Bihar: రైల్లో చోరీకి యత్నం.. ఈ దొంగకు ఎలా బుద్ధి చెప్పారో చూడండి!

రైల్లో చోరీకి యత్నించిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు! కిటికీలోంచి సెల్‌ఫోన్‌ను కాజేసేందుకు యత్నించిన అతని చేయిని గట్టిగా దొరకబుచ్చుకోవడంతో.. నిందితుడు అలాగే రైలు బయట...

Published : 16 Sep 2022 01:31 IST

పట్నా: రైల్లో చోరీకి యత్నించిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు! కిటికీలోంచి సెల్‌ఫోన్‌ను కాజేసేందుకు యత్నించిన అతని చేయిని గట్టిగా దొరకబుచ్చుకోవడంతో.. నిందితుడు అలాగే రైలు బయట గాల్లో వేలాడుతూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలోనే ప్రయాణికులు అతని రెండు చేతులూ లోపలికి లాగిపట్టుకుని.. దారిలో కిందపడిపోకుండా కాపాడారు. దీంతో ఏకకాలంలో అతనికి గుణపాఠంతోపాటు ప్రాణభిక్ష లభించినట్లయింది! బిహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక్కడి బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ రైలు.. సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినప్పుడు ఓ వ్యక్తి కిటికీలోంచి ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ చోరీకి యత్నించాడు. కానీ, అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు.. వెంటనే అతని చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఒకవైపు రైలు కదులుతుండటం.. మరోవైపు చేయిని విడిచిపెట్టకపోవడంతో.. అతను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు ప్లాట్‌ఫాం దాటింది. దీంతో అతను బయటే వేలాడాడు. ఈ క్రమంలోనే పట్టు కోసం మరో చేయిని లోపలికి చాచాడు.

మరోవైపు.. లోపలున్న వారు అతని రెండు చేతులనూ పట్టుకుని, కింద పడిపోకుండా చూశారు. ఇలా దాదాపు 10 కిలోమీటర్లపాటు అతను కదులుతున్న రైలు బయట గాల్లోనే వేలాడాడు. చివరకు రైలు ఖగారియా సమీపించినప్పుడు.. అతన్ని విడిచిపెట్టారు. వెంటనే అతను పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దొంగకు గుణపాఠం చెప్పారని, కొందరు అంటే, ఇలా కిటికీకి వేలాడదీయడం దారుణమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లోనూ బెగుసరాయ్‌లో ఓ నిందితుడు.. వంతెన రెయిలింగ్‌పై వేలాడుతూనే ఓ రైలు డోర్‌వద్ద కూర్చున్న ప్రయాణికుడి వద్ద నుంచి ఫోన్‌ కొట్టేయడం గమనార్హం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని