అనంత చతుర్దశి

శ్రీమహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు. కాలాత్మకుడిగా, ఆది మధ్యాంత రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు. అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరించిన ఆయన అనంత పద్మనాభుడిగా వర్ధిల్లుతున్నాడు...

Published : 27 Aug 2017 22:04 IST

 అనంత చతుర్దశి
సెప్టెంబ‌రు 5

శ్రీమహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు. కాలాత్మకుడిగా, ఆది మధ్యాంత రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు. అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరించిన ఆయన అనంత పద్మనాభుడిగా వర్ధిల్లుతున్నాడు. బ్రహ్మ సృజించిన సమస్త జగత్తుకూ ఆధార కారకుడు పద్మనాభుడే అని చెబుతారు. మహాభారతంలోని శాంతిపర్వం ఆ స్వామి వైభవాన్ని వర్ణించింది.

‘అనంతుడంటే నేనే! పగలు, రాత్రి, దిన, వార, పక్ష, మాస, రుతు, సంవత్సరాలన్నీ నేనే! విరాట్‌ శక్తిని, కాల పురుషుణ్ని నేనే!’ అని శ్రీకృష్ణుడు తన సమగ్ర మూర్తి మత్వాన్ని ధర్మరాజుకు విశదపరచాడంటారు. లోకాల్ని సంరక్షించేది, సంలీనం చేసేది కాలనియమ ప్రవర్తకుడైన అనంతుడేనని బ్రహ్మ వర్ణించాడంటున్నాయి పురాణాలు.

సృష్టి ఆవిర్భావానికి, వృద్ధికి ముఖ్య భూమిక అనంతుడిదేనని ‘భవిష్య పురాణం’ చెబుతుంది. అనంతుణ్ని వ్రత విధాన నేపథ్యంగా ఆరాధించేదే అనంత పద్మనాభస్వామి వ్రతం. దీన్ని భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఆచరిస్తారు.

సర్వ శుభదాయకమైన వ్రతాన్ని ఉపదేశించాలని శ్రీకృష్ణుణ్ని కోరాడు ధర్మరాజు. ఆయన అనంత ఫలాన్ని అందజేసే అనంత చతుర్దశి వ్రత విధానాన్ని వివరించాడట. భవిష్య పురాణం ఉత్తర పర్వంలో ఈ వ్రతాచరణ రీతి కనిపిస్తుంది. అగస్త్య మహర్షి పరివ్యాప్తి కల్పించాడంటారు. దక్షిణాపథంలో ఆయన తొలిసారిగా అనంత వ్రతం నిర్వహించిన ప్రదేశం- తిరువనంతపురం. పూర్వ నామం- శ్రీ అనంతవ్రతపురం. ఈ క్షేత్రంలో శేషతల్పశాయిగా అనంత పద్మనాభుడు వెలుగొందుతున్నాడు.

యోగనిద్రా ముద్రాంకితుడైన అనంత పద్మనాభస్వామి పద్నాలుగు లోకాలకు అధిపతి. ఏడేసి వూర్ధ్వ, అధోలోకాలు ఆయన అధీనంలో ఉంటాయంటారు. అందుకే అనంత వ్రతంలో 14 సంఖ్యకు ప్రాధాన్యముంది. వ్రత విధానంలో ‘ప్రతిసర బంధనం’- అంటే, తోర ధారణ ప్రధానమైనది. కుంకుమతో అలంకరించిన పద్నాలుగు పోగుల దారంతో తోరాన్ని తయారుచేస్తారు. శ్రీకృష్ణాష్టోత్తర పఠనంతో తోరపూజ నిర్వర్తిస్తారు. ‘ఓం శ్రీకృష్ణాయనమః’ అనే ప్రథమ గ్రంథి (మొదటి ముడి)తో ప్రారంభించి, ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః’ అనే పద్నాలుగో గ్రంథితో పూజ పూర్తిచేస్తారు. 14 ముడుల సమాహారంగా ఈ కంకణం ఉంటుంది. స్వామిని 14 రకాల పూజాద్రవ్యాలతో పూజిస్తారు. ప్రతి 14 సంవత్సరాలకూ ఈ వ్రత ఉద్యాపన నిర్వహించాలి. ఏటా కొత్త తోరాన్ని ధరించి, పాతదాన్ని తొలగించాలి.

అనంత పద్మనాభ కంఠానికి, నాభికి మధ్య ప్రదేశంలో హృదయ పద్మం ఉంటుంది.యోగపరంగా అది సహస్రార కమలం. పద్మనాభుడి నెలవు అదే. బ్రహ్మానంద కొలువూ అదే. మనోస్థితి కారకత్వాన్ని హృదయం నిర్దేశిస్తుంది. ధ్యానస్థితిలో ఉన్నప్పుడు దైవాన్ని హృదయ స్థానంలో నెలకొల్పుకోవాలని ‘కైవల్యోపనిషత్తు’ చెబుతుంది. సూర్యకిరణ ప్రసారం జరిగిన వెంటనే పద్మం వికసిస్తుంది. పద్మనాభుడి జ్ఞానశక్తి ప్రసరించగానే భక్తుడి బుద్ధి ఉద్దీపన చెందుతుందని పురాణగాథలు చెబుతున్నాయి. భక్తుల హృదయ సీమల్లో అనంతుడిగా నివాసముంటానని నారాయణుడు సందేశమిచ్చాడంటోంది ‘విష్ణుపురాణం’!

అనంత చతుర్దశినాడు యమునా నదినీ ఆరాధిస్తారు. పూర్ణిమతో కూడిన చతుర్దశినాడు ఈ వ్రతం ఆచరించడం ఉత్తమమని ‘నిర్ణయామృతం’ పేర్కొంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ్‌బంగ రాష్ట్రాల్లో అనంత పద్మనాభుడి ఆరాధన ఉంది. ఉత్కళ ప్రాంతంలో ఈ అనంత చతుర్దశిని ‘అఘోర చతుర్దశి’ గా వ్యవహరిస్తారు. యమునా వ్రతంగా, పాలీ చతుర్దశి వ్రతంగా, కదళీ వ్రతంగా, కాలదీవెన వ్రతంగా పాటించే సంప్రదాయమూ కనిపిస్తుంది.

కాలస్వరూపుడైన అనంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలంటే- ధర్మ ప్రవర్తన, సత్యనిష్ఠ, సదాచార పరాయణత్వాలే మూలమని అనంత పద్మనాభ వ్రతం సందేశమిస్తుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు