Updated : 08 Feb 2021 19:53 IST

స్వర్గం.. నరకం ఉంటాయా?

పురాణేతిహాసాల్లో స్వర్గనరకాల ప్రస్తావన వస్తుంది. ఈ స్వర్గనరకాలను చూసినవాళ్లెవరైనా ఉన్నారా, ఉంటే వారు ఎలాంటి అనుభూతి పొందారు అనేది ఆసక్తికరమైన విషయం. దీనికి సమాధానాన్ని మహాభారతంలోని చిట్టచివరి స్వర్గారోహణ పర్వంలో తెలుసుకోవచ్చు.

పాండవుల మహాప్రస్థానంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మార్గమధ్యంలోనే తనువులు చాలించారు. తన వెంట వచ్చిన ఒక కుక్కతో ధర్మరాజు స్వర్గలోకానికి చేరుకున్నాడు. ధర్మరాజు స్వర్గంలోకి అడుగుపెట్టగానే అక్కడ దుర్యోధనుడు కనిపించాడు.

ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నో పాపాలు చేసి, అధర్మంగా యుద్ధానికి తలపడిన దుర్యోధనుడికి స్వర్గం ఎలా లభించిందని అక్కడే ఉన్న నారదుణ్ని అడిగాడు. దుర్యోధనుడు యుద్ధంలో వీరోచితంగా పోరాడి, మరణించాడు కనుక అతడికి స్వర్గం లభించిందని నారదుడు చెప్పాడు. ఆ మాటకు నిశ్చేష్టుడైన ధర్మరాజు తన సోదరులు, భార్య, ఇతర ధర్మవీరులు ఉన్నచోటుకు తనను తీసుకొనిపొమ్మని దేవదూతకు చెప్పాడు. దేవదూత ధర్మరాజును తన వెంటపెట్టుకొని బయలుదేరాడు. దారి అంతా భయంకరంగా, చీకటిగా, రక్తమాంసాల బురదలతో, శవాలు ఎముకలతో, అగ్నిజ్వాలలతో నిండి ఉంది. అక్కడి దుర్గంధాన్ని సహించలేక వెనుదిరిగాడు. అంతలో కొందరి హాహాకారాలు వినిపించాయి.

ధర్మరాజు ఆశ్చర్యంతో ‘మీరంతా ఎవరు, నన్నెందుకు నిలువమంటున్నారు?’ అని వాళ్లను అడిగాడు. అప్పుడు- ‘ప్రభూ! నేను భీముణ్ని. నేను కర్ణుణ్ని. నేను అర్జునుణ్ని, నేను నకులుణ్ని, నేను సహదేవుణ్ని, నేను ద్రౌపదిని. మేము ద్రౌపదీపుత్రులం’ అనే మాటలు వినిపించాయి. ఇంతలో దేవదూత వెళ్లి, ఈ విషయాన్ని ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు స్వయంగా బయలుదేరి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు.

అప్పుడు ధర్మరాజు ఇంద్రుడితో ‘ధర్మాత్ములైన నా సహోదరులు, నా భార్య నరకంలో అగచాట్లు  పడటం ఏమిటి? దుష్టుడు, పాపాత్ముడైన దుర్యోధనుడు స్వర్గంలో ఉండటం ఏమిటి?’ అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో- ‘నాయనా ధర్మజా! ఎక్కువగా పాపాలు చేస్తూ, తక్కువగా పుణ్యాలు చేసేవాళ్లు మరణానంతరం మొదట పుణ్యఫలానికి స్వర్గలోకానికి చేరుకొని, ఆ తరవాత నరకానికి పోతారు. ఎక్కువ పుణ్యాలు చేసి, తక్కువ పాపాలు చేసినవాళ్లు మొదట పాపఫలాన్ని నరకంలో అనుభవించి, ఆపైన స్వర్గానికి చేరుకుంటారు. నీవు కూడా ద్రోణుడి విషయంలో ‘అశ్వత్థామా హతః కుంజరః’ అనే ఒక చిన్న అబద్ధం చెప్పావు కనుక నరకాన్ని చూడవలసి వచ్చింది’ అన్నాడు.

స్వర్గనరకాలు ఉన్నాయని నమ్మేవారు, లేవని కొట్టిపారేసేవారు లోకంలో ఉంటారు. స్వర్గనరకాలను గురించి బోధించడంలోని ఆంతర్యాన్ని గ్రహించాలి. సుకృతాలను ఎక్కువగా చేసి, అందరికీ మేలుచేయాలనే తలంపుతోనే స్వర్గనరకాలను గురించి చెబుతారని పరమార్థంగా భావించాలి. తప్పుచేసేవాడికి మనశ్శాంతి కరవవుతుంది. దానివల్ల దుఃఖం కలుగుతుంది. దుఃఖంవల్ల జీవనం అల్లకల్లోలం అవుతుంది. కనుక మనిషి పుణ్యాలే చేయాలి.

పురాణేతిహాసాలు మానవుల్లో నైతికత పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. మనిషి ఎప్పుడూ తనలోని అజ్ఞానాన్ని తనకు తానుగా తెలుసుకోలేడు. అతడికి నచ్చేవిధంగా చెప్పాలి. అందుకే ఎన్నో నీతికథల రూపంలో మానవుల ప్రవర్తనలో సంస్కరణలను తెచ్చేందుకు ప్రాచీన సాహిత్యం పూనుకొంది.

స్వర్గనరకాలు ఎక్కడో పైలోకాల్లో లేవు. మనుషుల కళ్లెదుటే కనిపిస్తాయి. చెడు పనులు చేసినవాళ్లు పర్యవసానంగా పొందే అష్టకష్టాలను చూస్తే, అవన్నీ నరకాలే అనడం యథార్థం. మంచిపనులను చేసి ఆత్మతృప్తిని అనుభవిస్తూ, సమాజంలో కీర్తిప్రతిష్ఠలను పొందుతున్నవాళ్లను చూసినప్పుడు పుణ్యఫలం ఎంత మధురమో తెలుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని