Fasting: ఉపవాసం రోజున ఏమీ తినకూడదా?

వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేవారు కొందరైతే... మహాశివరాత్రి, ఏకాదశి తిథులూ, ఇతర ప్రత్యేక మాసాలూ, పర్వదినాల్లో ఉపవాస దీక్షను పాటిస్తారు మరికొందరు.

Updated : 14 Mar 2023 15:25 IST

కొందరు ఉపవాసం రోజున పండ్లు తినొచ్చని చెబితే... మరికొందరు అసలేమీ తీసుకోకూడదని అంటారు. అసలు ఉపవాసం ఎలా చేయాలి?

వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేవారు కొందరైతే... మహాశివరాత్రి, ఏకాదశి తిథులూ, ఇతర ప్రత్యేక మాసాలూ, పర్వదినాల్లో ఉపవాస దీక్షను పాటిస్తారు మరికొందరు. నిజానికి ప్రత్యేక పర్వదినాలలో పూజలతో, స్తోత్ర పారాయణాలతో   దైవ చింతనలో గడపాలని మన పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు ఆహారం తీసుకోకపోవడం ఉపవాసంగా భావించారు. కానీ అసలు ఉపవాసం అంటే.. ‘ఉపే- సమీపే వాసం’ ఉపవాసం... న తు కాయస్య శోషణమ్‌’ అని పెద్దలు సెలవిచ్చారు. అంటే.. దైవ చింతనకు దగ్గరగా ఉండటం ఉపవాసం అంతేకాని ఏమీ తినకుండా శరీరాన్ని శుష్కింపచేయడం కాదని మన సంప్రదాయం స్పష్టంగా చెప్పింది. కడుపునిండా తింటే కంటినిండా నిద్ర వస్తుంది. ప్రకృతి అవసరాల కోసం ఒకటికి రెండుసార్లు వెళ్లాల్సి వస్తుంది.

భోజనం సిద్ధం చేసుకోవడానికీ కొంత సమయం పెట్టుకోవాలి. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు కాబట్టే ఉపవాసం రోజున భోజనం మానేసే ఆచారం మొదలయ్యింది. నేటి దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఉపవాసం చేయాలనుకున్నప్పుడు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం పరిమితంగా తీసుకుని వీలైనంత ఎక్కువ సమయం దైవచింతనలో గడపవచ్చు. కాకపోతే... ఉపవాసం పేరుతో ఒక రోజు భోజనం మానేయడం వల్ల  ప్రయోజనం లేకపోలేదు. మనిషికి విరామం అవసరమైనట్టే మన జీర్ణకోశానికి కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కల్పించడం తప్పనిసరి. వారానికో, పక్షానికో, నెలకో ఒక రోజు లేదా కనీసం ఒకపూట ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణకోశానికి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా జీర్ణప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ కారణంతోనూ ఉపవాసం పేరిట అప్పుడప్పుడూ భోజనం మానుకోవడం మంచిదేగా.

- ఆచార్య మల్లాప్రగడ
శ్రీమన్నారాయణమూర్తి ప్రవచనకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని