Viral video: ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్‌

పాత వంతెనను కూల్చేసిన అధికారులు దాని స్థానంలో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అయితే, ప్రారంభించే రోజే అది కుప్పకూలిపోయింది.........

Published : 08 Sep 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్షాకాలంలో ఓ నదిని దాటేందుకు అధికారులు అక్కడ కొత్తగా ఓవంతెనను నిర్మించారు. కొద్దిరోజుల్లోనే నిర్మాణం మొత్తంపూర్తవగా.. ఆ బ్రిడ్జిని ప్రారంభించే రోజు రానే వచ్చింది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయగా..అధికారులు, స్థానిక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రిడ్జిపై ఎక్కి రిబ్బన్‌ కట్‌ చేయడమే ఆలస్యం.. ఆ నూతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఊహించని ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(DRC)లో ఈ ఘటన జరిగింది. అక్కడి పాత వంతెనను కూల్చేసిన అధికారులు దాని స్థానంలో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అయితే, ప్రారంభించేరోజే అది కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళా అధికారిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడగా.. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ అది పూర్తిగా కిందకు కూలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మిగతా వారంతా ఎలాగోలా కూలిన వంతెన దిగిన తర్వాత.. అక్కడికి కొద్దిగంటలకు అది మొత్తంగా కింద కూలిపోయి రెండు ముక్కలైనట్లు స్థానికులు వెల్లడించారు.

గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 6.4 మిలియన్ల మంది వీక్షించారు. అధికారుల నాసిరకం పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రారంభం రోజే కుప్పకూలిందంటే నిర్మాణంలో ఎంతటి నాణ్యత పాటించారో తెలిసిపోతోంది’ అంటూ ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించాడు. మిలియన్ల ప్రజాధనాన్ని వృథా చేశారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని