Viral Video: టీచరమ్మా ఇదేం తీరు.. విద్యార్థులతో ఇలాగేనా?

బ్రెజిల్‌లో ఓ టీచర్‌ విద్యార్థులతో తరగతిగదిలో అసభ్యంగా డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.ఆమె తీరుపట్ల కొందరు మండిపడుతుండగా.. మరికొందరు ఆమె బోధనా తీరుకు మద్దతిస్తున్నారు.

Published : 16 May 2023 01:27 IST

బ్రసిలియా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట కొందరు టీచర్ల (Teachers) అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఇటీవల అమెరికాలో మహిళా టీచర్లు ఏకంగా విద్యార్థులతోనే వికృత చేష్టలకు పాల్పడి అరెస్టు కాగా.. తాజాగా  బ్రెజిల్‌(Brazil)లో ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే విద్యార్థులతో అసభ్యకర రీతిలో డ్యాన్స్‌ చేస్తూ ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. సిబెల్లీ ఫెరీరా అనే టీచర్‌ ఉద్దేశం ఏమైనప్పటికీ విద్యార్థులతో ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆమె తీరుపై కొందరు మండి పడుతుండగా.. మరికొందరు మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం. 

సిబెల్లీ ఫెరీరా బ్రెజిల్‌లోని ఓ స్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. టిక్‌టాక్‌లో 9.8మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో అయితే 1.2 మిలియన్ల మంది ఉన్నారు. అయితే, తరగతి గదిలో విద్యార్థులను బోధన దిశగా ఆకర్షించేందుకు తనదైన శైలిలో ‘అశ్లీలత’తో డ్యాన్స్‌ చేస్తూ టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో ఆమె తీరు పట్ల పలువురు నెటిజన్ల తీవ్ర మండిపడుతున్నారు. ‘సోషల్‌ నెట్‌వర్క్‌లు, టెక్నాలజీకి వ్యతిరేకంగా విద్యార్థులు బోధనపై దృష్టి కేంద్రీకరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. వారి ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని బోధనను వారికి చేరువ చేసేందుకే’’ ఇలా చేస్తున్నట్టు ఫెరీరా స్థానిక మీడియాతో అన్నారు.

అయినా గానీ, తరగతి గదిలో అసభ్యకరమైన వస్త్రధారణలో విద్యార్థులతో స్టెప్పులేయడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, ఫెరీరా అభిమానులతో పాటు మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమె చర్యలను సమర్థిస్తున్నారు. విద్యను మరింత వినోదభరితంగా అందిస్తున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.  తరగతి గదిలో విద్యార్థులకు బోధనపై ఆసక్తిని పెంచేందుకు సరదాగా నృత్యం చేస్తూ ప్రపంచాన్ని ప్రేమలో పడేలా చేసిన సిబెల్లీని ఉద్యోగం నుంచి తొలగించడం దురదృష్టకరమంటూ ఇంకొందరు ట్వీట్లు పెడుతున్నారు. టిక్‌టాక్‌లో భారీగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈ టిక్‌టాక్‌ స్టార్‌ టీచర్‌  బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ లావ్‌రాస్‌ నుంచి జీవశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. దీంతో చాలా మంది అభిమానులు అకడమిక్స్‌లో తన కెరీర్‌ను విస్తరించుకోవాలని, పూర్తి కాలం ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారాలని సలహా ఇస్తున్నారు.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు