Viral Video: గాండ్రిస్తూ దూసుకొచ్చిన పులి.. సఫారీ రైడ్‌లో పర్యాటకులకు భయానక అనుభవం!

సఫారీ రైడ్‌కు వెళ్లిన పర్యాటకుల వాహనంపైకి ఆగ్రహంతో ఓ పులి దూసుకురావడంతో వారంతా భయంతో వణికిపోయారు.

Published : 27 Apr 2023 18:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సఫారీ రైడ్‌(Safari Ride)కు వెళ్లిన కొందరు పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది.  వాహనంలో కూర్చొని పార్కును సందర్శిస్తూ ఫొటోలు తీసుకున్న పర్యాటకుల బృందంపైకి ఓ పులి(Tiger) గాండ్రిస్తూ దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో వారంతా భయంతో కేకలు పెడుతూ వణికిపోయారు.  ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. అదే వాహనంలో ఉన్న  ఓ వ్యక్తి తమకు ఎదురైన ఈ భయానక అనుభవాన్ని కెమెరాలో బంధించగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరోవైపు, ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(IFS) అధికారి సుశాంత నందా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను పరిశీలిస్తే.. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న కొందరు పర్యాటకులు పొదల వెనుక ఉన్న పులి ఫొటోలు తీస్తుండగా.. అది ఆగ్రహంతో ఒక్కసారిగా గాండ్రిస్తూ వారిపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే, డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని పులి నుంచి దూరంగా వెనక్కి పోనివ్వడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికే ఆ పులి తిరిగి పొదల వైపు వెళ్లిపోయింది.  ఊహించని ఘటనతో పర్యాటకులు షాక్‌కు గురయ్యారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని