మహాశివరాత్రి

మన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే...

Published : 30 Jan 2018 16:32 IST

మహాశివరాత్రి
ఫిబ్రవరి 13

న పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఇది మాఘమాసం కృష్ణపక్షంలో అర్థరాత్రి ఉండే చతుర్దశి తిథినాడు వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైంది. అందులోనూ కృష్ణచతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథి మరీ ప్రీతికరమైంది. ఆ కారణంగానే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణచతుర్దశి తిథులు మహాశివరాత్రులుగా ఉంటాయి. సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి శివుడికి బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అంటారు. శివరాత్రులు అయిదు రకాలు. అవి.. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. నిత్యశివరాత్రి అంటే ప్రతిరోజూ రాత్రిపూటచేసే శివారాధన. పక్ష శివరాత్రి అంటే ప్రతి పదిహేను రోజులకొకసారి శివార్చన కోసం నిర్దేశించిన రాత్రి. మాసశివరాత్రి అంటే ప్రతి మాసంలోనూ శివపూజకు ఉద్దేశించిన రాత్రి. మిగతా శివరాత్రులు ఏవి కుదిరినా కుదరకపోయినా ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రినాడు శివపూజ చేయడం పుణ్యప్రదం. యోగి అయినవాడు తన యోగబలం చేత యోగనిద్రలోకి వెళ్లే రాత్రిని యోగశివరాత్రి అని అంటారు. సాధారణంగా రాత్రిపూట దేవీపూజను, పగటిపూట దేవపూజను చేయడం ఒక ఆచారంగా ఉంటుంది. కానీ శివరాత్రి విషయంలో మాత్రం ఇది భిన్నంగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున రాత్రిపూటే శివపూజ జరుగుతుంది. త్రిమూర్తులలో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. శివుడు లయకారకుడు. ఇలా శివ ఆరాధన రాత్రిపూట జరగడానికి ఓ కారణం కూడా ఉంది. పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. శివరాత్రినాడు శివుడిని రాత్రిపూట మాత్రమే పూజించడం, మిగిలిన పండుగలలా పంచభక్ష్య పరమాన్నాలతో కాక ఉపవాస దీక్షతో శివరాత్రి పండుగను జరుపుకోవడం ఓ విశేషం. మహాశివరాత్రి వ్రతాచరణను గురించి లింగపురాణం పేర్కొంటోంది. వ్రత ఉద్యాపన గురించి స్కందపురాణంలో వివరంగా ఉంది. శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం కూడా ఓ అలవాటుగా వస్తోంది. శివరాత్రినాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి. రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాములలోనూ నాలుగు సార్లు నాలుగు రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు. మొదటి జాములో పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి పెసరపప్పు, బియ్యం కలిపి పులగం వండి శివుడికి నైవేద్యం పెడతారు. రుగ్వేద మంత్ర పఠనం జరుపుతారు. రెండో జాములో పెరుగుతో అభిషేకం, తులసీ దళార్చనచేసి, పాయసం నైవేద్యంపెట్టి యజుర్వేద మంత్రాలను చదువుతారు. మూడోజాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో అర్చించి, నువ్వుల పొడి కలిపిన తిను బండారాలను నివేదిస్తారు. సామవేద మంత్రపఠన చేస్తారు. నాలుగో జాములో తేనెతో అభిషేకంచేసి నల్ల కలువలతో పూజించి అన్నం నివేదిస్తారు. అధర్వణ వేద మంత్రాలను చదువుతారు. ఇలా అభిషేకాలు చేసే శక్తిలేనివారు అభిషేకం చేసేటప్పుడు శివదర్శనం చేసుకున్నా పుణ్యమేనంటారు. నాలుగో జాము ముగిశాక ఉదయంపూట శివుడిని ఊరేగిస్తారు. ఇలా ఊరేగించడం వెనుక ఓ సామాజిక అంతరార్థం ఉంది. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోలేకపోతే వారికి ఆ ఊరేగింపును చూసి పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అలాగే బిల్వదళ ప్రియుడు. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రినాడు విధిగా చేస్తుంటారు. తెలిసైనా, తెలియకైనా కొన్ని నీళ్ళు శివలింగం మీద పోసి మరికొన్ని మారేడు దళాలు ఆ శివలింగంమీద పెడితే బోళాశంకరుడు పరవశించి అలా చేసినవారిని అనుగ్రహించిన కథలు ఎన్నెన్నో మన పురాణాల్లో కనిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని