మాఘ మాస వైశిష్ట్యం: ఈ మాసంలో ఏం చేయాలి?

చంద్రుడు మఘ నక్షిత్రంలో ఉండే మాసాన్ని మాఘ మాసం అంటారు. మఘం అంటే యజ్ఞం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది. ....

Updated : 14 Mar 2023 16:07 IST

చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘ మాసం అంటారు. మఘం అంటే యజ్ఞం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది. దక్షిణాయణంలో కార్తిక మాసం ఎంత పవిత్రమైనదో.. ఉత్తరాయణంలో మాఘ మాసానికి అంత ప్రాముఖ్యత ఉంది.

మాఘ మాసంలో ఏం చేయాలి?

ఈ మాసంలో ప్రప్రథమంగా స్నానం, పురాణ పఠనం, జపం, తర్పణం, హోమం (యజ్ఞం) చేయాలి. మాఘంలో మాఘ పురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయి. పుణ్య నదీ స్నానం గానీ, సముద్ర స్నానం గానీ చేయడం వల్ల శరీరానికి మంచిది. మనస్సుకు శాంతి కలిగి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. స్నాన విధి అంటే పుణ్య నదికి వెళ్లి నదీ దేవతకు నమస్కరించి సబ్బులు/షాంపూలు వాడకుండా మూడు మునకలతో స్నానమాచరించి దేవతలు, పితృదేవతలకు తర్పణాలు వదిలి తమకు ఇష్టమైన దైవాలను తలచుకొని నమస్కారం చేసి రావడం. ఎవరైతే మాఘ మాసంలో పుణ్య స్నానం లేదా నిత్యం ఇంటి వద్దే దైవస్మరణ చేసి స్నానమాచరిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని మాఘ పురాణం చెబుతోంది. ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ మాఘ మాసంలోనే వస్తాయి.

మాఘ మాస శుక్ల విదియ: ఈ రోజు పార్వతీదేవిని పూజించాలి. బెల్లం, ఉప్పు దానం చేస్తే మంచిదని మాఘ పురాణం చెబుతోంది.

మాఘ మాస శుద్ధ చవితి: ఈ రోజు ఉమా పూజ చేస్తారు. నువ్వుల దానం గొప్ప పుణ్యఫలం.

మాఘ మాసం శుద్ధ పంచమి/ శ్రీపంచమి: ఈ రోజు సరస్వతీ పూజ చేయడం విశేష ఫలప్రదం.

మాఘ మాస శుద్ధ షష్ఠి: ఈ రోజును వరుణ షష్ఠి అని కూడా పిలుస్తారు. వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రవస్త్రాలతో పూజిస్తారు.

మాఘ మాస శుద్ధ సప్తమి: దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. ఈ రోజు సూర్య జయంతి. సూర్య భగవానుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

మాఘ మాస శుద్ధ అష్టమి/ భీష్మ అష్టమి: ఈ రోజు నదీ స్నానమాచరించి భీష్ముడికి తర్పణం వదులుతారు.

మాఘమాస శుద్ధ ఏకాదశి/ భీష్మ ఏకాదశి: భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెప్పుకొంటారు. ఈ రోజు ప్రతిఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. భీష్మ ఏకాదశి రోజు అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరుపుతారు. ఇది అత్యంత విశేషమైనది.

మాఘ పూర్ణిమ: ఇది అత్యంత విశిష్టత కలిగిన పూర్ణిమ. ఈ రోజు కాళహస్తిలో స్వర్ణముఖీ నదిలో గానీ ప్రయాగ త్రివేణి సంగమంలో గానీ స్నానమాచరించడం వల్ల అత్యంత పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మాఘ పౌర్ణమి రోజు సతీదేవి జన్మించినట్టుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

మాఘమాస కృష్ణ పక్ష ఏకాదశి/ విజయ ఏకాదశి: ఈ రోజు రామసేతు పూర్తయిన రోజుగా రామాయణం తెలియజేస్తోంది. మాఘ మాసం కృష్ణ చతుర్థశి నాడు మహా శివరాత్రి. ఈరోజు లింగోద్భవ కాలమని శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు.

మన పురాణాల్లో మాఘ మాసం అత్యంత ప్రాధాన్యమైనది. ఈ మాసంలో నిత్యం స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. నువ్వుల ఉండలను దేవుడికి నివేదించడం, పంచడంతో పాటు నువ్వులు, బెల్లం కలిసిన ఉండలను స్వీకరించడం ఆరోగ్యానికి మంచిది. శని ప్రభావాలు తొలగి పాపాలు నశించి పుణ్యాలు కలుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని