కార్తిక పూర్ణిమ

‘కార్తికంతో సమానమైన మాసం లేదు. విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమైన తీర్థం లేదు’ అని పురాణోక్తి. ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన కార్తిక మాసం- అత్యంత పవిత్రం, మహిమాన్వితమని భక్తులు విశ్వసిస్తారు. ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు. స్నానం, దీపం, దానాలకు కార్తికం ప్రసిద్ధి చెందింది.

Published : 04 Nov 2017 12:58 IST

కార్తిక పూర్ణిమ

‘కార్తికంతో సమానమైన మాసం లేదు. విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమైన తీర్థం లేదు’ అని పురాణోక్తి. ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన కార్తిక మాసం- అత్యంత పవిత్రం, మహిమాన్వితమని భక్తులు విశ్వసిస్తారు. ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు. స్నానం, దీపం, దానాలకు కార్తికం ప్రసిద్ధి చెందింది.

పూర్ణిమనాడు కృత్తికా నక్షత్రం ఉంటే, కార్తికం అవుతుంది. కృత్తిక అనేది అగ్నినక్షత్రం. చంద్రుడు పదహారు కళలతోనూ కనిపించే రోజు పూర్ణిమ. అటు అగ్ని వేడిమి, ఇటు చంద్రుడి చల్లదనం కలిసి ఒకేసారి వచ్చే రోజు- కార్తిక పౌర్ణమి.

ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై ఉంటాడు. శీతల కిరణాల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. కార్తికంలో చెరువులు, బావుల్లో నీరు తేటపడుతుంది. సూర్యరశ్మి ప్రసారం వల్ల తేజస్సును, బలాన్ని సంతరించుకుంటుంది. దైవపూజకు అవసరమైన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. కార్తికంలో పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. శరదృతువులో నదీప్రవాహంలో ఓషధులు సారవంతంగా ఉంటాయి. అందువల్ల ఆ నీరు స్నానపానాలకు అమృతతుల్యమని మహర్షుల భావన.

వర్షకాలంలో అప్పటివరకు భూమ్మీద పడిన వాన నీరు భూమిలోకి ఇంకిపోతుంది. అప్పుడు బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుందని భావిస్తారు. ఆ ప్రభావం తరవాత వచ్చే కార్తికంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటికి వ్యాధుల్ని నశింపజేసే గుణం ఉంటుందని చెబుతారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కృత్తికా నక్షత్రం కనిపిస్తుందని, ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు.

చంద్రుడు మనసుకు ప్రశాంతత కలిగిస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అందుకే చంద్రుణ్ని శివుడు తన జటాజూటంలో ధరించాడు. చంద్రుడి పేరున ఏర్పడిన సోమవారం ఈ నెలలో విశిష్టమైనది. కార్తిక పూర్ణిమనాడు పూజాదికాలు నిర్వర్తించి, వెన్నెల్లో పరమాన్నం వండుకొని, ప్రసాదాలుగా స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

కార్తికదీపం ఉత్తమ ఫలమిస్తుందని అంటారు. ఆ దీపాన్ని ఉభయ సంధ్యల్లోనూ శివకేశవ మందిరాల్లో, తులసి సన్నిధిలో వెలిగించడం ఒక మహోత్కృష్టమైన సత్కర్మ. కార్తిక పూర్ణిమనాటి దీప దానం పవిత్రమైనదని ప్రతీతి. ఆ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణాలు ఉంటాయి. సాగర మథన సమయంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు తన గరళంలో దాచుకోవడానికి సంకేతంగా ఈ ఉత్సవం చేస్తారు. కార్తికమాసం నెలరోజులూ అరటి దొప్పలో దీపం ఉంచి నది లేదా చెరువులో వదులుతారు. ఆవునేతి దీపం ఉత్తమమంటారు. కనీసం ఆముదంతోనైనా దీపం వెలిగించాలని పెద్దలంటారు.

కార్తికమాసంలో ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం పుణ్యప్రదమని భక్తజనుల నమ్మిక. ఆ చెట్లు ఉన్న వనంలో భుజించడాన్ని ‘వనభోజనాలు’గా పరిగణించేవారు. సర్వ దేవతలకు ఉసిరిక వృక్షం నెలవు అని, సర్వతీర్థాలూ ఆ చెట్టుగల భూమినే ఆశ్రయించి ఉంటాయని పెద్దల మాట.

కార్తికమాసంలో విష్ణు సన్నిధిన భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలు పారాయణం చేస్తుంటారు. ఈ పఠనం వల్ల వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని పురాణ గాథలు చెబుతాయి. స్కాందపురాణంలో అంతర్గతమైన కార్తిక పురాణం కార్తికమాస వ్రతం ప్రత్యేకతను వివరిస్తుంది. కార్తికంలో పితృతర్పణ మహత్వాన్ని సైతం ఈ పురాణం తెలియజెబుతుంది!

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని