మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి..?

చంద్రుడు మఖ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసాన్ని మాఘ మాసం అని జ్యోతిష శాస్త్ర ప్రకారం పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు...

Updated : 14 Mar 2023 15:29 IST

చంద్రుడు మఖ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసాన్ని మాఘ మాసం అని జ్యోతిష శాస్త్ర ప్రకారం పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మఖ నక్షత్రం సింహ రాశిలో ఉండడం.. ఆ రాశికి అధిపతి రవి అవ్వడం.. ఆ రవి మకర రాశిలో మాఘ మాసంలో ఉండడం చేత ఈ మాసానికి ప్రాధాన్యం ఏర్పడింది.

అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలగించేది గనుకనే మాఘ మాసానికి, మాఘ పౌర్ణమికి ప్రాధాన్యం లభించింది. మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం ఆచరించాలి.

పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని శాస్త్ర పెద్దల వాక్కు. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్య నదుల్లో గానీ, సముద్రంలో గానీ, వారి గృహాల్లో జలంతో శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి.  మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుడిని, సూర్య భగవానుడిని, గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పాపాలు హరించి పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం తెలియజేస్తోంది.

మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు..

1. తలస్నానం ఆచరించాలి.

2. శ్రీమన్నారాయణుడిని, గంగను స్మరిస్తూ తర్పణం విడిచిపెట్టాలి.

3. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది. ఈ రోజు చేసేటువంటి జపతపహోమాదులకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని సత్యనారాయణవ్రత కథ తెలియజేసిందని చిలకమర్తి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని