నాగపంచమి

శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు శయనించేది ఆదిశేషువుపైన అన్న విషయం తెలిసిందే. యావత్‌ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి. ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ....

Published : 04 Aug 2016 22:24 IST

నాగపంచమి

శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు శయనించేది ఆదిశేషువుపైన అన్న విషయం తెలిసిందే. యావత్‌ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి. ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ఏడాది శ్రావణ శుక్ల, మార్గశిర పంచమి నాడు నాగులను మానవులు పూజించాలని ఆదిశేషువు కోరుకున్నాడు. దీంతో ఆ వరాన్ని విష్ణుమూర్తి ఇవ్వడంతో శ్రావణశుక్ల పంచమి పర్వదినాన్ని నాగపంచమిగా జరుపుకొంటూ నాగులకు పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.

కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు. ఒక రోజు దూరంగా వున్న ఒక తెల్లటి అశ్వాన్ని చూసిన కద్రువ దాని తోక నల్లగా వుందని చెప్పింది. అయితే వినత దాని తోక తెల్లగానే వుందని పేర్కొంది. దీంతో వారు పందెం వేసుకున్నారు. ఎవరైతే పందెంలో ఓడిపోతే గెలిచిన వారి దగ్గర దాసిగా పనిచేయాలని పందెం పెట్టుకున్నారు. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు. ఆ రాత్రి కద్రువ తన సర్పకుమారులందరిని పిలిచి ఎవరైనా అశ్వం తోకకు చుట్టుకోవాలని కోరింది. అయితే నాగులు అలా పాపం చేయడం తగదని హితవు పలికాయి. దీంతో కోపించిన ఆమె భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులు పడి జాతి అంతమవుతుందని శాపం పెడుతుంది. దీంతో భీతిల్లిన కుమారుల్లో ఒకరైన కర్కోటకుడు అశ్వం తోకను చుట్టుకుంటాడు. అనంతరం అశ్వాన్ని చూసిన వినత తాను ఓడిపోయినట్టు గ్రహించి దాసిగా వుండిపోయింది. ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు.

తరువాత ద్వాపర యుగంలో పరిక్షిత్తు మహారాజును తక్షకుడు కాటు వేయడంతో మరణిస్తాడు. తండ్రి మరణానికి నాగులే కారణమన్న ఆగ్రహంతో జనమజేయుడు సర్పయాగం నిర్వహిస్తాడు. ఈ యాగంలో లక్షలాది సర్పాలు పడి మృతిచెందాయి. వాసుకి సోదరి మాతా మానసదేవి తన కుమారుడైన అస్తీకున్ని యాగప్రదేశానికి పంపడంతో అతను యాగాన్ని నిలిపివేయమని జనమేజయుడిని ప్రార్థిస్తాడు. దీంతో యాగం నిలిచిపోతుంది. శ్రావణ శుక్ల పంచమి నాడు నాగజాతిని సంరక్షించిన దినం కావడంతో ఆ రోజును నాగపంచమిగా జరుపుకొంటారు. ఆ రోజున సమీపంలోని పుట్టలకు వెళ్లి పాలు పోసి పూజలు నిర్వహిస్తారు.

అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గరుత్మంతునికి, నాగులకు మధ్య వున్న ఘర్షణను నివారించేందుకు విష్ణుమూర్తి ఇరువర్గాల మధ్య సంధి కుదర్చుతాడు. ఈ ఒప్పందం శ్రావణమాసం శుక్లపంచమినాడు జరిగింది. అందుకే గరుడ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని