Anand Mahindra: పిల్లల్ని కాపాడే డ్రెస్‌.. ఆనంద్‌ మహీంద్రా ఇంప్రెస్‌

Floating T-shirt: ప్రమాదవశాత్తూ చిన్నారులు నీటిలో పడిపోయినప్పుడు మునిగిపోకుండా వారిని కాపాడేలా ఓ ఫ్రెంచ్‌ సంస్థ వినూత్న డ్రెస్‌ను రూపొందించింది. ఆ డ్రెస్‌ చూసి ఆనంద్‌ మహీంద్రా ఇంప్రెస్‌ అయ్యారు.

Published : 26 May 2023 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినూత్న ఆవిష్కరణలు, సరికొత్త సృజనాత్మకతను ఆసక్తిగా గమనించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. ఆ విషయాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ అందరితో పంచుకుంటారు. తాజాగా ఆయన పోస్ట్‌ చేసిన వీడియో (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓ టీ-షర్ట్‌ (t-shirt)కు సంబంధించిన డెమో వీడియోను మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఈ టీ-షర్ట్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోటీ (Floatee) అనే కంపెనీ రూపొందించింది. చిన్నారి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినా మునిగిపోకుండా పైకి తేలేలా ఆ డ్రెస్‌ను రూపొందించారు. అందుకు సంబంధించి ఓ డెమో వీడియోను కూడా విడుదల చేశారు. అందులో.. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీ-షర్ట్ వేసి నీటి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీ-షర్ట్‌ (Floating T-shirt) బెలూన్‌లా ఉబ్బి లైఫ్‌ జాకెట్‌లా మారింది. దీంతో ఆ బొమ్మ పైకి తేలింది. పిల్లలకు ఈ డ్రెస్ వేస్తే ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినా వారు మునిగిపోరని కంపెనీ తెలిపింది.

ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ఫ్లోటీ కంపెనీ ఆవిష్కరణను మెచ్చుకున్నారు. ‘‘దీనికి నోబెల్‌ బహుమతి రాకపోవచ్చు. కానీ, నా వరకు నోబెల్‌ లభించిన ఆవిష్కరణల కంటే గొప్ప సృజనాత్మకత ఇది. ఎందుకంటే.. ఇద్దరు పిల్లలకు తాతయ్యగా వారి భద్రత, శ్రేయస్సుకే నా అత్యధిక ప్రాధాన్యత’’ అని మహీంద్రా రాసుకొచ్చారు. ఈ వీడియో తెగ వైరల్‌ అవడమే గాక.. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. ఇది చాలా గొప్ప ఆవిష్కరణ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇంతకీ ఈ  టీ-షర్ట్‌ ధర ఎంతో తెలుసా..? అక్షరాలా 149 యూరోలు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13,200..!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని