శివోహం

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అనే అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకొంటే సందర్భోచితంగా ...

Published : 12 Feb 2018 19:31 IST

శివోహం

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అనే అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకొంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది.
శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు లోకాలన్నీ భయకంపితాలై హాహాకారాలు చేస్తుంటే శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకొని ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకు, తనకు లోపల ఉన్న లోకాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని తన కంఠ ప్రదేశంలో నిలుపుకొన్నాడు. ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పని అయినట్లయితే, మనం ఆ పనిని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకొని ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తీసుకొని ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు- శివుడు పొంగిపోతాడు. అతగాడి కోరికలనన్నింటినీ తీరుస్తాడు. మనవద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు, ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే. ఇదీ శివతత్వం!

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉన్నది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడో కంటిమంటతో అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడ్డాడు. ఆమెకు పతిభిక్ష పెట్టాడు. కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వం!

ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం ఒక్క వూపున భూమి మీదకు దూకితే చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా వూని గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను తన శిరస్సు మీద భరించాడు. జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి గంగను నిదానంగా హిమవత్పర్వతం మీదకు పంపాడు. మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే దాన్ని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు అతడికి ప్రియమిత్రుడు. అయినప్పటికీ శివుడు నిరాడంబరుడే! మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో ఉండాలి. మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషంలో కానేకాదనటానికి శివుడే ఉదాహరణం; ఆదర్శం. ఇదీ శివతత్వం!

మహాన్యాసం అనే శివాభిషేకంలో దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదేవిధంగా షోడశాంగరౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక దీన్ని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని దీని అంతరార్థం. శివోహం- నేను శివుడిని; నేనే శివుడిని అనే మాటకు అసలైన అర్థమిదే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు