తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..

విలువలే ఆస్తి.. తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన కోసం ఇచ్చిన మాటకు నిలబడి ఉంటా. సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ డైలాగ్ గుర్తుకొచ్చిందా. అయితే ఇది మహాభారతం లో భీష్ముడి జీవన విధానం.

Updated : 30 Mar 2023 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలువలే ఆస్తి.. తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన కోసం ఇచ్చిన మాటకు నిలబడి ఉంటా.  ఇది మహాభారతం లో భీష్ముడి జీవన విధానం.

భీష్మ జ‌న‌నం.. ఏడుగురు కుమారులను క‌డ‌తేర్చిన గంగ‌...
శంతనుడు అనే రాజు హస్తినని పాలిస్తుండేవాడు. ఓరోజు నదీ తీరాన గంగను చూసి ప్రేమించి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె ప్రేమను ఒప్పుకొంది. కానీ ఓ షరతు పెట్టింది. తాను ఏం చేసినా ప్రశ్నించొద్దు అని మాట తీసుకుంది. ఈక్రమంలో వారికి పుట్టిన ఏడుగురు కుమారుల్ని ఒక‌రి త‌ర్వాత ఒక‌రిని నదిలో ముంచేసింది. చివరగా ఎనిమిదో కుమారుడిని కూడా నదిలో వదిలేందుకు వెళ్లగా.. శంతనుడు కన్న బిడ్డల్ని ఎలా పొట్టన పెట్టుకుంటావంటూ అడ్డుకున్నాడు. దీంతో ఆమె.. ఈ ఎనిమిది మంది గ‌త జ‌న్మలో దేవ‌త‌ల‌ని, వారి శాపవిమోచ‌న కోస‌మే ఇలా చేసిన‌ట్లు వివ‌రించింది. మ‌రోవైపు తన షరతును ఉల్లంఘించి ఎదురు ప్రశ్నించావంటూ ఎనిమిదో కుమారుడు దేవవ్రతుడిని(భీష్ముడు), శంత‌నుడిని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది. 

భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటారు?
అనంతరం శంతనుడు యమునా నది ఒడ్డున ఓ యువతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె దాశరాజు కుమార్తె సత్యవతి అని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్తాడు. సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. దీంతో దాశరాజు.. శంతనుడి కుమారుడు దేవవ్రతుడు(భీష్ముడు) రాజ్యం పరిపాలించరాదని.. భవిష్యత్తులో సత్యవతికి పుట్టే కుమారులే ఆ బాధ్యతలు చేపట్టాలని షరతు  విధిస్తాడు. షరతుకు నిరాకరించిన శంతనుడు నిరాశగా వెనుదిరిగాడు. దేవవ్రతుడు(భీష్ముడు) విషయం తెలుసుకుని స్వయంగా దాశరాజు వద్దకు వెళ్లి తాను రాజ్యం పాలించనని మాటిచ్చాడు. భ‌విష్యత్తులో వివాహం అయిన తరువాత పరిస్థితులు మారతాయేమో.. నీ వారసులకు రాజ్యకాంక్ష రావచ్చేమో అని దాశరాజు అనుమానం వ్యక్తం చేశాడు. ఇక దేవవ్రతుడు తాను ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనని, రాజ్యాన్ని పరిపాలించనని ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఆయన పేరు భీష్ముడిగా, ఆయన చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ గా నిలిచిపోయింది.

కాశీ రాజు కుమార్తె వివాహం చేసుకోమ‌న్నా..
భీష్ముడి గొప్ప త్యాగం కార‌ణంగా సత్యవతికి  శంతనుడితో వివాహమైంది. కాల‌గ‌మ‌నంలో ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు  అనే కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు ఓ ద్వంద యుద్ధంలో మృతి చెందాడు. తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం కోసం భీష్ముడు  స్వయంవరంలో కాశీ మహారాజు కుమార్తెలు అంబ, అంబాలిక, అంబికలను ఎత్తుకొచ్చాడు. దారి మధ్యలో అంబ తాను సాళ్వ రాజును ప్రేమించానని చెప్పింది. దీంతో ఆమెను క్షమించమని వదిలేసి.. మిగతా ఇద్దరికి విచిత్ర వీర్యుడితో వివాహం చేయిస్తాడు. అయితే మరోవైపు స్వయంవరంలో అపహరణకు గురైన  యువతి తనకు వద్దు అని సాళ్వ రాజు.. అంబను తిరస్కరించాడు. దీంతో ఆమె తన ఈ పరిస్థితికి కారణమైన భీష్ముడిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. తాను గ‌తంలో చేసిన ప్రమాణం కార‌ణంగా వివాహం చేసుకోనని భీష్ముడు బ‌దులిస్తాడు. ఎంత బతిమాలినా వినకపోవడంతో ఆమె తపస్సు చేసి శివుడి వద్ద భీష్ముడిని చంపే వరం పొంది ఆత్మార్పణం చేసుకుంటుంది. మరుజన్మలో శిఖండిగా జన్మిస్తుంది.

తండ్రి లేక‌పోయినా ప్రమాణం నిలిచే ఉంటుంది 
అనారోగ్య కారణాలతో కొంత కాలానికి సత్యవతి కుమారుడు విచిత్ర వీర్యుడు మృతి చెందాడు. అప్పటికే శంతనుడు మృతి చెందాడు. దీంతో సత్యవతి వంశం వృద్ధి చెందడానికి తన కోడళ్లకు గర్భదానం చేయాలని, రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని భీష్ముడిని కోరింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఈ పని చేయలేనని భీష్ముడు బదులిచ్చాడు. తండ్రే పోయాక మాటదేముందని సత్యవతి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన‌కిచ్చిన మాట శాశ్వతంగా నిలిచి ఉంటుందని భీష్మ ప్రతిజ్ఞను చాటి చెప్పాడు. ఈ పరిస్థితుల్లో వ్యాసుడు గర్భదానం చేయగా అంబిక,అంబాలికలకు దృతరాష్ట్రుడు, పాండు రాజు, దాసికి విదురుడు జన్మించారు.

శిఖండి కార‌ణంగా భీష్ముడి మృతి
చివరికి కురుక్షేత్ర యుద్దంలోనూ భీష్ముడు ధ‌ర్మం వైపు నిలిచాడు. కౌర‌వుల‌వైపు పోరాడుతున్నప్పటికీ.. తాను ఆయుధం చేతబట్టని వారితో, ఆడ వారితో (శిఖండి) యుద్ధం చేయననే రహస్యాన్ని పాండ‌వుల‌కు చెప్పాడు. దీంతో పాండవులు శిఖండిని యుద్ధంలో భీష్ముడి  ఎదురుగా ఉంచే ఏర్పాటు చేశారు. ఈక్రమంలో భీష్ముడు ఆయుధాన్ని వదిలేయ‌డంతో. ఇదే అదనుగా అర్జునుడు, శిఖండి.. భీష్ముడి శరీరంలో బాణాలు దింపుతారు. ఓ కురు పితామహుడు, గాంగేయుడు ఇలా నేలకొరిగాడు. నిలువెల్లా బాణాలతో ఆయన అంపశయ్యపై చివరి రోజులు గడిపాడు. మరోవైపు అప్పుడు దక్షిణాయణం కావడంతో.. భీష్ముడు మృతి చెందితే స్వర్గప్రాప్తి ఉండదని అక్కడున్న వారు కలవరపడ్డారు. కానీ గాంగేయుడి(భీష్ముడు)కి ఇచ్ఛా మరణం(కోరుకున్నప్పుడే చావు) వరం ఉంటుంది. దీంతో ఆయన ఉత్తరాయణం వరకూ అంపశయ్యపైనే ఉండి ఆ తర్వాత స్వచ్ఛంద మరణం పొందారు. అంపశయ్యపైన ఉన్నసమయంలోనే ఆయన విష్ణు సహస్త్రనామాలు రచించి ఆ పరంధాముని అనుగ్రహాన్ని భావితరాలకు అందించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు