భగిని హస్త భోజనం

అన్నాచెల్లెళ్ల పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ, ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం.....

Published : 20 Oct 2017 19:28 IST

భగిని హస్త భోజనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్నాచెల్లెళ్ల పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ, ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం... అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని హస్త భోజనం అంటారు.

ఎప్పుడు జరుపుకొంటారు 
ఈ పండగను భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు. దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు. ఈ రోజున సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి అక్కాచెల్లెళ్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.

భగిని హస్త భోజనం వెనుక కథ 
హిందూ పురాణాల ప్రకారం దీనిని యమ ద్వితీయ, భాయిదూజ్‌గా పిలుస్తారు. ఈ రోజున పురుషులు తమ సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయన్నది పురాణ ప్రవచనం. సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి/ యమున. ఈ ప్రత్యేక పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి, నుదట తిలకం దిద్ది సాదరంగా లోనికి ఆహ్వానిస్తుంది. యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకి ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. దీనికెంతో సంతోషించిన యుముడు ఆమెను వరం కోరుకోమనగా, ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్న వారికి అపమృత్యు భయం ఉండదని అభయమిస్తాడు. ఈ విధంగా దీపావళి తరవాత వచ్చే రెండో రోజును భగిని హస్తభోజనం పర్వదినంగా జరుపుకొంటారు. దీనితో పాటు, మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించిన తరువాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణుడికి హారతి ఇచ్చి, తిలకం దిద్దిలోనికిఆహ్వానిస్తుంది. యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది.

ఎలా చేసుకుంటారు 
ఉదయాన్నే సోదరులను ఇంటికి పిలిచి వారితో కలిసి దేవుణ్ని ప్రార్థించి, వారి నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చి, వారికి సోదరిమణులు తమ చేతితో వండిన ఆహార పదార్థాలను తినిపిస్తారు. హరియాణా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు