గంగమ్మ జాతర

ఆధ్యాత్మిక నగరి అయిన తిరుపతిలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మదేవత జన్మదినమైన చిత్రినెల చివరివారంలో గంగమ్మ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ...

Published : 14 May 2016 16:52 IST

తిరుపతి గంగమ్మ జాతర

ఆధ్యాత్మిక నగరి అయిన తిరుపతిలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మదేవత జన్మదినమైన చిత్రినెల చివరివారంలో గంగమ్మ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం నుంచి వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీనివాసుని సోదరిగా పేరుగాంచిన గంగమ్మతల్లికి ఉత్సవాలు నిర్వహించడానికి తిరునగరిలోని ప్రతిగడపా సిద్ధమౌతోంది. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం ఒడిబాలు కట్టడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. ఆఖరిరోజున విశ్వరూప దర్శనం-చెంప నరకడంతో పరిసమాప్తం కానున్నాయి...

బైరాగివేషం.. జాతర ప్రారంభమైన రెండో రోజు నుంచి యువత, ప్రధానంగా చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. వేషాల్లో తొలిగా ప్రారంభమయ్యేది బైరాగివేషమే. శరీరమంతా నాముకొమ్ము రాచుకుని, వేపమండలు చేతధరించి, గ్రామీణ పరుష పదజాలంతో ఒకరినొకరు వ్యంగ్య భాషతో వూరేగింపు(గుంపులు.. గుంపులు)గా సందడిచేస్తూ ఆలయాన్ని చేరి అమ్మవారిని దర్శిస్తారు.

బండ వేషం.. మూడోరోజైన గురువారం భక్తులు బండ వేషం ధరించి గంగమ్మను కొలుస్తారు. బండవేషమంటే.. శరీరమంతా ఎర్రనిబొట్లు, నలుపు బొట్లు, తెల్లని పుష్పాలతో కూడిన మాలలు శిరస్సుకు చుట్టుకుని, చేతిలో కర్రను ధరించి వివిధ గ్రామీణ వాయిద్యాల సహకారంతో లయబద్ధంగా అడుగులు వేస్తూ అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు.

తోటివేషం.. జాతరలో నాలుగోరోజు తోటివేషంతో తిరుపతి నగరం కళకళలాడుతుంది. ఈ వేషంతో శరీరమంతా నల్లని బొగ్గుపొడి పూసుకుని, తెల్లని నామం దిద్ది, కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకోవడం సంప్రదాయం. చిన్నపిల్లలు మీసాలను ధరిస్తారు. తలకు వేపాకు మండలను చుట్టుకుని, పాతపొరక చేతబట్టి వీధుల్లో సంచరిస్తూ నగరంలోని న్యాయస్థానం వద్ద ఉన్న వేషాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అటుతర్వాత తాతయ్యగుంట గంగమ్మను దర్శించి తరిస్తారు.

దొరవేషం.. ఐదోరోజు శనివారం నగరంలోని కైకాల కులస్థులు వంశపారంపర్యంగా దొరవేషాన్ని ధరిస్తారు. చాకలి కులస్థులు మంత్రి వేషాన్ని ధరిస్తారు. వీరు దొర, మంత్రి వేషాలతో నగరమంతా సంచరించి పూజలందుకుంటారు. నాడు గంగమ్మ సంచరించిన దానికి చిహ్నంగా నేడు కైకాల, చాకలి కులస్థులు ఆనవాయితీగా గంగమ్మకు ఇష్టమైన ఈ వేషాన్ని ధరించి అమ్మను సంతోష పరుస్తారు.

మాతంగి వేషం . అమ్మవారి వేషాల్లో అత్యంత ప్రధానమైంది.. మాతంగి వేషం. ఆరో రోజున స్త్రీ, పురుషులు స్త్రీరూపాన్ని ధరించి వివిధ ఆభరణములు శరీరానికి అలంకరించుకుని అమ్మవారిని దర్శిస్తారు. ఆరో రోజున రాజశ్యామల, రాజమాతంగి అనుపేర్లతో మాతంగి వేషాన్ని భక్తులు సంప్రదాయబద్ధంగా వేస్తారు.

సున్నపు కుండలు.. కైకాల కులస్థులు మాత్రమే సున్నపు కుండల వేషాన్ని ధరించి గంగమ్మకు ప్రతిరూపంగా నగరంలోని ప్రతివీధిలో సంచరిస్తూ భక్తుల నుంచి హారతులందుకుంటారు. పుష్పమాలికలతో అలంకరించిన సున్నపుకుండలను గెరిగె ఆకృతిలో తలపై ధరిస్తారు.

జాతరలో ప్రత్యేక అభిషేకం : మే 16వ తేదీ సోమవారం అర్ధరాత్రి(తెల్లవారితే మంగళవారం 17వతేదీ) శక్తి ఉద్భవకాలంలో మహాశక్తి స్వరూపిణి అయిన గ్రామశక్తిగా తిరుపతి.. తిరుమల క్షేత్రాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి ప్రత్యేక విశేష మహాభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాలు, పంచామృతం, నారికేళజలం, హరిద్రజలాభిషేకం(పసుపునీరు), సుగంధ-సౌభాగ్య ద్రవ్య ఫలరస అభిషేకం నిర్వహించి ఆలయ అర్చకులు అమ్మవారిని శాంతింపజేస్తారు. ప్రత్యేక పుష్పాలంకరణ, పూలంగి సేవ, బంగారు వజ్రకిరీట ధారణ, సర్వాలంకార కవచములు ధరించిన గంగమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. లక్షలాదిగా అశేష భక్తజనవాహిని నిరంతరాయముగా 18వ తేదీ ఉదయం వరకూ అమ్మవారిని దర్శించి పొంగళ్లు పెట్టి సమర్పిస్తుంటారు.

విశ్వరూప దర్శనం : 18వ తేదీ వేకువజామున శ్రీ గంగమ్మ విశ్వరూప దర్శనం జరుగుతుంది. అనంతరం ఉదయాత్పూర్వమే పేరంటాళ్ల వేషం ధరించిన వంశస్థుడు అమ్మవారి చెంపనరకడంతో జాతర పూర్తౌతుంది. అమ్మవారి విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన వల్మీకమట్టి(బంకమట్టి)ని స్వీకరించడానికి భక్తులు పోటీపడతారు. ఈ బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు, గృహబాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల విశ్వాసం.

తాతాచార్యుల గుంట పేరుతో...
అమ్మవారి పేరు గంగమ్మ. తాతాచార్యులనబడే వైష్ణవ ఉపాసకునికి చెందిన చెరువు(గుంట)ఒడ్డున గంగమ్మను తాతాచార్యులు ప్రతిష్ఠ చేశారు. ఆయనకు చెందిన భూమిలో ప్రతిష్ఠ చేయడంతో అమ్మవారు తాతయ్యగుంట గంగమ్మగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి జన్మస్థలం అవిలాల గ్రామం. జాతర ప్రారంభమయ్యే మొదటిరోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామపెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు వూరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. అలా మొదలు నగరం నుంచి స్థానికులైనవారు పొలిమేర్లు దాటకూడదని విశ్వాసం. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సంస్కృతికి ప్రతిబింబాలు.. వేషాలు
గంగమ్మజాతరలో భాగంగా వారం రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరువేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే.. వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండటం గమనార్హం. ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత, ఆధ్యాత్మిక అంతరార్థం దాగివుంది. పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలను భక్తులు అనుసరించడం.. భక్తుల వేషాలతో అమ్మవారు సంతృప్తి చెంది.. వారి కోరికలు తీర్చుతుందన్నది భక్తజన విశ్వాసం.

మహిమాన్విత శక్తిస్వరూపిణి
తాతయ్యగుంట గంగమ్మ కేవలం గ్రామదేవత మాత్రమే కాదు. మహిమాన్వితమైన శక్తిస్వరూపిణి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ శ్రీ గంగమ్మతల్లి అనుగ్రహం.. అనుమతి ఉన్నప్పుడు మాత్రమే తిరుపతి నగరంలో క్షేమంగా, స్థిరంగా నివసించడం సాధ్యమౌతుంది. గంగజాతర ఎనిమిదిరోజుల పండుగ. ఇది కేవలం తిరుమల.. తిరుపతికి మాత్రమే కాక, జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో చేసుకునే గంగ తిరునాళ్ల.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు