Lord Hanuman: ఏ మంత్రం చదువుతూ హనుమకు ప్రదక్షిణ చేయాలి?

మంగళవారాలు, ఇతర పర్వదినాలలో చేసే ప్రదక్షిణతో పోలిస్తే, హనుమజ్జయంతి రోజున చేసే ప్రదక్షిణ ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుందని పెద్దల మాట.

Published : 27 May 2024 17:34 IST

ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధికుశలుడు, గొప్ప పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు.. ఇలా హనుమంతుడిని ఎంత ప్రశంసించినా తక్కువే. దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం అంజనీ పుత్రుడు. కార్య సాధకుడైన హనుమను భక్తితో ఆరాధిస్తే, ప్రతి పని సులభమవుతుంది. ఒక్కో దేవతా మూర్తి ఒక్కోదానికి ప్రసన్నుడవుతాడు. హనుమ అత్యంత త్వరగా ప్రసన్నమయ్యేది ప్రదక్షిణతోనే. భక్తితో ఆయనకు ప్రదక్షిణలు చేస్తే, అనుకున్న కార్యం సిద్ధించడానికి అభయమిస్తారు.

సాధారణంగా ఆంజనేయస్వామిని మంగళవారం ఆరాధిస్తారు. అయితే, అత్యంత పవిత్రమైన ‘హనుమజ్జయంతి’ (జూన్‌ 1) సందర్భంగా స్వామివారికి ప్రదక్షిణ చేస్తే ఎన్నో రెట్ల ఫలాన్ని ఇస్తుంది. పవనసుతుడికి ఏవిధంగా ప్రదక్షిణ చేయాలో పరాశరసంహిత వివరిస్తోంది. ఆ రోజు హనుమ ఆలయానికి వెళ్లి భక్తితో 108 ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహం, కరుణాకటాక్ష వీక్షణలు లభిస్తాయని పెద్దల మాట.

హనుమాన్‌ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రదక్షిణ సమయంలో ఇతరులతో మాట్లాడకూడదు. మనసు నిండా భక్తితో ఆలయం చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు వేటితో పడితే వాటితో లెక్క పెట్టకూడదు. చాలా మంది పెన్నూ పేపర్‌, మిరియాలు, ఇతర ధాన్యపు గింజలను ఉపయోగిస్తుంటారు. అవన్నీ నిషిద్ధం. ప్రదక్షిణలు చేసేటప్పుడు ముఖ్యంగా పూలతోనే వాటిని లెక్కించాలి. అందుకు ముందుగానే 108 పూలను లెక్కించి విడిగా పెట్టుకుని తీసుకెళ్లాలి. పూజ కార్యక్రమాల్లో ఉపయోగించే వక్కలను కూడా ప్రదక్షిణ లెక్కకు వాడటం శ్రేష్టం. హనుమ ఆలయానికి వెళ్లి స్వామివారికి అభిముఖంగా ధ్వజస్తంభం వద్ద నిలబడి నమస్కరించి..

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం |
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహమ్ ||

అంటూ శ్లోకం చదువుతూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోగానే పువ్వు/వక్కను వేరొక పాత్రలోకి వేయాలి. అలా 108, 54, 27, 11, 5, 3 మన శరీరం సహకరించిన మేరకు ప్రదక్షిణ చేయాలి. మూడు కూడా చేయలేని వారు ఒక మారు శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేయవచ్చు. మంగళవారాలు, ఇతర పర్వదినాలలో చేసే ప్రదక్షిణతో పోలిస్తే, హనుమజ్జయంతి రోజున చేసే ప్రదక్షిణ ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుందని పెద్దల మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని