Krishna Janmashtami 2022: శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి? ఆరోజేం చేయాలి?

హిందూ సంప్రదాయంలో కృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారమే......

Updated : 14 Mar 2023 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందూ సంప్రదాయంలో కృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఎనిమిదో అవతారమే శ్రీ కృష్ణావతారం. పరంధాముడు బహుళ పక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ రోజును కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిగా  పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు చాలా విశేషమైనవి. వీటిలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశరామ, శ్రీరామ అవతారాల తర్వాత ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణావతారం. పురాణాల ప్రకారం.. అష్టమి తిథి, అష్టమ గర్భం, అష్టమ అవతారం.. ఇలా కృష్ణావతారానికి 8 సంఖ్యతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణ భగవానుడు శ్రావణమాస బహుళ పక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం నందు అర్ధరాత్రి 12గంటలకు వృషభ రాశి, వృషభ లగ్నం నందు జన్మించినట్టుగా  జ్యోతిష శాస్త్రం పేర్కొంది. 2022 శ్రీ శుభ్‌కృత్‌ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్‌సిద్ధాంత గణితం ఆధారంగా 18వ తేదీ రాత్రి 9గంటల 21 నిమిషాలకు అష్టమ తిథి ప్రారంభమై 19న రాత్రి 11.40 వరకు ఉంటుంది. అందుకే ఆగస్టు 19న సూర్యోదయం సమయానికి అష్టమ తిథి ఉండటంతో ఆరోజు కృష్ణాష్టమి జరుపుకోవాలి.

శివరాత్రికి అర్ధరాత్రి పూట లింగోద్భవ సమయం ఎంత ప్రాధాన్యమైనదో కృష్ణాష్టమి (జన్మాష్టమి)కి అష్టమ తిథి ఉన్నటువంటి రాత్రి 12గంటల సమయం అంతటి కీలక సమయం. ఆగస్టు 18న రాత్రి  ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ చేసి అర్ధరాత్రి 12గంటలకు కృష్ణుడిని ఆరాధించాలి. 19వ తేదీన జన్మాష్టమి వేడుకలు చేసుకొంటూ అలంకారప్రియుడైన శ్రీకృష్ణ భగవానుడిని అలంకరించి భక్షభోజ్యాదులతో నివేదనలు చేసి భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలాగే, ఆరోజు భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, మహాభారతం చదవడం వల్ల విశేష పుణ్యఫలం దక్కడంతో పాటు భగవానుడి అనుగ్రహం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆరోజు చిన్ని కృష్ణుడిని పంచామృతాలతో అభిషేకం చేయడంతో పాటు అష్టోత్తర శతనామావళితో పూజించడం, అనేక రకాల పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించడం, విశేషించి పాలు, వెన్న నైవేద్యంగా పెట్టడం వంటివి చేయాలి. కృష్ణనామ స్మరణ, శ్రీకృష్ణగానం, భజనలు, కీర్తనలతో కాలక్షేపం చేయాలి. అలాగే, యువత ఉట్టికొట్టి క్రీడలు ఆడటం, చిన్నారులను కృష్ణుడిగా అలంకరించడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పూజా మందిరాన్ని అలంకరించి ఇంట్లో శ్రీకృష్ణుడి పాదముద్రలను వేసుకోవడం, ఆవునెయ్యితో ఇంటి బయట తులసి కోటలో దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. 

 ప్రముఖ పంచాంగ కర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని