Published : 11 Oct 2022 01:22 IST

Yameng: పర్వతాలపై నుంచి ‘పాలధార’.. వీడియో షేర్‌ చేసిన ‘అరుణాచల్‌’ సీఎం

ఇటానగర్‌: ఈశాన్య భారతం.. అనేక ప్రకృతి అందాలకు పెట్టింది పేరు! పచ్చనైన లోయలు, సహజసిద్ధ జలపాతాలతో ఇక్కడి రాష్ట్రాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని ఓ సుందర జలపాతం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదే యమెంగ్‌ జలపాతం(Yameng Waterfalls). అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ(Pema Khandu) ట్విటర్‌ వేదికగా దీనికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. పచ్చని పరిసరాలు, చుట్టూ విస్తరించి ఉన్న సులుంగ్తి పర్వతాల నడుమ.. అంతెత్తునుంచి నేలకు జాలువారుతోన్న ‘పాలధార’ దృశ్యాలు ఇందులో కనువిందు చేస్తున్నాయి.

‘యమెంగ్ జలపాతం అద్భుతమైనది! తవాంగ్- మాగో మార్గంలో ఈ ఐకానిక్ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇక్కడి పచ్చదనం, మనోహర దృశ్యాలు.. మీ ఊహకు అందనంతగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి విశిష్టతను ఆస్వాదించేందుకుగానూ ఈ ప్రాంతాన్ని సందర్శించండి’ అని పెమా ఖండూ క్యాప్షన్‌ పెట్టారు. ఇక్కడి చుమీ గ్యాట్సే 108 జలపాతాల్లో యమెంగ్‌ ఒకటని స్థానికులు చెబుతుంటారు. నెటిజన్లు సైతం యమెంగ్‌ దృశ్యాలను రమణీయంగా ఉన్నాయని అభివర్ణిస్తున్నారు. ‘వావ్‌.. ప్రకృతి బహుమతి ఎంత అందంగా ఉంది’ అని ఒకరు కామెంట్‌ పెట్టగా.. బ్యూటిఫుల్‌ అరుణాచల్‌ అని మరొకరు స్పందించారు.

ఇదిలా ఉండగా.. కొవిడ్‌ లాక్‌డౌన్‌, తదనంతర పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకుగానూ అరుణాచల్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది ‘దేఖో అప్నా ప్రదేశ్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి పెమా ఖండూ.. రాష్ట్రంలోని అందమైన ప్రదేశాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే ఆయన తవాంగ్ జిల్లాలోని బేఘర్ గ్రామ ప్రకృతి దృశ్యాల వీడియోను పోస్ట్‌ చేశారు. గతంలోనూ ఇక్కడి అనేక ప్రకృతి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని