నాదయోగి త్యాగయ్య

త్యాగరాజులోని రామభక్తి కీర్తనలుగా అమృత వర్షిణిగా నేటికీ మనల్ని రాగరంజితం చేస్తూనే ఉంది. శ్రీరామచంద్రుడి స్మరణలో త్యాగయ్య అపారమైన ఆర్తి కనిపిస్తుంది. ఆయన సాహిత్యంలోని ప్రతి పల్లవి, అనుపల్లవి, చరణంలోనూ...

Published : 01 Jan 2018 15:12 IST

నాదయోగి త్యాగయ్య
త్యాగ‌రాజ‌స్వామి ఆరాధ‌న‌
జ‌న‌వ‌రి6

త్యాగరాజులోని రామభక్తి కీర్తనలుగా అమృత వర్షిణిగా నేటికీ మనల్ని రాగరంజితం చేస్తూనే ఉంది. శ్రీరామచంద్రుడి స్మరణలో త్యాగయ్య అపారమైన ఆర్తి కనిపిస్తుంది. ఆయన సాహిత్యంలోని ప్రతి పల్లవి, అనుపల్లవి, చరణంలోనూ తాదాత్మ్య రామభక్తి స్ఫురిస్తుంది. రాగం, భక్తిభావం మేళవించి త్యాగరాజబ్రహ్మ నాదోపాసన చేశారు. అందువల్ల త్యాగయ్య సాహిత్యం శ్రోతలను అలౌకిక స్థితిలోకి తీసుకెళ్లిపోతుంది. రామరసాన్ని ఆ వాగ్గేయకారుడు తాను ఆస్వాదించడమే కాక, తరతరాల రామభక్తులకు ఆ రుచి చవిచూపుతూనే ఉన్నారు.


త్యాగబ్రహ్మ లౌకిక కష్టాలను, సుఖాలను స్థితప్రజ్ఞతతో స్వీకరించారు. భౌతిక ప్రపంచంలో సుఖాలనిచ్చేవాటినేవీ ఆయన కాంక్షించలేదు. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అంటూ (కల్యాణి రాగంలో) తనను తానే ప్రశ్నించుకొన్న మహానుభావుడాయన. దధి నవనీత క్షీరాల కన్న దాశరథి ధ్యాన సుధారసమే రుచికరమన్నారు. ఆయన రచించిన సంప్రదాయ కీర్తనలే నేడు భవ జలధి దాటడానికి తరుణోపాయాలని సంగీతజ్ఞులు చెబుతారు. త్యాగయ్య శ్రీరామచంద్రుణ్ని ఆగమ సంబంధమైన తత్వపరమైన సంపూర్ణ దైవంగా కీర్తించారు. భగవంతుడి కృపలేనిదే మానవ జన్మ లభించదంటారు. మోక్షం కోసం తపన, మహాత్ముల సంపర్కం సైతం సంక్రమించవంటారు. నారదుడు బోధించిన రామమంత్రమే వాల్మీకిని ఆదికవిని చేసింది. ఆ రామమంత్రమే త్యాగరాజును సైతం రాగసుధారసపానం చేయించి రాజిల్లజేసింది. సంగీతానికి భక్తిని జత కలిపి త్యాగరాజు సామవేద సారంతో ముముక్షువులకు సన్మార్గాన్ని నిర్దేశించగలిగారు. రాగమయమై భక్తిభావయుక్తమైన కీర్తనలేవైనా దైవానికి ప్రీతి కలిగిస్తాయని హనుమంతుడు తుంబురుడితో చెప్పినట్లు కంబ రామాయణం వెల్లడిస్తోంది.


శ్రీరాముడి గుణశీలాలు త్యాగరాజు ప్రతి కీర్తనలోనూ ప్రస్ఫుటమవుతాయి. శ్రీరామచంద్రుడిపై త్యాగయ్య భక్తి అనురక్తి తెలుసుకోవాలంటే ఆయన కీర్తనలు వినాల్సిందే! భక్తిలోని లోతులు తెలియనివారికైనా అపార భక్తి జలనిధిలోని ఆద్యంతాలు కొంతవరకైనా బోధపడతాయి. గానం చేయగల వాక్కుతో పాటు గేయాలు సృజించగల వాగ్గేయకారులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. త్యాగయ్య నాదోపాసన చేసిన వాగ్గేయకారుడు. సంస్కృతంలోను, తెలుగులోను భక్తిభావాలను సృజించగల మహానుభావుడాయన. నాదోంకారాన్నుంచే సప్త స్వరాలు ఉద్భవించాయని, ఆ సప్త స్వరాలను మురళీనాదంలో రవళించే మోహనకరుడైన యాదవ కులదీపుడు తనకు వందనీయుడని సామజ వరగమన (హిందోళం)కీర్తనలో వర్ణిస్తారు. సప్త స్వరాలకు వేదాలే మాతృక అని తెలిపిన వాగ్గేయకారుడు త్యాగయ్య. వాల్మీకి రామాయణంలోని ఇరవైరెండు వేల నాలుగు వందల శ్లోకాలకు సమంగా త్యాగయ్య కీర్తనలు రచించాడని అంటారు. ప్రస్తుతం ఏడు వందల డెబ్భై రెండు కీర్తనలే లభిస్తున్నాయి. అందులో- కొలువై ఉన్నాడే (దేవగాంధారి), సీతా కల్యాణ వైభోగమే (శంకరాభరణం), ఆరగింపవే (తోడి), జయ మంగళం నిత్య శుభమంగళం (నాదనామ క్రియ)లాంటి ఇరవై తొమ్మిది ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఉన్నాయి. ఇవేకాక త్యాగయ్య డెబ్భై అయిదు దివ్యనామకృతులు రచించారు. దశరథనందన రామా (అసావేరి)- భక్తిరస భావాన్ని సృజించగల దివ్యనామ కీర్తన. త్యాగయ్య సంకీర్తనలే కాక నౌకాచరిత్రం, ప్రహ్లాద విజయం లాంటి గేయనాటికలు రాశారు. త్యాగయ్య రచించాడని భావిస్తున్న సీతారామ విజయం అనే గేయనాటిక లభించడం లేదు.


త్యాగరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కాకర్ల గ్రామంలో 1767, మే నెల నాలుగో తేదీ జన్మించారు. ఆయన జన్మనామం కాకర్ల త్యాగబ్రహ్మం. రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు త్యాగయ్య మూడో సంతానం. ఈ కుటుంబం కొంతకాలం తరవాత తంజావూరు ప్రభువు శరభోజిని ఆశ్రయించింది. అక్కడికి దగ్గరలోని తిరువయ్యూరులో త్యాగయ్య తండ్రి రామబ్రహ్మం స్థిరపడ్డారు. త్యాగయ్య తొలి గురువు శొంఠి వేంకట రమణయ్య. త్యాగయ్య భార్య కమలాంబ. సీతామహాలక్ష్మి త్యాగయ్య కూతురు. సీతామహాలక్ష్మికి సంతానం లేకపోవడం వల్ల త్యాగరాజుకు కచ్చితమైన వారసులు లేరు.


నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన కాకర్ల త్యాగయ్య ఎనభై ఏళ్లు రాగసుధారస పానం చేసి 1847 జనవరి ఆరో తేదీ బంటురీతి కొలువు కోసం వైకుంఠ ద్వాదశి రోజు దాశరథి పాద సన్నిధికి చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని