Mobile school: ఆ చిన్నారుల తలరాతల్ని మార్చే ‘బస్‌ స్కూల్‌’.. ఎలా బోధిస్తున్నారో చూశారా?

Mobile school: విద్యకు దూరమైన పిల్లలే లక్ష్యంగా సూరత్‌కు చెందిన ఓ సంస్థ అద్భుతమైన ఆలోచన చేసింది. బస్సునే తరగతి గదిగా అధునిక వసతులతో మొబైల్‌ స్కూల్‌ మార్చేసి పిల్లలకు విద్యనందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Updated : 17 May 2023 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్కూల్‌ బస్‌’(School Bus) మనందరికీ  తెలిసిందే కదా. ఆ పదాలను కాస్త రివర్స్‌ చేసి పలికితే.. ‘బస్‌ స్కూల్‌’. అంటే బస్సులోనే బడి(Mobile school) అన్నమాట. ఇది వినడానికి కొత్తగా, వింతగా ఉంది కదూ..! పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లే  బస్సుల్ని మనం రోజూ చూస్తుంటాం..  కానీ అదే బస్సులో పాఠాలు నేర్పిస్తే..? ఎంత అద్భుతమైన ఆలోచనో కదూ! ఇలాంటి వైవిధ్యమైన ఆలోచనతో ఫుట్‌పాత్‌లు, మురికివాడల్లోని చిన్నారులకు విద్యాబోధన అందిస్తూ వారి తలరాతల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది ఓ సంస్థ. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌(Gujarat)లోని సూరత్‌(Surat)కు చెందిన విద్యాకుంజ్-విద్యాపీఠ్ గ్రూప్‌.. విద్యకు దూరంగా ఉంటూ ఎక్కడో మురికివాడలు(Slums), ఫుట్‌పాత్‌(Footpaths)లలో నివసించే పేద పిల్లలకు విద్యనందించే సంకల్పంతో బ్రహ్మాండమైన వసతులతో మొబైల్‌ స్కూల్‌(Mobile school)ను ఏర్పాటు చేసింది. బస్సులోనే బెంచీలు, టీవీ, ఇంటర్నెట్‌, ఫ్యాన్‌, లైట్లు వంటి అత్యాధునిక వసతులు కల్పించింది. అంతేకాకుండా బస్సును తరగతి గదిలా తీర్చిదిద్ది విద్యార్థులకు రోజూ పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు ఉండే చోటకు రోజూ  ఆ సంస్థ ప్రతినిధులు వెళ్తూ వారిని తీసుకొచ్చి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కించి వినోదాత్మకంగా పాఠాలు బోధిస్తున్నట్టు ఈ వీడియోలో చూడొచ్చు.

ఫుట్‌పాత్‌లపై నివసించేవారితో సహా పిల్లలందరికీ విద్య అవసరమని తమ ఆశయమని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందన్నారు.  ఈ మొబైల్‌ స్కూల్‌ ద్వారా బస్సులో సాధ్యమయ్యే ప్రతి సౌకర్యాన్నీ అందించేందుకు తాము ప్రయత్నించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ బస్సులో 32మంది పిల్లలు ఉన్నారని.. ఈ సంఖ్య పెరిగితే మాత్రం మూడు గంటలు చొప్పున రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించనున్నట్టు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని