Viral Video: ఆకులు, పుట్టగొడుగుల నుంచి సంగీతం.. ఎలా ఉందో ఓ సారి వినండి

సంగీతం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మందే ఉంటారు. కొంతమందికైతే మ్యూజిక్‌ వినడం దినచర్యగా ఉంటుంది.  ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సంగీతాన్ని చాలావరకు సెల్‌ఫోన్‌ల్లోనే వింటుంటాం.

Published : 09 Jan 2022 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: సంగీతం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మందే ఉంటారు. కొంతమందికైతే మ్యూజిక్‌ వినడం దినచర్యగా ఉంటుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సంగీతాన్ని చాలావరకు సెల్‌ఫోన్‌ల్లోనే వింటుంటాం. అయితే, సంగీత స్వరాలను సృష్టించడానికి వీణ, నాదస్వరం, వేణవు, తబలా, పిల్లనగ్రోవి.. ఇలా వాయిద్యాలను ఉపయోగిస్తారని తెలుసు.  కానీ, ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ప్రకృతిలోని వస్తువులను ఆధారం చేసుకుని సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. ఆయనే కెనడాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్ నాయర్‌. ఈయన తండ్రి భారతీయుడు, తల్లి కెనడా మహిళ.

తరుణ్‌ నాయర్‌ ఆకులు, పుట్టగొడుగుల నుంచి సంగీతాన్ని పుట్టిస్తున్నాడు. ఈయనకు ఎలక్ట్రానిక్ మ్యూజిక్, వైబ్రేషన్స్ అంటే ఇష్టం. 2006లో తనలాంటి అభిరుచి గల వ్యక్తులతో కలిసి ‘దిల్లీ టూ డబ్లిన్’ పేరుతో ఓ కెనడా బ్యాండ్‌ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం తరుణ్... పుట్టగొడుగుల నుంచి మ్యూజిక్ రాబట్టే పనిలో ఉన్నారు. అత్యంత సహజమైన పద్ధతిలో ఈ సంగీతాన్ని వినిపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. పుట్టగొడుగుల తలలు, ఇతర భాగాల నుంచి సంగీతం వస్తోందని ఆయన చెబుతున్నారు.

అసలు ఈ సంగీతాన్ని ఎలా సృష్టిస్తున్నాడు?

పుట్టగొడుగులకు ప్రత్యేక ఎలక్ట్రికల్ పరికరాలను అమర్చుతున్న తరుణ్... వాటి నుంచి వచ్చే స్పందనలను సంగీతంగా మార్చుతున్నాడు. ఆ స్పందనలను నేరుగా వినే అవకాశం లేదు. కాబట్టి... వాటిని ఎలక్ట్రికల్ పరికరాలతో వాయిస్‌గా మార్చుతున్నట్లు తరుణ్‌ నాయర్‌ పేర్కొన్నారు. మొక్కలకు బయో ఎలక్ట్రిసిటీ ఉంటుందని పేర్కొంటున్న ఆయన.. ప్రకృతి నుంచి వచ్చే సంగీతం, మనం వినే వాయిద్యాల సంగీతం కంటే చాలా వినసొంపుగా ఉంటుందని అంటున్నాడు. ఆకులు, పుట్టగొడుగుల నుంచి సంగీతాన్ని సృష్టించడానికి ఇంట్లోనే ఓ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నాడు. 

‘మొక్కలు స్వయంగా సంగీతాన్ని ఆలపించవు. నేను వాటికి సర్క్యూట్ కేబుల్స్ అమర్చినప్పుడు.. వాటి లోపలి జరిగే చిన్న చిన్న మార్పులను కూడా కేబుల్స్ గ్రహిస్తాయి. దానికి అనుగుణంగా సంగీతం వస్తుంది. ఆ మ్యూజిక్ మనం వినొచ్చు. మొక్కల ఎనర్జీ లెవెల్స్‌ని వినదగ్గ టోన్స్‌గా మార్చుతున్నాను. ఫలితంగా వచ్చే ఔట్‌పుట్ అద్భుతంగా ఉంటుంది’ అని నాయర్ పేర్కొన్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని