శ్రీరామానుజాచార్యులు

వెయ్యి సంవత్సరాల క్రితమే ఆధ్యాత్మికత, మానవ విలువలు, సామాజిక సమానత్వం, శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం, విశిష్టాద్వైతం విశిష్టతను విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ధార్మిక

Published : 09 May 2016 22:31 IST

శ్రీరామానుజాచార్యులు

మే 1 రామానుజ జయంతి

వేయి సంవత్సరాల క్రితమే ఆధ్యాత్మికత, మానవ విలువలు, సామాజిక సమానత్వం, శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం, విశిష్టాద్వైతం విశిష్టతను విశేషంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ధార్మిక ప్రచారం నిర్వహించారు శ్రీ రామానుజాచార్యుల వారు. 1017లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో జన్మించిన ఆయన దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. చిన్న వయస్సులో రహస్యమనదగిన తిరుమంత్రాన్ని దేవాలయం గోపురంపైకి ఎక్కి అందరికి తెలియజేసిన సంస్కరణవాది రామానుజులు. వైదికమతమే ఆలంబనగా చేసిన ప్రచారంతో ఆయన వెంట అనేక వేలమంది నడిచారు. మెల్కొటెలో నిమ్నజాతీయులకు భగవత్‌ దర్శనం చేయించిన విప్లవవాది. తిరుమలలో వైఖానస ఆగమాన్ని గౌరవించి ఆ పద్దతులను కొనసాగించారు. ఇప్పటికీ తిరుమలలో రామానుజాచార్యుల వారు ప్రవేశపెట్టిన ఎన్నో సంప్రదాయపూజా పద్దతులు కొనసాగుతున్నాయి. దేవుడు, జీవుడు, ప్రకృతి వేర్వేరు అని ఆయన తన సిద్ధాంతాల్లో పేర్కొన్నారు. బాదరాయణుడి సిద్ధాంతాల మీద వ్యాఖ్యానం రాశారు. దీనినే శ్రీభాష్యం అంటారు. తన గురువైన యమునాచార్యుని మృతదేహానికి ఇచ్చిన మూడు హామీలు భాష్యం రాయడం, వైష్ణవమతప్రచారం, దేవాలయాన్ని నిర్మించడాన్ని (మెల్కొటెలో ఆలయ నిర్మాణం) నెరవేర్చాడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయప్రతిష్టాపన కూడా ఆయన నేతృత్వంలోనే జరిగింది. సాలగ్రామమయమైన తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు మోకాలి మిట్ట ప్రాంతంలో కాళ్లతో నడవకుండా మోకాళ్లతో నడిచిన మహా భక్తుడు ఆయన. అందుకనే ఇప్పటికి మోకాళ్ల మిట్ట అని పిలుస్తారు. భగవంతుని చేరుకోవాలంటే శరణాగతి కీలకమని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని