సంక్రాంతి సూర్యోదయం
పరమాత్మ ప్రత్యక్ష స్వరూపమే ప్రకృతి. ఈ ప్రకృతినుంచి పొందే ప్రతి ప్రయోజనమూ ఆయన కారుణ్యంగా భావించడం మన సంస్కృతి. సూర్యమంత్రాలు, వృక్షసూక్తాలు, పృథ్వీసూక్తాలు, గృహమంత్రాలు, నదీ స్తుతులు... ఇలా వేదపురాణాది శాస్త్రాల్లో ఎన్నెన్నో భాగాలు ప్రకృతిలోని...
సంక్రాంతి సూర్యోదయం
జనవరి 15 మకర సంక్రాంతి
పరమాత్మ ప్రత్యక్ష స్వరూపమే ప్రకృతి. ఈ ప్రకృతినుంచి పొందే ప్రతి ప్రయోజనమూ ఆయన కారుణ్యంగా భావించడం మన సంస్కృతి. సూర్యమంత్రాలు, వృక్షసూక్తాలు, పృథ్వీసూక్తాలు, గృహమంత్రాలు, నదీ స్తుతులు... ఇలా వేదపురాణాది శాస్త్రాల్లో ఎన్నెన్నో భాగాలు ప్రకృతిలోని పరమేశ్వర చైతన్యాన్ని దర్శించే జ్ఞానాంశాలు.
ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలు సూర్యారాధనను ప్రధానంగా కలిగి ఉన్నాయి. వాటి రూపురేఖలు వివిధ దాడులవల్ల క్రమంగా రూపుమాసినా, మనదేశంలో మాత్రం ఆదిత్యోపాసన అనేక పద్ధతుల్లో నిలిచి ఉంది. ఆదిత్యుని కొందరు మంత్రంతో, స్తుతితో, జపంతో, యంత్రంతో ఆరాధిస్తారు. కొందరు నమస్కారాలతో హోమాలతో అర్చిస్తారు. కొందరు కొన్ని పర్వాల్లో కొన్ని విధానాలతో కొలుచుకుంటారు.
సౌరమానం ప్రకారం, సూర్యుడు మకరరాశిలో సంక్రమించే పర్వంనుంచి 'మకరమాసం' ప్రారంభమవుతుంది. చాంద్రమానంలో 'మాఘమాసం' అని వ్యవహరించే నెల కూడా ఈ మకర మాసానికి చెందినదే. అందుకే ఈ రోజు నుంచి కుంభ సంక్రమణం వరకు ప్రతిరోజూ సూర్యారాధనను విశేషంగా శాస్త్రాలు బోధించాయి.
సూర్యుడు ప్రాణదాత, శక్తిప్రదాత, అన్నదాత- అని పురాణ వచనాలే కాదు... వైజ్ఞానిక అవగాహన కూడా. ఈ అవగాహనను ఆరాధనగా మలచి, భాస్కరుడిలోని భగవత్తత్వాన్ని ప్రచోదనం చేసి ప్రభావాన్ని పొందే ప్రక్రియలను భారతీయ ఉపాసన శాస్త్రాల్లో పలురీతుల్లో ప్రస్తావించారు. ఆ కారణంవల్లే రామాయణ భారతాది ఇతిహాసాల్లో, పద్దెనిమిది పురాణాల్లో, ఉపపురాణాల్లో ఆదిత్య హృదయాది అంశాలే కాక, అనేక సంకేతార్థాలతో సూర్య మహిమలను వివరించారు. వాటి ప్రకారం సూర్యోదయ పూర్వకాలం నుంచి సూర్యాస్తమయం వరకు సుప్రభాతంతో మొదలై సంధ్యాకాలం వరకు ఎన్నోరకాల నియమాలతో, క్రమశిక్షణాబద్ధమైన దినచర్యను ధార్మిక గ్రంథాలు చెప్పాయి.
అన్నదాత అయిన సూర్యుడి నుంచే భూమిపై సర్వప్రాణులు ఆహారాన్ని, ప్రాణాన్ని పొందుతున్నాయి- కొన్ని ప్రత్యక్షంగా, ఇంకొన్ని పరోక్షంగా. సూర్యుడినుంచి ప్రత్యక్షంగా ఆహారశక్తిని గ్రహిస్తున్నవి వృక్షాలు. వాటి పత్రహరితం వల్ల ప్రకృతి పచ్చనిదవుతోంది. ఆ పచ్చదనం మానవాదులకు ఆహారమై ప్రాణదాయకమవుతోంది. కొందరు ఆర్ష విజ్ఞాన సంపన్నులు కొన్ని ప్రత్యేక కాలాల్లో సూర్యకిరణాలను ఒక పద్ధతిగా శరీరంతో గ్రహించి అనేక రుగ్మతలనుంచి ఉపశమనాన్ని పొందవచ్చని సూర్యకిరణ చికిత్సా ఫలాలను సోదాహరణంగా, అనుభవపూర్వకంగా రుజువు చేస్తున్నారు.
బీజాలు సంగ్రహించి, పొలాలు దున్నినది మొదలు- పంట చేతికొచ్చేవరకు సౌర గమనాన్ని అనుసరించి ఏర్పడిన రుతుచక్ర ప్రభావం ఉంది. సూర్యుడి కిరణ శక్తులే కాంతులై, వర్షాలై ప్రాణాలై పంటలు పండించాయన్న కృతజ్ఞతతో- పంట చేతికందిన తరవాత సంక్రమణాన్ని సూర్యపర్వంగా వేద కాలాలనుంచి ఈ దేశంలో నిర్వహిస్తున్నారు. మొదట పంటలోని బియ్యంతో మొదటిగా ఆవుపాలతో, ఆరుబయట సూర్యకాంతి సమక్షంలో పరమాన్నం వండి సూర్యుడికి నివేదించడం ఈ పర్వంలోని ప్రధాన కృత్యం. ఇలా వండి నివేదించిన పాయసం ఆయురారోగ్యకరమని ధార్మిక శాస్త్ర భావన.
ప్రభాకరునికి ప్రీతికరమైన పర్వాల్లో సంక్రమణం, వారాల్లో ఆది(రవి)వారం, తిథుల్లో సప్తమి- భారతీయులకు అత్యంత పవిత్రమైనవి. సూర్య పర్వమైన సంక్రమణం ప్రతి నెలలో ఒక గొప్పదినంగా ఉపాసకులు, సంప్రదాయజ్ఞులు పాటిస్తారు. ఆ దినాన ఇష్ట దేవతారాధన, పితృతర్పణ వంటివి అనుసరిస్తారు. సంక్రమణాల్లో ఉత్తరాయణ పుణ్యకాలగతమైన 'మకర సంక్రమణం' బహు ప్రాధాన్యమైనది. అందుకే ఈ రోజున చేసే స్నాన, జప, దానాది పవిత్ర కర్మలు అధిక సత్ఫలాలనిస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కొన్నిచోట్ల నేడు తీర్థస్నానానికీ ప్రాముఖ్యముంది. చైతన్య స్వరూపుడైన భానుడు జ్ఞానదీప్తిని అనుసరించి 'భా'రత 'భా'స్కరుడై కటాక్షించాలని ప్రార్థిద్దాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్