Viral Video: శబ్ద కాలుష్యంతో ఇలాంటి నష్టాలూ జరుగుతాయ్‌!

అధిక శబ్దాల వల్ల ఇలాంటి నష్టాలు కూడా జరుగుతాయంటూ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు.

Published : 18 Sep 2022 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ ట్రాఫిక్‌ అధికారులు, పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదంటూ అవగాహన కల్పిస్తుంటారు. అధిక శబ్దాల వల్ల నష్టాలను వివరిస్తూ.. సైలెన్సర్లను మార్చే వాహనదారుల పట్ల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే, అయితే, అధిక శబ్దాల వల్ల ఒత్తిడి, రక్తపోటు, చెవుడు, గుండె సంబంధిత రోగాలే కాదు.. ఇలాంటి నష్టాలు కూడా జరుగుతాయంటూ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. కాగా అది వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ మహిళ గేదెను తోలుకొని వీధిలో వెళుతుండగా.. ఓ వ్యక్తి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ఎదురుగా వచ్చాడు. అయితే, సైలెన్సర్‌ మార్చడంతో ఆ బైక్‌ అధిక శబ్దం చేసుకుంటూ వచ్చింది. ఆ శబ్దానికి భయపడిపోయిన గేదె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆ బైకర్‌నే ఢీకొంది. ఫలితంగా కిందపడిపోయిన వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీసీ సజ్జనార్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ శబ్ద కాలుష్యం వలన జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను ఇప్పటికే 37వేల మందికి పైగా వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు