Viral Video: భర్తపై ప్రేమ.. నుదుటిపై భార్య పచ్చబొట్టు..!

భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Published : 21 May 2023 22:52 IST

బెంగళూరు: భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో అయితే చిన్నపాటి బహుమతులు ఇచ్చుకోవడం, సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేయడం, హాలీడే ట్రిప్‌లకు తీసుకెళ్లడం.. ఇలా ఎన్నో రకాలుగా తమ ప్రేమను తెలియజేస్తుంటారు. మరికొంతమంది మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా.. తమ జీవిత భాగస్వాముల పేరును చేతిపై పచ్చబొట్టు (Tatoo) వేయించుకుంటారు. కానీ, బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ మహిళ తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్న రీతిలో ఆలోచించింది. ఏకంగా తన భర్త పేరును నుదుటిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

బెంగళూరుకు చెందిన కింగ్‌ మేకర్‌ టాటూ స్టూడియో పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ట్రూ లవ్‌ పేరుతో ఓ రీల్‌ను పోస్ట్‌ చేసింది. అందులో టాటూ ఆర్టిస్ట్‌ ఒక మహిళ నుదుటిపై సతీష్‌ అనే పేరును స్టిక్కర్‌తో అతికించి మార్క్‌ చేస్తాడు. తర్వాత స్టిక్కర్‌ తీసేసి.. పచ్చబొట్టు పొడవడం ప్రారంభిస్తాడు. అయితే, నుదిటిపై టాటూ మెషీన్‌తో రాయడం మొదలు పెట్టిన తర్వాత ఆమె నొప్పి భరించలేక పచ్చబొట్టు వేయడం ఆపమని కోరుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో త్వరలో అంటూ పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆమె భర్త ఫొటోను సైతం పోస్ట్‌ చేయాలని కోరుతున్నారు. మరికొంతమంది మాత్రం భార్యాభర్తలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండొచ్చు కానీ, దాన్ని వ్యక్తపరిచేందుకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరంలేదని కామెంట్‌ చేస్తున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని