ప్రాణహిత పుష్కరం.. భక్తజన శోభితం: పుష్కరాలకు ఉన్న పురాణ గాథ తెలుసా?

ప్రాణహిత నదీ పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పుష్కరాల్లో ఆఖరి రెండు రోజులు శని/ఆదివారం సెలవు దినాలు కావడంతో భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనానికి, కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కర.....

Updated : 14 Mar 2023 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రాణహిత నదీ పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పుష్కరాల్లో ఆఖరి రెండు రోజులు శని/ఆదివారాలు రావడంతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనానికి, కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కర స్నానానికి వేలాదిగా తరలిరావడంతో ప్రాణహిత నదీ తీరం భక్తజన శోభితంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు పుష్కరాలు అంటే ఏమిటి? పుష్కర స్నానమాచరించడం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది? పుష్కరాల వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటనే విషయాలను ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. పుష్కరం అంటే పోషించేటువంటిది అని అర్థం. అలాగే, పుష్కరం అంటే 12 ఏళ్లు అని కూడా అర్థం. బృహస్పతి ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఒక్కో నదికి ఒక్కో పుష్కరం ఏర్పడుతుంది. ప్రస్తుతం శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఏప్రిల్‌ 13న గురుడు (బృహస్పతి) మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తోన్న ప్రాణహిత నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి. మన సనాతన ధర్మంలో పుష్కరాలకు విశేష ప్రాధాన్యం ఉంది.

పుష్కరాల ప్రాశస్త్యం ఇదీ..

పురాణాల ప్రకారం తుందిలుడు అనే ధర్మాత్ముడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందాడు. ప్రసన్నుడైన పరమ శివుడు ‘ఏ వరం కావాలో కోరుకో’మని అడగ్గా.. జలాలన్నింటిలో ప్రముఖ తీర్థాలు, జలాలు/నీరుకి అధిపతి అయిన పుష్కర రూపం ఇచ్చి ఈ సకల తీర్థాలు/నదులు తన ఆధీనంలో ఉండేలా వరం ప్రసాదించాలని కోరాడు. తన ఎనిమిది రూపాల్లో ఒకటైన పుష్కర రూపాన్ని (నీరుగా ఉండే రూపం) తుందిలుడికి వరంగా ప్రసాదించిన శివుడు తుందిలుడుని కైలాసానికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ.. శివుడి వద్దకు వెళ్లి అనేక రకాలుగా స్తుతించి సృష్టి కొనసాగించుటకు పుష్కరుడి అవసరం ఉందని.. ఆ రూపం తనకు ఇవ్వాలని కోరాడు. అయితే, పుష్కర రూపాన్ని తన కమండలంలో ఉంచుతానని చెప్పి స్వీకరించడం.. ఆ పుష్కరుడు బ్రహ్మదేవుడి కమండలంలో ఉన్నాడు. కొంత కాలానికి దేవగురువు అయిన బృహస్పతి బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఆయన సాక్షాత్కరం పొందిన తర్వాత బ్రహ్మ నీకు ఏ వరం కావాలని అడిగాడు. అప్పుడు బృహస్పతి నదులపై ఆధిపత్యం, పుణ్య తీర్థాలు, పుష్కరుడు తన ఆధీనంలో ఉండేలా.. నవగ్రహాల్లో తనకు కూడా గ్రహాధిపత్యం కల్పించాలని కోరాడు. నవ గ్రహాల్లో బృహస్పతికి ఆధిపత్యం ఉండేలా/ దేవతలకు ప్రీతికరంగా ఉండే విధంగా బ్రహ్మను వరం కోరగా.. దాన్ని ప్రసాదించెను.

బ్రహ్మ వరమును విని పుష్కరుడు కలత చెందాడు. నీవు నాకు పూర్వమే సకల నదులపై ఆధిపత్యం కల్పించి.. తిరిగి బృహస్పతికి ఎలా ఇస్తావని బ్రహ్మను అడుగుతాడు. దీంతో బ్రహ్మ ఇరువురి మధ్యా సంధి కుదిర్చి బృహస్పతి ఒకరాశి నుంచి మరోరాశికి ప్రవేశించేటప్పుడు ఒక్కో నదికి 12 రోజులు పుష్కర దినములనీ.. ఈ సమయంలో ఎవరైతే ఆ నదీ స్నానమాచరిస్తారో వారికి పాపాలు తొలగి.. పుణ్యం లభిస్తుందని చెబుతాడు. అలాగే, ఈ సమయంలో ఆ నదుల్లో పుష్కరుడు, బ్రహ్మ, సకలదేవతలు వారి శక్తిరూపాల్లో నివసిస్తావని చెప్పాడు. బృహస్పతి ఆయా నదుల రాశుల్లో ఉన్నంత కాలం ఆ నదికి పుష్కరాలు ఉన్నట్టే. బృహస్పతి ఒక ఏడాది పాటు ఆయా రాశుల్లో ఉంటాడు. ఆ సందర్భాల్లో పుష్కరాలు మొదలైన తొలి 12 రోజులు ఆది పుష్కరమనీ.. ఏడాది చివరిలోని 12 రోజుల్ని అంత్య పుష్కరాలనీ పిలుస్తారు. ఏ నదికైతే పుష్కరాలు జరుగుతాయో ఆ నదిలో ఆ ఏడాది మొత్తం అభిజిత్‌ ముహూర్త సమయానికి (మధ్యాహ్నం 12గంటలకు) చేసే స్నాన, దాన, జప, తప, హోమాలకు విశేషమైన పుణ్యఫలం దక్కుతుందని పుష్కర వైశిష్ట్యం తెలిపినట్టుగా చిలకమర్తి  తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు