కార్తిక వైభవం

సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అన్ని మాసాల్లోనూ కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. వీరిద్దరి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీకర్మ శుభాలనిచ్చేదిగానూ ఉండాలన్న...

Published : 20 Oct 2017 09:43 IST

కార్తిక వైభవం

సంవత్సరంలో ప్రతి మాసానికీ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అన్ని మాసాల్లోనూ కార్తికమాసానిది ఓ విశిష్టశైలి. ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసమంటారు. హరి స్థితికారకుడైతే, హరుడు శుభంకరుడు. వీరిద్దరి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలనిచ్చేదిగానూ ఉండాలన్న ఆశయసిద్ధికై అంతర్ముఖయానం గావించుకోవాలన్న దానికి ప్రతీక ఈ మాసమని చెబుతారు.


కార్తికస్నానం, దీపం, వ్రతం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తితత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. కార్తిక సోమవారాలు మరింత ప్రత్యేకం.
ఈ మాసంలో ప్రాతఃకాలపు స్నానాలకు ఎంతో ప్రాముఖ్యమిస్తారు. ప్రాతఃకాలంలో చేసే స్నానం రుషీస్నానం, ఉత్తమమైంది. ఈ మాసం ప్రవేశించేనాటికి వర్షరుతువు స‌మాప్త‌మ‌వుతుంది.  వర్షజలధారలు సమస్తమూలికల సారాన్ని, భూపొరల్లోని ధాతువుల సారాన్ని కలగలుపుకొని నదుల్లోకి అంతర్వాహినిగా వచ్చిచేరతాయి.

ఔషధజలంలా జలప్రవాహాలు పరిఢవిల్లుతాయి. ప్రవాహవేగానికి ఎదురుగా నిలబడి స్నానమాచరిస్తే- జలప్రవాహాల్లో ఔషధీయగుణాలు, విద్యుత్‌ తరంగాలు దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
స్నానానంతరం రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల వద్ద దీపారాధన, దైవారాధన చేయాల‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వృక్షసంపద ఆరోగ్య భాగ్యాన్ని క‌లుగ‌జేస్తుంది. యజ్ఞ  ద్ర‌వ్యంగానూ ఉప‌యోగ‌ప‌డుతుంది.

జ్ఞానానికి చిహ్నం దీపం. సర్వసంపదలు జ్ఞానంవల్ల లభిస్తాయి. ఈ మాసంలో దీపదానం ప్రాశస్త్యం చాలా ఉంటుంది. ఈ మాసం ఆసాంతం దీపారాధన చేసి చివరిరోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానంచేస్తే- అనంతపుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయంటారు.
జ్ఞానం సకల సంపదలకు నెలవు కాబట్టి, ఆ జ్ఞానాన్ని పదుగురికీ పంచి ప్రకాశవంతమైన జీవనవిధానాన్ని సమాజంలో నెలకొల్పాలన్న సందేశం ఇందులో ఉంది.
ఈ మానవాతావరం దృష్ట్యా ఏక భుక్తమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. ఈ కాలంలో జఠరాగ్ని మందంగా ఉంటుంది. దాన్ని చురుగ్గా ఉంచేందుకు ఏకభుక్తమే ఔషధం.
అన్నార్తుల క్షోభ ఎటువంటిదో తెలుసుకోవాలన్నది ఉపవాసాల పరమార్థం.
ఉపవాసం అంటే ఆహారంలేకుండా దినం గడపడమని కాదు- భగవస్సాన్నిధ్యంలో ఆ రోజును గడపడం.
కార్తిక సోమవారాలది పెద్ద సందడి. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. మారేడు దళాలతో పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుందని పురాణప్రవచనం. శివుడు ప్రేమ మయుడు. విశ్వప్రేమతత్వం అలవరచుకోవడమే శివసాయుజ్యం- అదే జీవన పరమార్థం.

కార్తిక పౌర్ణమిరోజున శ్రీమహావిష్ణువును షోడశోపచారాలతో పూజిస్తే యశస్సును, సామ్రాజ్యవైభవాలను పొందుతారని ‘పురంజయుని’ చరిత్ర తెలియజెబుతోంది.
కార్తిక సమారాధన ఐకమత్యానికి నిదర్శనం. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు విడనాడి సామూహిక భోజనాలు ఆచరించాలన్నదే శాస్త్రవచనం. ఇది సమష్టి జీవన మాధుర్యాన్ని తెలుపుతుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తికశుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు శ్రీలక్ష్మీసమేతుడై పాలకడలిలో శేషపాన్పుపై శయనిస్తాడంటారు. ఇది చాతుర్మాస్యం. కార్తిక శుద్ధ ఏకాదశితో చాతుర్మాస్య వ్రతం పరిసమాప్తమవుతుంది. మానవ జీవితకాలంలో సగం ఆయుష్షు నిద్రకే సరిపోతుంది. మేల్కొని ఉండే జాగ్రదావస్థ, జీవిత స్థితిగతులను సువ్యవస్థీకృతమైన విధానంలో నడుపుకోవాలి. సమయపాలనకు, కాలానికున్న విలువను తెలియజెబుతుందీ వ్రతవిధానం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు