ఇది ఖురాన్‌ నెల

‘రంజాన్‌ పుణ్యకాలం ప్రారంభమైంది. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇకనైనా నిద్ర నుంచి మేలుకో! మంచి పనులే చెయ్యి. దైవ భీతితో జీవించు. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం.

Published : 23 Mar 2023 00:07 IST

మార్చి 24 నుంచి రంజాన్‌ నెల ప్రారంభం

‘రంజాన్‌ పుణ్యకాలం ప్రారంభమైంది. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇకనైనా నిద్ర నుంచి మేలుకో! మంచి పనులే చెయ్యి. దైవ భీతితో జీవించు. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం. నువ్వింకా ముందుకు సాగాలి. ఇక్కడే ఆగిపోతే గమ్యం చేరలేవు. మజిలీలే గమ్యమని భ్రమిస్తే నష్టపోయేది నువ్వే’- ఆకాశంలో రంజాన్‌ నెలవంక దర్శనమివ్వగానే దైవదూత వేసే చాటింపిది.
రంజాన్‌కు నెలరోజుల ముందే స్వాగత సన్నాహం చేస్తారు. ఉపవాసాలకు మానసికంగా సన్నద్ధమవుతారు. పండుగ రోజుల్లో చేయాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారు. నియమ నిబంధనలను అనుసరిస్తారు. ‘చాంద్‌ ముబారక్‌..!’ అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. హృదయాల్లో పేరుకుపోయిన దురాశ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం లాంటివన్నీ వదిలేసి పరస్పరం ప్రేమగా గడపాలన్న ప్రవక్త మాటకు కట్టుబడతారు. ‘రంజాన్‌ నెలలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. సైతాన్‌ బంధితుడు అవుతాడు’ అన్న ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగా ముస్లిములు ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచు కుంటారు. సహెరీ, ఇఫ్తార్లతో ఎటు చూసినా వాతావరణం హృద్యంగా ఉంటుంది. రంజాన్‌ మాసాన్ని ఉలమాలు ఖురాన్‌ నెల అని, సానుభూతి చూపవలసిన మాసమని చెబుతారు. ఉపవాసాలతో ఆకలి బాధలు అనుభవంలోకి వచ్చి పేదలను ఆదుకునే స్ఫూర్తి కలుగుతుంది.
ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు