రాఖీపై పాండవులకు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు?

అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం- రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు...

Published : 07 Aug 2017 12:25 IST

రాఖీపై పాండవులకు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు?

నురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం- రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. ఉత్తర భారతంలో విశేష వ్యాప్తి చెందిన ఈ సంబరం, కాలక్రమంలో దేశమంతటా విస్తరించింది.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతలకు ఓ అందమైన ఆవిష్కరణ- రక్షాబంధనం. సోదరుడి ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషాన్ని ఆకాంక్షిస్తూ- సోదరి పవిత్ర హృదయంతో అతడి చేతికి రక్షా కంకణాన్ని ధరింపజేస్తుంది. నుదుట తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, మధుర పదార్థాన్ని సోదరుడికి సోదరి తినిపిస్తుంది. అమ్మ కనబరచే ఆదరణ, నాన్న కలిగించే భద్రతను ప్రస్ఫుటం చేస్తూ- సోదరి తన అనురాగాన్ని సోదరుడి పట్ల ప్రకటిస్తుంది. ‘నేను ధరింపజేసే ఈ రక్ష- నీ భావి జీవితమంతటా సర్వదా అండగా ఉంటుంది’ అనే భావనను వ్యక్తీకరిస్తుంది. సోదరుడి కుడిచేతికి సోదరి ‘మంగళ రక్షాబంధనం’ చేయాలని ‘వ్రతోత్సవ చంద్రిక’ గ్రంథం చెబుతోంది.

రక్షాబంధనం ఉత్సవానికి అనేక పేర్లున్నాయి. రక్షికా పున్నమి, నారికేళ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి- ఇలా అనేక రీతుల్లో ఈ సందడి వ్యవహారంలో ఉంది. దీన్ని ‘ధర్మబద్ధమైన వేడుక’గా పురాణాలు నిర్వచించాయి. పాండవులకు జయం సిద్ధించడానికి శ్రీకృష్ణుడు ఓ సూచన చేస్తాడు. ఆ మేరకు ధర్మరాజు తన సోదరులకు మంత్రపూర్వకంగా రక్షాబంధన మహోత్సవం నిర్వహించాడని ‘మహాభారతం’ చెబుతుంది. సోదరీమణులతో రక్షాబంధనం ధరింపజేసుకున్నవారికి యమకింకరుల భయం ఎన్నటికీ ఉండదని-యముడు తనసోదరి యమునకు చెప్పినట్లు ‘భవిష్యోత్తర పురాణం’ పేర్కొంది. దానశీలుడైన బలి చక్రవర్తికి శ్రీమహావిష్ణువు తన శక్తిని ఓ కంకణంలో నిక్షిప్తం చేయడం ద్వారా ‘రక్ష’గాఅందజేశాడని ‘విష్ణుపురాణం’ విశదపరచింది. శత్రుభయం లేకుండా తన సుపుత్రుడు అఖండ పాలనసాగించాలని ఆకాంక్షిస్తూ, భరతుడికి తల్లి శకుంతల రక్ష కట్టిందని పురాణ కథనం.

‘రాకా’ అంటే- నిండుదనం, పున్నమి అనే అర్థాలున్నాయి. రాకా చంద్రుడు అంటే, పున్నమి చంద్రుడు. ఈ పున్నమినాడు ధరించే రక్ష ‘రాఖీ’గా స్థిరపడింది. ‘రాఖీ’ అంటే, రక్షిక. అది సంవత్సర పర్యంతం సోదరుడికి రక్షగా నిలిచే మహత్తర కవచమని ‘ధర్మసింధు’ ప్రస్తావించింది. చారిత్రకంగానూ రక్షాబంధనం ఎంతో ప్రశస్తి చెందింది. రాజపుత్రుల యువరాణి కర్ణావతి- మొగలాయీ పాలకుడు హుమాయూన్‌కి రక్షను ధరింపజేసి, శత్రువుల నుంచి రక్షణ పొందిందంటారు. పురుషోత్తమ చక్రవర్తికి రాఖీ కట్టిన అలెగ్జాండర్‌ ప్రేయసి రుక్సానా, ఆయనకు ప్రాణభిక్ష కోరిందని చెబుతారు. ఛత్రపతి శివాజీ ఏటా పూర్ణిమనాడు తుల్జా భవానీ సమక్షంలో రక్షాబంధనం చేసుకుని, ధర్మనిబద్ధతకు పునరంకితమయ్యేవాడని చరిత్ర చెబుతోంది.

మరాఠా పాలకుడు పీష్వా బాజీరావు కాలంలో, ఈ పున్నమిని సమైక్యతా దినోత్సవంగా నిర్వహించేవారంటారు. రాఖీ పండుగ ద్వారా స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘లోకమాన్య’ తిలక్‌- భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిలించారు. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రక్షాబంధన్‌ సందర్భాన్ని సామాజిక ఐక్యతా వారధిగా వినియోగించుకున్నారు. విభిన్న వర్గాల్ని ఏకీకృతం చేసిన ఆ కవీంద్రుడు, రక్షాబంధనాన్ని ఓ సంరంభంగా నిర్వహించారు. ఇలా రక్షాబంధన ఉత్సవం ఓ పర్వదినంగానే కాక- జాతీయ సమగ్రతకు, సామరస్యానికి ఉపకరించింది.

జైనులు ఈ పర్వాన్ని ‘రక్షక్‌ దివస్‌’గా నిర్వహిస్తారు. కొబ్బరికాయల్ని సముద్రజలాల్లో వదిలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. శ్రావణ పూర్ణిమను ‘సంతోషిమాత జన్మదినోత్సవం’గానూ పరిగణిస్తారు. జ్ఞానానికి అధిష్ఠానదైవంగా భావించే హయగ్రీవ జయంతి నేడే! సంస్కృత భాషాదినోత్సవంగానూ ఈ పున్నమి ఖ్యాతి సంతరించుకుంది. ఇలా పలు విశేషాంశాల సమాహారంగా శ్రావణ పూర్ణిమ వర్ధిల్లుతోంది!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని