Viral Video: నీటిలో మునిగిపోతున్న తల్లిని కాపాడుకున్న పదేళ్ల బాలుడు

మూర్చ వచ్చి స్విమ్మింగ్‌ పూల్‌లో కొట్టుమిట్టాడుతున్న తల్లిని ఓ పదేళ్ల బాలుడు కాపాడుకున్నాడు. పరుగున వచ్చి తన తల్లిని మోసుకుంటూ వెళ్లి ప్రాణాలు రక్షించాడు........

Published : 31 Aug 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూర్చ వచ్చి స్విమ్మింగ్‌ పూల్‌లో కొట్టుమిట్టాడుతున్న తల్లిని ఓ పదేళ్ల బాలుడు కాపాడుకున్నాడు. పరుగున వచ్చి తన తల్లిని మోసుకుంటూ వెళ్లి ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అమెరికాలోని ఓక్లామాకు చెందిన లోరి కీనే అనే మహిళ తన పదేళ్ల కుమారుడు గోవిన్‌తో కలిసి ఇంటి వద్ద ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో స్నానం చేయాలని భావించారు. ఇద్దరూ కాసేపు సరదాగా ఈత కొట్టారు.

అయితే, కొద్దిసేపటి తర్వాత గోవిన్‌ బయటకు వెళ్లగా లోరి మాత్రం ఒంటరిగా పూల్‌లో స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఒక్కసారిగా మూర్చ వచ్చింది. దీంతో పూర్తిగా బిగుసుకుపోయిన ఆమె నీటిలో కొట్టుమిట్టాడుతూ మునిగిపోసాగింది. అయితే, తల్లి ప్రమాదంలో ఉండటాన్ని దూరం నుంచే గుర్తించిన కుమారుడు పరుగున వచ్చి నీటిలో దూకాడు. తల్లిని పట్టుకొని ఈదుకుంటూ వెళ్లి మెట్ల దగ్గర ఉండగా.. కొద్దిసేపటికే ఆమె భర్త రావడంతో ఇద్దరూ కలిసి ఆమెను పూల్‌లో నుంచి బయటకు తీసుకెళ్లి ప్రాణాలు రక్షించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఈ నెల 6న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కీనే స్వయంగా ఫేస్‌బుక్‌లో పంచుకుంది. తన జీవితంలో ఇలా ఏనాడూ భయపడలేదని పేర్కొంటూ.. కుమారుడు గోవిన్‌కు ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఆ బాలుడిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అతడు నిజమైన హీరో.. తల్లిని కాపాడుకున్న యోధుడు’ అంటూ అభినందిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని