ఆచార్యులకే ఆచార్యుడు

ఆయన ఈ లోకంలో భౌతికంగా జీవించింది యాభై ఏళ్లే. కానీ వేల సంవత్సరాల ఆధ్యాత్మిక పథానికి మైలురాయిగా నిలిచారు. సర్వమతాలు సంగమించే సాగరంలో దీపస్తంభమై వెలిగారు.

Updated : 14 Mar 2023 13:16 IST

ఫిబ్రవరి 21 రామకృష్ణ పరమహంస జయంతి

ఆయన ఈ లోకంలో భౌతికంగా జీవించింది యాభై ఏళ్లే. కానీ వేల సంవత్సరాల ఆధ్యాత్మిక పథానికి మైలురాయిగా నిలిచారు. సర్వమతాలు సంగమించే సాగరంలో దీపస్తంభమై వెలిగారు. తను గతించినా తన పారమార్థిక ప్రభను ప్రసరింపచేస్తూనే ఉన్నారు. వారే రామకృష్ణ పరమహంస.

రిత్ర కనీవినీ ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక సాధనలు అవలంబించి శిఖరాగ్రానికి చేరుకున్న జగద్గురువు రామకృష్ణ పరమహంస. అందుకే ప్రపంచ ప్రఖ్యాత తాత్వికులు ఆర్నాల్డ్‌ టాయన్బీ ‘వీరిలా జీవించి చూపిన ధార్మిక జ్ఞానేశ్వరుడు మరొకరు లేరు’ అని కొనియాడారు. వారి జీవితం ఇగిరిపోని ఆధ్యాత్మిక చందన పరిమళం. పరమహంస     హైందవ ధర్మంలోనే కాదు, ఇస్లాం, క్రైస్తవ తదితర ధర్మాల్లోని సత్యాన్నీ సాక్షాత్కరింప చేసుకున్నారు. అలా అనుభూతి చెంది ‘ఎన్ని మతాలో అన్ని మార్గాలు’ అంటూ వివరించారు. భక్తి, జ్ఞాన, రాజ, కర్మయోగాల సమన్వయం పరమహంస. ఆయనకు ముందూ, తర్వాత కూడా మరెవరూ ఈ రీతిలో పారమార్థిక సాధనల్ని ఆచరించలేదు. అందుకే ‘ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయ తే నమః’ అంటూ ఆరాధిస్తారు.

భక్తిమార్గంలో భాగవతోత్తముడు

దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారిగా ఉండగా సాయంసంధ్య వేళ ఘంటారావాలు, భక్తిగీతాలు వింటే దుఃఖం కలిగేది పరమహంసకు. ‘అమ్మా! అనిత్య జీవితంలో ఇంకో రోజు వ్యర్థమైపోయింది’ అని విలపించేవారు. ఆయన నిర్వర్తించే అసాధారణ పూజావిధానం చూసి స్థానికులు ఎంతగానో ఆశ్చర్య పోయేవారు. కోవెలలోని ఆ మృణ్మయమూర్తికి చేతనత్వాన్ని తీసుకొచ్చారు.

మహా జ్ఞానేశ్వరుడు

‘గురుదేవులు పైకి భక్తుడిగా కనిపిస్తారు కానీ అంతరంగంలో మూర్తీభవించిన జ్ఞానేశ్వరుడు. వేదాలూ, పురాణాల్లోని సూక్తులకంటే ఆయన ముఖతా వెలువడే వాక్కులే బలీయమనిపించాయి’ అనేవారు స్వామి వివేకానంద. పరమహంస సంక్లిష్ట ఆధ్యాత్మిక సత్యాలను సరళంగా వివరిస్తారంటూ నాటి ఉద్ధండ పండితులు, బ్రహ్మసమాజ ఆచార్యులు శ్లాఘించారు. ఆయన జ్ఞానయోగి అనటానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని జాగృతపరుస్తున్న వారి ప్రబోధాలే నిదర్శనం.

ఆధ్యాత్మిక మహారాజు

తోతాపురి అనే మహాతపస్వి సన్యాసదీక్ష ఇవ్వగా మూడు రోజులు ధ్యానంలో నిమగ్నమయ్యారు పరమహంస. ఆ స్థితిలో పక్షులు తలపై వాలేవి. పాములు మేని మీద ఎగబాకేవి. అది చూసి ‘నేను 40 ఏళ్లు కఠోరదీక్షతో సాధించిన సమాధి స్థితిని రామకృష్ణులు 3 రోజుల్లోనే సాధించాడు’ అంటూ సంభ్రమానికి లోనైన తోతాపురి తన శిష్యుణ్ణే గురువుగా భావించి భక్తియోగం అభ్యసించారు.

కర్మయోగంలో కారణజన్ముడు

స్వామి వివేకానందకు మార్గనిర్దేశం చేసిన పరమాచార్యుడు పరమహంస. బాధ్యతల్ని విస్మరించటం ఆధ్యాత్మికత కాదు, పలాయనం పారమార్థికత అనిపించుకోదని హితవు పలికేవారు. తన వద్దకు వచ్చే గృహస్థులతో ‘మీ కుటుంబ పోషణకు, ధర్మాచరణకు ఉపాధి అవసరమే. ఆ కర్తవ్యాల్ని సమర్థంగా నిర్వహించండి’ అనేవారు. ‘జీవసేవే దైవసేవ’ అంటూ భిక్షగాళ్లకు అన్నం వడ్డించేవారు. ఎంగిలి విస్తళ్లను తీసి, ఆ స్థలాన్ని శుభ్రం చేసేవారు.

నేటికీ రామకృష్ణ మఠం, మిషన్‌ల భక్తులు ఆ మహాచార్యుని అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. వారి దివ్యస్ఫూర్తితో భక్తి, జ్ఞాన, రాజ, కర్మ యోగాల్లో పురోగతి సాధిస్తున్నారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని