావిస్తారు.
దేహం నిష్క్రియాత్మకం. ఆత్మ తాను ఆశ్రయించిన శరీరాన్నిబట్టి సంకోచ వ్యాకోచాలు పొందుతుంది. తన భవిష్యత్తుకు తానే కర్త అని మహావీరుడి బోధ. జనన మరణాలనుంచి విముక్తి పొందడమే జీవి లక్ష్యం. మానవుల కర్మలే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆత్మను కర్త అంటిపెట్టుకుని ఉంటుంది. కామక్రోధ లోభమోహాలు, అజ్ఞానం- కర్మకు కారణం. కర్మఫలాన్ని అనుభవించడానికి ఆత్మ- జన్మ పునర్జన్మలను పొందవలసి వస్తుంది. ఈ కర్మ మార్గాలను అరికట్టి పూర్వార్జిత కర్మను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధవిముక్తుడవుతాడు. మహావీరుడి దృక్పథంలో మోక్షమనేది దుఃఖంలోని అనంత సౌఖ్యం. దాన్ని సిద్ధశీల లేక కేవలావస్థ అని వ్యవహరించాడు. చేతన, అచేతనాలతో కూడి ఉన్న ఈ ప్రపంచంలో అచేతన పదార్థాలను కూడా బాధించరాదని వర్ధమానుడి ఉపదేశం. సల్లేఖనమనే ఉపవాస దీక్ష, భిక్షాటనం, శరీరాన్ని శుష్కింపజేసుకోవటం వంటి కఠోర నియమాలను జైనులు ఆచరిస్తారు.
వర్ధమానుడు కేవలం మతాచార్యుడు మాత్రమే కాదు. గొప్ప సంస్కర్త. ఆనాటి కులవ్యవస్థలోని లోపాలను తొలగించి సాంఘిక న్యాయ సాధనకు కృషి చేసినవాడు. వర్ధమానుడి భావనలో- మనిషి ఆత్మలో దాగిన అంతశ్శక్తి, భగవంతుడు.
అహింస, ఆత్మవిజయం, వ్రతం, వినయం, శీలం, మైత్రి, సమభావం, సమాధానం అనే ఎనిమిది తత్వాలను ప్రచారం చేయడానికే జైన సంఘాలు స్థాపితమయ్యాయి. ఈ సంఘాల్లో పూర్తి వ్రతధారులను శ్రమణకులని, సాధారణ వ్రతుల్ని శ్రావకులని అంటారు. ఎందరో మహారాజులు జినేంద్ర ప్రభువుకు శిష్యులయ్యారు. మహావీరుడు తన డెబ్భై రెండో ఏట బీహారులోని పావాపురిలో హస్తిపాలుడనే రాజుగృహంలో నిర్యాణం చెందాడు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని