Sri Rama Navami: సకల గుణాభిరామా శ్రీరామా!

వాల్మీకి మహర్షి తన వద్దకు వచ్చిన నారదుణ్ణి అడిగిన ప్రశ్న ఇది. లోకానికి ఆదర్శంగా ఉండదగిన సర్వగుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా- అంటూ 16 గుణాలను ఏకరువు పెట్టాడు. అప్పుడు శ్రీరాముడి కథ సంక్షిప్తంగా చెప్పి కావ్యంగా రాయమన్నాడు దేవర్షి.

Updated : 30 Mar 2023 06:46 IST

కోన్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః...

ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం- అంటూ తనను తాను మానవుడిగా ప్రకటించుకున్న రాముడు దేవుడెందుకయ్యాడు? ఆయన పుట్టినరోజు మనకు పండుగెలా అయ్యింది? రాముడి పరిపాలన ఆదర్శప్రాయమని ఎందుకు అంటున్నాం? మొత్తం మీద రాముడు పురుషోత్తముడు ఎలా అయ్యాడు?

వాల్మీకి మహర్షి తన వద్దకు వచ్చిన నారదుణ్ణి అడిగిన ప్రశ్న ఇది. లోకానికి ఆదర్శంగా ఉండదగిన సర్వగుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా- అంటూ 16 గుణాలను ఏకరువు పెట్టాడు. అప్పుడు శ్రీరాముడి కథ సంక్షిప్తంగా చెప్పి కావ్యంగా రాయమన్నాడు దేవర్షి. ఆ సుగుణాల మూర్తిమత్వపు వెలుగే రామాయణం. ఆ స్థూలవెలుగులో దృష్టిని సునిశితం చేసుకున్న వాల్మీకి రామచంద్రమూర్తిలో 64 గుణాల్ని దర్శించాడు. అలా రామాయణం సర్వ జగత్తుకు ఆదర్శమైంది.
రాముడు చెప్పినట్లు.. ఆయన కూడా మన లాంటి వ్యక్తే అనుకుందాం! కానీ సామాన్యుల్లో అన్ని మంచి లక్షణాలు కనిపించవు. అందుకు కారణం సత్త్వరజ స్తమోగుణాలు. మనలో ఉంటూ మనల్నే మింగేసే ఈ గుణాల్ని ఎలా సంభాళించు కోవాలో, జీవితానికెలా సమన్వయించు కోవాలో రాముడి జీవితం మార్గదర్శనం చేస్తుంది. జీవితం త్రిగుణాత్మకమైంది. అవే సత్త్వరజస్తమోగుణాలు. సత్వగుణం దేవతల్ని, రజోగుణం యక్ష, రాక్షసుల్ని, తమోగుణం భూత, ప్రేత, పిశాచాల్ని ఆశ్రయించి ఉంటుందని భగవద్గీత చెబుతోంది. ఇక్కడ భూతాల్లో తమోగుణం ఉంటుందని కాక, తమోగుణం ఉన్న మనుషులు వాటిలా ప్రవర్తిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రజోగుణం యక్ష, రాక్షసుల్లా.. సత్వగుణం దేవతల్లా ప్రవర్తింపజేస్తుంది. అంటే మనుషులుగా సహజ స్వభావంతో ఉన్న మనం సాధనతో మాధవత్వానికి ఎదగనూవచ్చు, పిశాచ స్థాయికి దిగజారనూవచ్చు. ఆ విషయాన్నే వాల్మీకి అనేక సన్నివేశాల్లో రాముడి పాత్ర ద్వారా, ప్రత్యేకించి స్త్రీలపట్ల ఆయన ప్రవర్తించే విధానం ద్వారా చాటిచెప్పాడు.

ప్రతీకాత్మక సన్నివేశాలు

బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లే ప్రధాన ఘట్టాల్లో కొన్ని- తాటకా సంహారం, అహల్యా శాపవిమోచనం, సీతాస్వయంవరం. శ్రీరాముడికి తారసపడిన స్త్రీలలో వీరు ముఖ్యులు. గురువు విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళ్లి, దారిలో ఆయన ఆజ్ఞతో తాటకను సంహరించాడు. అలానే గౌతమ ముని ఆశ్రమంలో శిలాసదృశంగా ఉన్న అహల్యకు తన పాదధూళితో శాపవిమోచనం కలిగించాడు. జనకుడి కొలువులో శివధనస్సును విరిచి సీతను పరిణయం చేసుకున్నాడు. వీరిలో తాటక తమోగుణానికి, అహల్య రజోగుణానికి, సీత సత్త్వగుణానికి ప్రతీకలు.

తమోగుణం పూర్తిగా విడువదగింది. రజోగుణం కొంతవరకు క్షంతవ్యం. సత్త్వగుణం ఆచరణీయం, ఆదరణీయం. అందుకే తాటక విషయంలో రాముడు ఆలోచించలేదు, వెంటనే బాణాలతో సంహరించాడు. కానీ అహల్య విషయంలో ఆలోచించాడు. రజోగుణం తమోగుణమంత ప్రమాదమైందీ కాదు, విడిచిపెట్టదగిందీ కాదు. కొంత ప్రయత్నంతో దాన్ని సంస్కరించవచ్చు. అందుకే అహల్యాసాధ్విని పాదరజోలేశంతో సంస్కరించాడు. శుద్ధసత్త్వగుణానికి ప్రతీక సీత. సత్వగుణం సాధన యోగ్యం. అందుకే ఆ గుణాన్ని సాధించడం కోసం రాముడంతటివాడు కూడా పందెంలో పాల్గొని మరీ స్వీకరించాడు. ఇవి విశ్వామిత్రుడి మార్గ దర్శనంలోనే జరిగాయి. జీవితంలో వదిలేయాల్సిన, సంస్కరించాల్సిన, సాధించాల్సిన విషయాలను ఈ మూడు సన్నివేశాలూ ప్రతీకాత్మకంగా సూచిస్తున్నాయి.

మూర్తీభవించిన అహంకారం రావణుడు. అతడు సీతమ్మను అపహరించిన తర్వాత విలవిల్లాడిపోయాడు శ్రీరాముడు. అంటే భార్యాభర్తల మధ్య అహంకారం ప్రవేశించినప్పుడు సత్త్వగుణం మాయమై అన్యగుణాలు ప్రకోపించి మనిషిని తలకిందులు చేస్తాయని మహర్షి భావన. రావణుడి వల్ల ఒకసారి, ఓ అనామక మూర్ఖుడి వల్ల మరోసారి రాముడికి సీతావియోగం కలిగింది. అయితే మొదటిసారి అంతగా రెండోసారి కుమిలిపోలేదు. కారణం తొలిసారి తన అజాగ్రత్త వల్ల సీతను (సత్త్వగుణాన్ని) పోగొట్టుకున్న రాముడు, రెండోసారి రాజధర్మానికి కట్టుబడి తానే వదులుకున్నాడు. అంటే అవసరమైనప్పుడు రజస్తమోగుణాలనే కాదు సత్త్వగుణాన్ని కూడా త్యజించి త్రిగుణాతీతుడిగా వెలుగొందాడు. అప్పటివరకూ ఉత్తమపురుషుడిగా ఉన్న రాముడు పురుషోత్తముడిగా రూపొందాడు. అందుకే దేవుడయ్యాడు. కనుకనే ఆయన పుట్టినరోజును పండుగ చేసుకుంటున్నాం. అందుకే ఆ పరిపాలన మనకు ఆదర్శం. ఆ పురుషోత్తముడి నుంచి నేర్చుకోవాల్సింది అదే!

రాముని అనుసరించిన హనుమ

హనుమంతుడు శ్రీరాముణ్ణే సర్వస్వంగా భావించి, ఆయన మార్గాన్నే అనుసరించాడు. రాముడికి ముగ్గురు స్త్రీలు తారసపడినట్లు, ఆంజనేయుడికి మూడు ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటిది సాత్విక ఆటంకం మైనాకుడు. రెండోది రాజస ఆటంకం సురస. మూడోది తామస ఆటంకం సింహికా. అంజనీసుతుడు కూడా ఆటంకాలను అధిగమించి భక్తాగ్రేసరుడై భగవంతుడి స్థాయికి చేరుకున్నాడు.

జీవితంలో వదిలేయాల్సిన, అనుసరించాల్సిన, సాధించాల్సిన విషయాలను తెలియజేశాడు శ్రీరాముడు. ఉత్తమ పురుషుడిగా, పురుషోత్తముడిగా తనను తాను తీర్చిదిద్దుకోగలిగిన మార్గాన్ని స్వయంగా ఆచరించి ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ సకల గుణాభిరాముడికి సదా నమస్కరిద్దాం.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని