Delhi: సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తి.. బైక్‌ దొంగల ఆటకట్టు!

ఓ సెక్యూరిటీ గార్డు తన సమయస్ఫూర్తితో.. బైక్‌ చోరీకి యత్నించిన ఇద్దరు దుండగుల (Bike Thieves) ఆటకట్టించాడు. నిందితులు ఇద్దరు బైక్‌పై పారిపోతుండగా.. సరైన సమయంలో కాలనీ గేటు అడ్డుగా వేసి వారిని...

Published : 27 Sep 2022 22:36 IST

దిల్లీ: ఓ సెక్యూరిటీ గార్డు తన సమయస్ఫూర్తితో.. బైక్‌ చోరీకి యత్నించిన ఇద్దరు దుండగుల (Bike Thieves) ఆటకట్టించాడు. నిందితులు బైక్‌పై పారిపోతుండగా.. సరైన సమయంలో కాలనీ గేటు అడ్డుగా వేసి వారిని నిలువరించాడు. దిల్లీ(Delhi)లోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దక్షిణ దిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ వద్దకు మంగళవారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము మున్సిపల్‌ అధికారులమని.. భవనం తనిఖీకి వచ్చినట్లు స్థానికులకు నమ్మబలికారు. కొద్దిసేపటికి.. ఓ డెలివరీ ఏజెంట్‌ తనకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు కాలనీలోని ఓ ఇంట్లోకి వెళ్లాడు.

ఇదే అదనుగా బయట ఉన్న అతని బైక్‌ను స్టార్ట్‌ చేసిన నిందితులు.. వేగంగా కాలనీ నుంచి బయటపడేందుకు యత్నించారు. అంతలోనే బాధితుడు కేకలు వేయడంతో.. దూరం నుంచే అప్రమత్తమైన కాలనీ సెక్యూరిటీ గార్డు సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. వెంటనే గేటు మూసేశాడు. అంతలోనే వారు వేగంగా వచ్చి.. గేటులోంచి దూసుకెళ్లేందుకు యత్నించి, దాన్ని ఢీకొన్నారు. దీంతో, బైక్‌ అక్కడే ఇరుక్కుపోయింది. నిందితుల్లో ఒకరిని స్థానికులు వెంటనే పట్టుకున్నారు. మరొకడు తప్పించుకున్నా.. పొరుగు కాలనీలోని పార్కులో దొరికిపోయాడు. స్థానికుల సమాచారంతో గోవింద్‌పురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని